బీజేపీ ఓడించింది అంబేద్కర్‌ని.. అది ఓ దళిత్‌ని‌..

BJP Defeat our candidate because he is an Ambedkar : BSP - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 'ఉత్తరప్రదేశ్‌ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ముందు చెప్పినట్లుగానే మా అభ్యర్థిని ఓడించింది. ఎందుకంటే ఆ వ్యక్తి అంబేద్కర్‌ కాబట్టి.. అది కూడా ఓ దళిత్‌ కాబట్టి' అని బహుజన్‌ సమాజ్‌ పార్టీ నేత సతీష్‌ చంద్ర మిశ్రా అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 10 స్థానాలకు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లతోపాటు బీఎస్పీ సీటును కూడా కొల్లగొట్టి మొత్తం 9 సీట్లు సొంతం చేసుకుంది. మరో సీటును ఎస్పీ దక్కించుకుంది. అయితే, అంతకుముందు జరిగిన ఉప ఎన్నికల్లో ఎస్పీకి సాయం చేసి తమ ఓటమికి కారణమైందనే ఆగ్రహంతోనే బీఎస్పీపై బీజేపీ పగ పెంచుకుని ఆ ప్రకారం తీర్చుకుందని మండిపడ్డారు.

తమకు ఓటు పడకుండా ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందని, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ ఇందులో కీలక పాత్ర పోషించి డబ్బును ఎగజల్లారని ఆరోపించారు. దళితులపై బీజేపీ పగబట్టిందని, ఉద్దేశ పూర్వకంగా తాము నిలబెట్టిన దళిత అభ్యర్థిని ఓడించినట్లు తెలిపారు. 'సమాజ్‌వాది పార్టీ కాంగ్రెస్‌ పార్టీ నుంచి మద్దతు కోరడంలో వేరే ఉద్దేశం ఏమీ లేదు.. వారి ఓట్లను మాకు బదిలీ చేయడం మాత్రమే. ముందు చెప్పినట్లుగానే బీజేపీ మా అభ్యర్థిని ఓడించింది.. ఎందుకంటే ఆయన అంబేద్కర్‌ కాబట్టి.. దళిత్‌ కాబట్టి.. ఈ విషయాన్ని మేం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళతాం. దళిత అభ్యర్థిని బీజేపీ ఏ విధంగా ఓడిస్తుందో వివరిస్తాం' అని మిశ్రా చెప్పారు. రాజ్యసభ బరిలో బీఎస్పీ బీమ్‌ రావ్‌ అంబేద్కర్‌ను దింపగా తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఓడిపోయారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top