
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణ మూర్తి ఎన్నికను సవాలు చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టును ఆశ్రయించారు. కరణం బలరాం ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఆయన ఎన్నికల పిటిషన్ (ఈపీ) దాఖలు చేశారు. ఇందులో కరణంతోపాటు ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు అభ్యర్థులను, రిటర్నింగ్ అధికారిని ప్రతివాదులుగా పేర్కొన్నారు.
వాస్తవాలు చెప్పకపోతే ఎన్నికను రద్దు చేయొచ్చు
‘కరణం బలరాం సమర్పించిన నామినేషన్ ప్రజాప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా లేదు. చట్టప్రకారం బహిర్గతం చేయాల్సిన వాస్తవాలను వెల్లడించకపోయినప్పటికీ ఆయన నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. కరణం బలరాం తన నామినేషన్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారు. వాస్తవాలను దాచిపెట్టారు. భార్య, తనపై ఆధారపడి జీవిస్తున్న వారి వివరాలను బహిర్గతం చేయకుండా తొక్కిపెట్టారు. నామినేషన్‌లో భార్య పేరును కరణం సరస్వతిగా పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆయనకున్న మరో భార్య ప్రసూన గురించి ప్రస్తావించలేదు. తనపై ఆధారపడి జీవిస్తున్నవారు ఎవరూ లేరని తెలిపారు. ప్రసూన గురించి, ఆమె ఆదాయం, ఆస్తి, అప్పుల గురించి వివరించలేదు. పలువురు ప్రముఖులు, కుటుంబసభ్యుల సమక్షంలో 1985లో ప్రసూనతో బలరామకృష్ణ మూర్తి వివాహం శ్రీశైలంలో జరిగింది. కరణం బలరాం, ప్రసూనలకు అంబిక కృష్ణ 1989లో హైదరాబాద్‌లోని సెయింట్ థెరిస్సా ఆస్పత్రిలో జన్మించింది.
అంబిక ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్‌లో, ఆధార్ కార్డులో తండ్రి పేరు కరణం బలరామకృష్ణ మూర్తి అని ఉంది. అంబిక అన్నప్రాసన, మొదటి పుట్టినరోజు వేడుకలు, అక్షరాభ్యాస వేడుకలకు సంబంధించిన ఫొటోల్లోనూ బలరాం ఉన్నారు. అంబిక కృష్ణ ప్రస్తుతం ఎల్‌ఎల్‌బీ చదువుతోంది. బలరాం తన నామినేషన్‌లో ప్రసూన, అంబిక కృష్ణల వివరాలను పొందుపరచకుండా దాచిపెట్టారు. ఎన్నికల చట్ట నిబంధనల ప్రకారం.. కరణం నామినేషన్‌ను చట్ట ఆమోదయోగ్యమైన నామినేషన్‌గా పరిగణించడానికి వీల్లేదు. అందువల్ల ఆయన నామినేషన్‌ను చెల్లనిదిగా ప్రకటించాలి. బలరాం ఎన్నికను రద్దు చేయండి. అంతేకాకుండా చీరాల నియోజకవర్గం నుంచి నేను ఎన్నికైనట్లు ప్రకటించండి’ అని కృష్ణమోహన్ తన పిటిషన్‌లో వివరించారు.