గల్ఫ్‌ కార్మికులకు హక్కులు కల్పించాలి: కుంతియా 

AICC Secretary Kuntia Fires On State Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వలస కార్మికులకు అన్ని రకాల హక్కులు కల్పించాలని ఏఐసీసీ కార్యదర్శి ఆర్‌సీ కుంతియా అన్నారు. గురువారం బేగంపేటలో వలసలపై ప్రపంచ సంఘటిత ఒప్పందం గురించి దక్షిణ భారత స్థాయి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ కార్యదర్శి ఆర్‌సీ కుంతియా, సీఎల్పీ నేత జానారెడ్డి, మాజీ స్పీకర్‌ సురేశ్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కుంతియా మాట్లాడుతూ ఇండియాలో బ్రిటిషర్లు ప్రారంభించిన వలసలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. గల్ఫ్‌ దేశాల్లో వలస కార్మికులు పడుతున్న ఇబ్బందులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. 

విదేశాల్లో ఎంత కష్టపడినా వారికి సరైన ఫలితం దక్కడం లేదన్నారు. దళారులు, ఏజెంట్ల చేతిలో మోస పోయి, కుటుంబాలకు దూరంగా కాలం వెళ్లదీస్తున్నారన్నారు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వాలు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. గల్ఫ్‌ దేశాల్లో కొన్ని కంపెనీలు కార్మికులకు రెండేళ్లుగా జీతాలు కూడా చెల్లించడం లేదన్నారు. వలస కార్మికులు గల్ఫ్‌ దేశాలు వెళ్లి ఇబ్బందులు పడకుండా మన దేశంలోనే వారికి ఉపాధి కల్పించే ప్రయత్నాలు చేయాలన్నారు. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రం వెళ్లి పనిచేస్తున్న వారికి పనిచేసే చోట ఓటు హక్కు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.  

రూ.500 కోట్ల హామీ ఏమైంది? 
జానారెడ్డి మాట్లాడుతూ మూడు కోట్ల మంది భారతీయులు విదేశాల్లో పనిచేస్తుండటం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉద్యోగభారం తగ్గిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్‌ కార్మికుల కోసం రూ.500 కోట్లు ఖర్చు పెడతామని ఇచ్చిన హామీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదన్నారు.  బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించినా అది ఏ విధంగా ఖర్చు పెడతారనేది స్పష్టత లేదన్నారు. సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌ నగరం వలసలకు ఒక మంచి ఉదాహరణ అని అన్నారు. 10 లక్షల వలస కార్మికులు తెలంగాణలో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top