అబద్ధాలు చెప్పినందుకు మోదీ క్షమాపణలు చెప్పాలి: గెహ్లోత్‌

Ashok Gehlot Demands Modi to Apologise For Death Toll Hoax - Sakshi

జైపూర్‌ : పుల్వామా ఉగ్ర దాడులకు ప్రతీకారంగా భారత్‌ మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశం మొత్తం మోదీకి మద్దతు తెలపుతుండగా.. విపక్షాలు మాత్రం మెరుపు దాడులను ఎన్నికల డ్రామా అంటూ విమర్శిస్తున్నాయి. తాజాగా రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌ మెరుపు దాడులపై సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓడిపోతామని అనిపించినప్పుడల్లా బీజేపీ, మోదీ ఇలాంటి పనులు చేస్తారని.. అందుకుగాను పాకిస్తాన్‌ సాయం తీసుకుంటారని ఆరోపించారు. గుజరాత్‌ ఎన్నికల ముందు కూడా ఇలాంటి డ్రామానే చేశారని మండిపడ్డారు. అంతేకాక దాదాపు 350 మంది ఉగ్రవాదులను హతమార్చమంటూ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మెరుపు దాడులకు సంబంధించిన వాస్తవాలను వెల్లడించి.. తప్పుడు ప్రకటనలు చేసినందుకు మోదీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ ఆయన చేశారు.

ఈ సందర్భంగా గెహ్లోత్‌ మాట్లాడుతూ.. ‘సైనికుల త్యాగాలను నేను ఎన్నటికి ప్రశ్నించబోను. దేశ రక్షణ కోసం శ్రమించే వారంటే నాకు చాలా గౌరవం. కానీ మెరుపు దాడుల విషయంలో బీజేపీ ప్రజలను మోసగిస్తుంది. సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసి దాదాపు 350 మంది ఉగ్రవాదులను హతం చేసినట్లు బీజేపీ ప్రకటించింది. కానీ అలా అబద్దపు ప్రకటనలు చేసినందుకు ఇప్పుడు చింతిస్తుంది. యూపీఏ హయాంలో కశ్మీర్‌లో ‌4,239 మంది ఉగ్రవాదులను హతమార్చాం. కానీ బీజేపీ కేవలం 876 మందిని మాత్రమే చంపింది. నిజంగా ఇది చాలా దారుణమైన పరిస్ధితి’ అని మండి పడ్డారు.

అంతేకాక ‘ఓ వైపు అమిత్‌ షా మెరుపు దాడుల్లో 250 మంది మరణించారంటారు.. అటు ఐఏఎఫ్‌ చీఫ్‌ మాత్రం ఎంతమంది చచ్చారో మేం లెక్కపెట్టలేదు అంటారు.. మరో మినిస్టర్‌ అహ్లూవాలియా అయితే ఏకంగా మెరుపు దాడుల్లో ఎవరు మరణించలేదు.. కేవలం వారిని భయపెట్టడానికే ఇలాంటి ప్రయత్నం చేశామంటూ ఒకదానికొకటి పొంతన లేని ప్రకటనలు చేసి జనాలను కన్ఫూజ్‌ చేస్తున్నార’ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఓడిపోతామని అనిపించినప్పుడల్లా బీజేపీ ఇలాంటి నాటకాలకు తెర తీస్తుంది. గుజరాత్‌ ఎన్నికల ముందు కూడా ఇలానే జరిగింది’ అని తెలిపారు. అంతేకాక దేశంలోని అన్ని వ్యవస్థలను మోదీ నిర్విర్యం చేస్తున్నాడని.. వాటిని తన చేతిలో పెట్టుకుని దుర్వినియోగం చేస్తున్నాడని మండిపడ్డారు. (పాఠ్యాంశంగా ‘అభినందన్‌’)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top