నరేంద్ర మోదీ రాయని డైరీ

నరేంద్ర మోదీ రాయని డైరీ - Sakshi


మధ్యాహ్నం ఫ్లయిట్‌కి చైనా వెళ్లాలి. ముందు ప్రమాణ స్వీకారాలు చే యించేస్తే, పోర్ట్‌ఫోలియోల సంగతి అమిత్‌షా చూసుకుంటాడు.     

చైనాలో బ్రిక్స్‌ మీటింగ్‌. మీటింగ్‌కి వచ్చేవాళ్లంతా ప్రెసిడెంట్లు. నేనొక్కడినే ప్రైమ్‌ మినిస్టర్‌ని. ప్రత్యేకంగా కనిపించాలి.



ఫ్లయిట్‌ కుదుపులకు సూట్‌కేస్‌లోని బట్టలు చెదరకుండా లగేజీ సర్దమని చెప్పాను. మూడున్నర గంటల ప్రయాణానికి బట్టలకేం కాదని ఎక్స్‌టర్నల్‌ ఎఫైర్స్‌ మినిస్ట్రీ నుంచి నివేదిక రావడానికైతే వచ్చింది కానీ నాకైతే డౌటే. ఎన్ని ఇంటెలిజెన్స్‌ రిపోర్టులు ఫెయిల్‌ కాలేదూ!

‘‘దీనికి పెద్దగా ఇంటెలిజెన్స్‌ అవసరం లేదు సార్‌’’ అన్నాడు సుబ్రహ్మణ్యం జైశంకర్‌.



‘‘దేనికి పెద్దగా ఇంటెలిజెన్స్‌ అక్కర్లేదు జైశంకర్‌’’ అని అడిగాను.

‘‘అదే సర్‌.. మూడున్నర గంటల విమాన ప్రయాణానికి సూట్‌కేస్‌లో సర్దిన బట్టలకు ఏమీ కాదు అని చెప్పడానికి’’ అన్నాడు.

జైశంకర్‌ ఫారిన్‌ సెక్రెటరీ. ‘వెరీ ఇంటెలిజెంట్‌ ఫెలో’ అని అతడి గురించి సుష్మా స్వరాజ్‌ ఎప్పుడో చెప్పినట్లు గుర్తు.



మయన్మార్‌లో వేసుకోవలసిన బట్టల బ్యాగ్‌ సపరేట్‌గా ఉంది. అక్కడేం సమ్మిట్‌ లేదు. మయన్మార్‌ ప్రెసిడెంట్‌తో కలిసి అక్కడా ఇక్కడా తిరగడమే. బట్టలతో ప్రాబ్లమ్‌ లేదు. ఆయన పేరుతోనే ప్రాబ్లమ్‌!  సుష్మా స్వరాజ్‌కి ఫోన్‌ చేసి నా ప్రాబ్లమ్‌ చెప్పాను.

సుష్మ నవ్వారు. ‘‘పేరుతో పనేముంది మోదీజీ.. ‘మిస్టర్‌ ప్రెసిడెంట్‌’.. ‘మిస్టర్‌ ప్రెసిడెంట్‌’ అంటూ ఉండండి చాలు’’ అన్నారు.

‘‘అది ఓకే.. సుష్మాజీ, అక్కడున్న రెండు రోజుల్లో ఒక్కసారైనా ఆయన్ని పేరుతో సంబోధిస్తే సంతోషిస్తారు కదా.. భారత ప్రధానికి తన పేరు గుర్తుందని..’’ అన్నాను.

‘‘నిజమే మోదీజీ.. అయితే పొరపాటున మీరాయన్ని మిస్టర్‌ ‘హ్యూటిన్‌ జా’ అనబోయి  మిస్టర్‌ ‘జా హ్యూటిన్‌’ అనే ప్రమాదం ఉంది’’ అన్నారు సుష్మ.

‘‘అందులో ప్రమాదం ఏముంది సుష్మాజీ!’’ అని అడిగాను.



‘‘జా హ్యూటిన్‌ అనే ఆయన బర్మా ఆర్మీ చీఫ్‌. చనిపోయి పదేళ్లవుతోంది మోదీజీ’’ అన్నారు సుష్మ. ‘వావ్‌..! సుష్మాజీ’ అనుకున్నాను. బ్రిలియంట్‌ తను.

‘‘కానీ సుష్మాజీ.. ఇంకో ప్రాబ్లమ్‌ కూడా ఉంది. మయన్మార్‌ ప్రెసిడెంట్‌ ఒక మగవాడు అన్న విషయమే నాకు గుర్తుండడం లేదు’’ అన్నాను.



సుష్మ పెద్దగా నవ్వారు. ‘‘ఎక్స్‌టర్నల్‌ అఫైర్స్‌ మినిస్టర్‌ని నాకే గుర్తుండడం లేదు మోదీజీ. తల నిండా పూలు పెట్టుకున్న ఆంగ్‌ సాన్‌ సూకీ నే ఎప్పటికీ నాకు మయన్మార్‌ ప్రెసిడెంట్‌లా అనిపిస్తుంటారు’’ అన్నారు.

నవ్వాను. ‘‘సుష్మాజీ.. ఎప్పటికీ మీరే మా ఎక్స్‌టర్నల్‌ మినిస్టర్‌’’ అన్నాను.

                                                                            -మాధవ్‌ శింగరాజు

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top