7 లక్షలు తెచ్చుకొని 3 లక్షల ఇళ్ల నిర్మాణమే చేపట్టారు

AP Minister Botsa Satyanarayana Speech In AP Assembly - Sakshi

అసెంబ్లీలో మంత్రి బొత్స సత్యనారాయణ

అమరావతి : గత ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పీఏంఏవై) కింద 7లక్షల ఇళ్లను మంజూరు చేసుకొని 3 లక్షల ఇళ్ల నిర్మాణమే చేపట్టిందని మంత్రి బొత్ససత్యానారాయణ తెలిపారు. చివరి రోజు బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా ఆయన మాట్లాడారు. 3 లక్షల ఇళ్లు నిర్మాణం చేపట్టినప్పటికి ఒక్క ఇళ్లు కూడా లబ్దిదారుడికి అందలేదన్నారు. 300,325,430 ఎస్‌ఎప్టీల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టారన్నారు. వీటి నిర్మాణానికి షేర్‌వాల్‌ టెక్నాలజీకి గరిష్టంగా చదరపు అడుగుకు రూ.2,311 చెల్లించారని తెలిపారు. ఈ తరహా విధానాలతో పేదలపై రుణభారం పడిందన్నారు. గృహ నిర్మాణంలో మూడు కంపెనీలకే అత్యధిక కాంట్రాక్ట్‌లు కట్టబెట్టారని, వీటిపై రివర్స్‌ టెండరింగ్‌ వెళ్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ పాదయాత్రలో చెప్పిన విషయాలు వాస్తవమని తెలిపారు. ఈ విషయంలో సభ్యులకు సందేహాలుంటే సంబంధిత ఫైల్స్‌ కూడా చూపిస్తామన్నారు. పీఏంఏవై పథకం కింద పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు కేటాయిస్తామన్నారు. 

విలేజ్‌ మ్యాప్‌లు మిస్సయ్యాయి..
విలేజ్‌ మ్యాప్‌లు చాలా మిస్సయ్యాయని మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. 11158 గ్రామాలకు సర్వేయర్లను నియమిస్తున్నామని పేర్కొన్నారు. రీ సర్వేపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పట్టుదలతో ఉన్నారని తెలిపారు. 2023 నాటికి పూర్తి చేయాలనేది ప్రభుత్వ ధ్యేయమన్నారు. 

ఉద్యానవన రైతులకు నీటి సౌకర్యం లేదు
అనంతపురం జిల్లాలో ఉద్యానవన రైతులకు నీటి సౌక్యం లేదని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సభ దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యాన పంటలకు సాగునీరు అందించడంలో గత ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. గతంలో రెయిన్‌ గన్ల పేరుతో నిధులు వృథా చేశారన్నారు. ఉద్యానవన రైతులను ప్రోత్సహిస్తామని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రైతుకు 8 నుంచి 10 ట్యాంక్‌ల వరకు నీటిని అందిస్తున్నామన్నారు. రైతు నష్టపోతే తిరిగి మళ్లీ పంట వేసుకునేలా చూస్తామన్నారు. చిరు ధాన్యాల బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయం కూడా తీసుకున్నామన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top