మరో పది స్థానాలకు బీజేపీ అభ్యర్థులు ఖరారు!

BJP candidates finalize for 10 seats - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ మరో పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అధ్యక్షతన సోమవారం ఇక్కడ జరిగిన ఎన్నికల కమిటీ సమావేశంలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, నిజమాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల ఖరారుపై చర్చించారు. ఇందులో 10 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిసింది. వీటిల్లో నిజామాబా ద్‌ అర్బన్‌ నుంచి యెండల లక్ష్మీనారాయణ పేరు ఉన్నట్లు సమాచారం.

ఖరారు చేసిన నియోజకవర్గాల పేర్లు బయటకు వెల్లడించలేదు. ఇప్పటికే 38 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించగా అందులో కొన్నింటిలో అసంతృప్త నేత లు పార్టీకి రాజీనామా చేసి స్వతంత్రులుగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. పరకాలలో డాక్టర్‌ సంతోష్‌ టికెట్‌ ఆశించగా పార్టీ డాక్టర్‌ విజయచందర్‌రెడ్డికి టికెట్‌ ఇచ్చింది. కోరుట్లలో మొదటి నుంచి పార్టీలో పనిచేస్తూ టికెట్‌ ఆశిస్తున్నవారు ఉండగా, అమిత్‌షా నేతృత్వంలో జేఎన్‌ వెంకట్‌ పార్టీలో చేరిన వెంటనే ఆయనకు టికెట్‌ లభించడంతో అసంతృప్తులు పెరుగుతున్నారు.

ఈ నేపథ్యం లో ఖరారైన అభ్యర్థుల పేర్లను బయటకు రానివ్వకుండా చూసుకుంటున్నా రు. ఈ నెల 31న మరోసారి ఎన్నికల కమిటీ భేటీ కావాలని నిర్ణయించింది. ఆ రోజున మరిన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను పార్టీ పార్లమెంటరీ బోర్డుకు పంపి నవంబర్‌ 1న ఆమోదం తరువాతే అధికారికంగా ప్రకటించాలని భావిస్తున్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, సీనియర్‌ నేత దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ మేనిఫెస్టోలో ఉచిత విత్తనాల హామీ!
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రైతులకు ఉచితంగా విత్తనాలు అందించడం సాధ్యమా? ఆ హామీని పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిస్తే ఎలా ఉంటుందన్న దానిపై బీజేపీ లోతుగా పరిశీలిస్తోంది. సోమవారం ఇక్కడ పార్టీ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌ మల్లారెడ్డి అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచడంతోపాటు వాటిని ఉచి తంగా అందించే అంశంపైనా చర్చించినట్లు తెలిసింది.

అయితే, దీనిపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలన్న భావనకు వచ్చారు. కృష్ణా, గోదావరి నదీజలాలను కలిపే అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపర్చాలని నిర్ణయించారు. మొత్తానికి 3, 4 రోజుల్లో మేనిఫెస్టోలో పొందుపరుచాల్సిన అంశాలతో డ్రాఫ్ట్‌ రూపొందించి పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు ఎన్నికల కమిటీ అందజేయనుంది. తరువాత సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. సమావేశంలో కేంద్ర జల వనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్, మేనిఫెస్టో కమిటీ సభ్యులు మాధవి, రాకేష్, నందా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరామ్‌ రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top