ఉద్యమ నాయకుడు : బండా ప్రకాష్‌ | Banda Prakash Special Story | Sakshi
Sakshi News home page

ఉద్యమ నాయకుడు

Apr 11 2018 1:16 PM | Updated on Apr 11 2018 1:16 PM

Banda Prakash Special Story - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ :జిల్లా ప్రజలకు సూపరిచితులైన సామాజిక వేత్త, విద్యావేత్తగా పేరొంది న బండా ప్రకాష్‌ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు అయ్యారు. 1969 ఉద్యమం నుంచి ప్రజా జీవితంలో మమేకమయ్యారు. చదువు వద్దంటూ అజ్ఞాతంలోకి వెళ్లారు... తిరిగి వచ్చి డాక్టర్‌ పట్టా పొందారు. అజ్ఞాతాన్ని వీడినా.. సామాజిక సృహ కోల్పోలేదు. సేవా కార్యక్రమాలు కొనసాగించారు. ఇటీవల రాజ్య సభకు ఎన్నికయ్యారు. తన జీవన ప్ర స్థానంలో ముఖ్య అంశాలను ‘సాక్షి’తో ఆయన పంచుకున్నారు. బండా ప్రకాష్‌ ఆమంటున్నారో ఆయన మాటల్లోనే..

ఉద్యమ నేపథ్యం
1969లో పదో తరగతిలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. 1970లో జరిగిన ఎన్నికల్లో ప్రజా సమితి పార్టీ తరఫున ప్రచారంలో ఉదృతంగా పాల్గొన్నాను. సీకేఎం కాలేజీలో డిగ్రీలో చేరిన తర్వాత వామపక్ష భావజాలం వైపు ఆకర్షితుడినయ్యాను. ఆర్‌ఎస్‌యూ వ్యవస్థాపకుడిలో ఒకడిగా ఉన్నాను. అప్పుడు ఉస్మానియాలో విద్యార్థి నాయకుడుజార్జిరెడ్డి హత్యకు నిరసనగా వరంగల్‌లో భారీ ర్యాలీ నిర్వహించాను. ఆ రోజుల్లో హైకోర్టు జడ్జిగా ఉన్న వ్య క్తిని ఉస్మానియా వర్సిటీకి వైస్‌ చాన్స్‌లర్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ పరీక్షలు బహిష్కరించాం. ఓ ర కంగా డిగ్రీ చదివే రోజుల్లో సీకేఎం కాలేజీని ఉద్యమా ల అడ్డాగా మార్చేశాం. అప్పటి విద్యాశాఖ మంత్రి మండలి వెంకటకృష్ణారావు సీకేఎం కాలేజీకి వస్తున్నారని తెలుసుకుని వరవరరావును జైలు నుంచి విడుదల చేయాలంటూ హోరెత్తించాం. దీంతో మమ్మల్ని కాలేజీలో నిర్బంధించారు. చుట్టూ పోలీసులు ఉన్నా రు. వీళ్లందరినీ ఛేదించుకుంటూ కాలేజీ గేటు దగ్గరికి వచ్చి సబ్‌జైలు–దేశాయిపేట అని రాసి నిరసన తెలి పాం. సుమారు మూడు సార్లు కాలేజీ నుంచి తొలగి స్తే.. కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్‌ తెచ్చుకున్నాం. ఈ ఉద్యమాలు చేస్తూనే డిగ్రీ మధ్యలో వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లాను.

కొండపల్లితో అనుబంధం
అజ్ఞాతంలో ఉన్నప్పుడు కొండపల్లి సీతారామయ్యతో ఎనిమిది నెలలు కలిసి పని చేశాను. హైదరాబాద్‌లో పార్సిగుట్ట, రాంనగర్‌ ఏరియాల్లో ఒకే ప్రాంతంలో కలిసి ఉన్నాం. ఆ సమయంలో కొండపల్లి చెప్పే పొలిటికల్‌ క్లాసులు శ్రద్ధగా వినేవాన్ని. సీతారామయ్యకు సమాచారం చేరేవేసే పని ఎక్కువగా నేనే చేసేవాడిని. 1977లో నాగ్‌పూర్‌లో జరిగిన ప్లీనరీకి వెళ్లాను. ఆ ప్లీనరీకి గణపతి, మల్లావఝల కోటేశ్వరరావు వచ్చారు. తర్వాత కాలంలో వాళ్లు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. వామపక్ష సాహిత్యంలో కృష్టా జిల్లాలో జరుగుతున్న సంస్కరణ పోరాటాలకు పెద్దపీట వేస్తూ తెలంగాణ సాయుధ పోరాటానికి తగిన ప్రా«ధాన్యం ఇవ్వకపోవడాన్ని ఆ ప్లీనరీలో నిరసించాను. ఎమర్జెన్సీ తర్వాత అజ్ఞాతం నుంచి బయటకు వచ్చాను.

మేనమామ మాటలతో..
‘గొప్పగొప్ప వాళ్లు జైలులో ఉంటూ చదువుకున్నారు. గొప్ప పుస్తకాలు రాశారు. నువ్వు కూడా ప్రపంచ చరిత్ర ను అధ్యయనం చేయి. చదువు ఆపొద్దు’ అంటూ మేనమామ చెప్పిన మాటలు నాపై గొప్ప ప్రభావం చూ పించాయి. దీంతో ఆజ్ఞాతం నుంచి బయటకు రాగానే తిరిగి డిగ్రీలో జాయిన్‌ అయ్యాను. మావో సేటూంగ్‌ను పూర్తిగా అధ్యయనం చేశాను. ప్రపంచ చరిత్ర చదివా ను. విప్లవ సాహిత్యం విరివిగా చదివాను. కమ్యునిస్టు మెనిఫెస్టో, దాస్‌ కాపిటల్, అమ్మ, ఏడుతరాలు వంటి పుస్తకాలు చదివాను. ఇదే స్ఫూర్తితో ఎంఏలో గోల్డ్‌మెడల్‌ సాధించాను. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను. గ్రామీణాభివృద్ధిపై  పీహెచ్‌డీని పూర్తి చేశాను.

రాజకీయాల్లోకి..
1981లో ఏంఏ థర్డ్‌ సెమిస్టర్‌లో ఉండగా నోటిఫికేషన్‌ వచ్చింది. అప్పటి సిటీ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ గాజుల జనార్దన్‌పై ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేసి అత్యధిక మెజార్టీతో గెలిచాను. అప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న రెండు గ్రూపుల కారణంగా నాతో పాటు గెలిచిన 16 మంది ఇండిపెండెంట్లతో కలిసి కాంగ్రెస్‌లో చేరి వైస్‌ చైర్మన్‌ పదవి చేపట్టాను. పనులు సరిగా చేయని కాంట్రాక్టర్లను ఆధారాలతో పట్టించి మూడేళ్లు బ్లాక్‌లిస్టులో పెట్టాను. ఆ తర్వాత కేయూ, ‘కుడా’ పాలకమండలి సభ్యుడిగా పని చేశాను. 1996 నుంచి 2001 వరకు జయశంకర్‌ సార్‌తో కలిసి అనేక కార్యక్రమాలు చేపట్టాను.

సామాజిక దృక్పథం..
అజ్ఞాతంలో ఉన్నప్పుడు మమ్మల్ని ఆదరించి అన్నం పెట్టింది, చేతికి డబ్బులు ఇచ్చింది సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజలే. అందువల్లే ఎక్కడ ఉన్నా సామాజిక సృహతోనే పని చేశాను. కార్మిక నాయకుడిగా ఆజాంజాహి మిల్లు పరిరక్షణ కోసం ప్రయత్నించాను.  కాంగ్రెస్‌లో ఉంటూనే ముదిరాజ్‌ మహాస భ పేరుతో ముదిరాజ్‌లను సమీకరించి తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున భాగస్వామ్యం అయ్యేలా శ్ర మించాను. సకల జనుల సమ్మె,లో కీలక పాత్ర పోషించాం. తెలంగాణ వచ్చాక అభివృద్ధిలో ముదిరా జ్‌ల వాటా కోసం ప్రయత్నించాం. మత్స్యకారుల సంక్షేమం, ఆర్థిక స్వావలంబన కోసం సీఎం కేసీఆర్‌ అనేక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement