137వ రోజు పాదయాత్ర డైరీ

137th day paadayatra dairy  - Sakshi

15–04–2018, ఆదివారం
జి.కొండూరు మండలం, ముత్యాలంపాడు క్రాస్, కృష్ణా జిల్లా

హోదా పోరును నీరుగార్చడం న్యాయమేనా బాబూ..
ఈ రోజు పాదయాత్రలో ఇద్దరు చిన్నారులు చెప్పుకున్న బతుకు కష్టం గుండెను బరువెక్కించింది. విజయవాడ చిట్టినగర్‌కు చెందిన రమాదేవి, శ్రావణి అనే ఆ చిట్టి తల్లులు.. కొత్తూరు తాడేపల్లి దగ్గర నన్ను కలిశారు. ‘అన్నా.. మా నాన్న రోజూ తాగొచ్చి మా అమ్మను, మమ్మల్ని కొడుతున్నాడు. అనరాని మాటలంటున్నాడు. బియ్యానికి దాచిపెట్టుకున్న డబ్బులు కూడా లాక్కుపోతున్నాడు.

అంతటితో ఆగకుండా.. మా బడి దగ్గరకొచ్చి గొడవ చేస్తున్నాడు. మా నాన్న తాగుబోతని స్కూల్లో పిల్లలెవరూ మాతో మాట్లాడటం లేదన్నా’అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ చిన్నారుల అమాయకపు ముఖాలు చూస్తుంటే చాలా బాధనిపించింది. నేరం ఆ చిన్నారుల తండ్రిది కాదు.. దగ్గరుండి మరీ మద్యాన్ని ప్రోత్సహిస్తూ.. ప్రజలను ఆ వ్యసనానికి బానిసలుగా మారుస్తూ.. మద్యం మీద వచ్చే ఆదాయపు మత్తులో మునిగి తేలుతున్న చంద్రబాబు సర్కారుది.  

వేమవరంలో రోడ్డు పక్కనే మట్టి కుండలు తయారుచేస్తున్న బాలుడిని చూసి ఆగాను. పన్నెండేళ్లకే పనిలో పడిన పవన్‌కుమార్‌ చదువుపై ఆరా తీశాను. ‘బడికైతే పోతున్నాడు.. కానీ ఎంత చదివినా ఉద్యోగాలొచ్చే పరిస్థితి లేదు. అందుకే ఈ పని నేర్పిస్తే రేపు ఎలాగోలా బతికేస్తాడు కదా సార్‌’అని ఆ పిల్లాడి తల్లి చెప్పింది. ఎల్లకాలం ఒకే రకంగా ఉండదని, మంచి రోజులొస్తాయని.. పిల్లాడిని బాగా చదివించాలని చెప్పాను.

ఆ గ్రామంలో కుమ్మరి వృత్తిపై ఆధారపడిన దాదాపు వంద కుటుంబాలవారు భారంగా బతుకీడుస్తున్నారంటూ.. ఆవేదన వ్యక్తం చేశారు అక్కడి సోదరులు. మట్టి మాఫియా, ఇసుక మాఫియాలతో రాష్ట్రాన్ని దోచుకుంటున్న ప్రభుత్వ పెద్దలు.. కుమ్మర్లకు ఇచ్చే మట్టిపైన కూడా ఆంక్షలు విధించడం అత్యంత దారుణం.  తెలుగు అకాడమీ ఉద్యోగులు కలిశారు. రాష్ట్ర విభజన తర్వాత అకాడమీ విభజనపై దృష్టిపెట్టని ప్రభుత్వ పెద్దలు కమీషన్లకు కక్కుర్తిపడి పుస్తకాలకు సంబంధించి కోట్లాది రూపాయల ముద్రణ కాంట్రాక్టును ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టారట. ఇక అంతా వారి ఇష్టారాజ్యమే అయిపోయిందట.

వాళ్లు పుస్తకాలు ఎప్పుడు అందజేస్తే అప్పుడే. విద్యా సంవత్సరం సగం అయిపోయినా పుస్తకాల పంపిణీ జరగకపోవడం, విద్యార్థులు ఇబ్బంది పడటం మామూలైపోయిందట. రాష్ట్రంలోని రెండు బడా కార్పొరేట్‌ విద్యా సంస్థలైతే నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు ముద్రించుకుని విద్యార్థులకు కట్టబెడుతున్నాయట. 2010లో ఇలాగే నిబంధనలకు విరుద్ధంగా, కాపీరైట్‌ చట్టాన్ని ఉల్లంఘించి పాఠ్య పుస్తకాలను ముద్రించి విద్యార్థులకు అమ్ముతున్నారని.. నారాయణ సంస్థల అధినేత నారాయణగారిపై కేసు బుక్‌ చేసి, పోలీసులు అదుపులో తీసుకుని విచారించారని పేపర్‌ కటింగ్‌లు చూపించి మరీ వివరించారు.

ఈ ప్రభుత్వ తీరుతో తమ ఉద్యోగాలు కూడా ఊడే పరిస్థితి నెలకొందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం ఏం చేసినా.. స్వలాభమో, రాజకీయ ప్రయోజనాలో, కక్ష సాధింపు చర్యలకో తప్ప ప్రజల కోసం చిత్తశుద్ధితో చేసే కార్యక్రమం ఒక్కటీ లేదనిపిస్తోంది.ప్రత్యేక హోదా కోసం రాష్ట్రం మొత్తం ఏకమై గళం వినిపిస్తోంది. హోదా కోసం ఎందాకైనా.. అంటూ యువత కదం తొక్కుతోంది. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షను దేశానికి శక్తిమంతంగా వినిపించడానికి.. నేడు జరగబోయే బంద్‌ను శాంతియుతంగా, సంపూర్ణంగా నిర్వహించి విజయవంతం చేద్దాం.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ప్రత్యేక హోదా కోసం జరిగే ప్రతి పోరాటాన్నీ నీరుగార్చేందుకు ప్రయత్నించిన విషయం వాస్తవం కాదా? మీ ఎంపీలతో రాజీనామాలు, ఆమరణ దీక్షలు చేయించకపోగా.. హోదా కోసం చేసే బంద్‌లు వేస్ట్‌.. అంటూ ముందే ప్రకటించడం, బంద్‌లో పాల్గొనే నాయకులపై కఠిన చర్యలు తప్పవంటూ పోలీసు నోటీసులిప్పించడం, బంద్‌కు దూరమంటూ మీ పార్టీ వైఖరిని ప్రకటించడం హోదా ఉద్యమాన్ని నీరుగార్చడం కాదా? ముఖ్యమంత్రిగా ముందుండి పోరాడాల్సిందిపోయి.. పోరాడుతున్న ప్రతిపక్షానికి, ప్రజా సంఘాలకు, ప్రజలకు వెన్నుపోటు పొడవడం ధర్మమేనా?   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top