సురక్ష విసిరిన 'విజ్ఞాన వీచికలు' | Dr. K. Aruna Vyas book vijnana veechikalu special story | Sakshi
Sakshi News home page

సురక్ష విసిరిన 'విజ్ఞాన వీచికలు'

Jan 7 2017 2:32 AM | Updated on Sep 5 2017 12:35 AM

సురక్ష విసిరిన 'విజ్ఞాన వీచికలు'

సురక్ష విసిరిన 'విజ్ఞాన వీచికలు'

మంచిని మాత్రమే చెబుతాం. చెడు కనిపించినా విని పించినా అసలు చెప్పం అనేది ‘చందమామ’ కథల పత్రిక ఆరు దశాబ్దాలకు పైగా చాటి ఆచరించిన సాంప్ర దాయిక సంస్కారం.

మంచిని మాత్రమే చెబుతాం. చెడు కనిపించినా విని పించినా అసలు చెప్పం అనేది ‘చందమామ’ కథల పత్రిక ఆరు దశాబ్దాలకు పైగా చాటి ఆచరించిన సాంప్ర దాయిక సంస్కారం. సరిగ్గా ఈ సంస్కారాన్నే పాటిస్తూ తాను దర్శిస్తున్న ప్రపంచంలోని చెడును వదిలి మంచిని మాత్రమే చెప్పాలనే తపన కలిగిన చేయి తిరిగిన రచయిత డాక్టర్‌ కె. అరుణా వ్యాస్‌. గత 30 ఏళ్లుగా తెలుగు సాహిత్యాన్ని, సమాజాన్ని తనదైన కోణంలో దర్శిస్తూ, తన అధ్యయనానికి, తన రచనా జిజ్ఞాసకు సమన్వయం కలిగిస్తూ ఆమె చేస్తున్న రచనా వ్యాసంగంలో కొత్త మారాకు ‘విజ్ఞాన వీచికలు’.

ఉమ్మడి రాష్ట్రం నుంచి కొన సాగుతున్న పోలీసు మాసపత్రిక ’సురక్ష’లో గత కొన్నే ళ్లుగా ఆమె రాసిన బహుముఖీన వ్యాసాల సంకలనమే ఈ విజ్ఞాన వీచికలు. ఆధునిక పోకడలు, జీవన శైలిలో పడి కొట్టుకుపోతున్న నేటి యువతరానికి అటు ప్రాచీన సాంస్కృతిక సాహిత్య కాంతులనుంచి ఆధునిక సామా జిక సాహిత్య వెలుగుల వరకు వీచిన వివిధ పవనాలను గుదిగుచ్చి ఒక చోట చేర్చి కూర్చిన రచనే విజ్ఞాన వీచి కలు. 36 వ్యాసాల సమాహారంగా నిలిచిన ఈ సంక లనం ప్రాచీన, ఆధునిక జీవన ధోరణులు, విలువలకు అక్షర రూపమిచ్చిన రచయిత సంకల్పబలానికి నిక్క మైన నిదర్శనం.

ప్రాచీన, ఆధునిక సాహిత్య రీతులపై దశాబ్దాలుగా రచయిత సాగించిన అధ్యయనం ఈ పుస్తకంలో వివిధ రకాల అంశాలలో దర్శనమిస్తుంది. రోమియో జూలి యట్‌ నుంచి సీతారాముల వరకు ప్రేమతత్వం గురించి, ప్లేటో నుంచి సర్వేపల్లి వరకు ఉపాధ్యాయుల బోధన కంటే వారి వ్యక్తిత్వం వేసే ప్రభావం గురించి, పుస్తక పఠనం, స్త్రీలపై హింస, కుటుంబ బంధాలు, వ్యస నాలు, తల్లిదండ్రుల పట్ల బాధ్యత, అక్షరాస్యత, టెక్నా లజీ లాభనష్టాలు, యవ్వనోద్రేకాలు, ఆరోగ్య సమ స్యలు వంటి పలు అంశాలను వర్గీకరించి అత్యంత సరళమైన భాషలో పొందు పర్చిన ఈ సంకలనంలో రచయిత శైలి పఠనీయతకు పట్టం గట్టడం గమనార్హం.  ఒక్క సెల్‌ఫోన్‌ వల్ల ప్రపం చంలో పెద్దవన్నీ చిన్నవిగా మారిపోయిన వైనాన్ని బూచాడమ్మా బూచాడు– బుల్లిపెట్టెలో ఉన్నాడు వ్యాసం చిత్రికపడుతుంది. ఇలా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసక్తికరంగా, సుబోధకంగా చెబుతూనే ప్రాచీన సాంప్రదాయంలో వాటి తాలూకూ బీజాలను గుర్తుచేస్తూ సాగిన వ్యాసాలు ఆధునికత ముసుగులో దాగిన అవలక్షణాలను హెచ్చరిస్తాయి కూడా.

ప్రత్యేకించి గడచిన నాలుగు దశాబ్దాలుగా తెలుగు పాఠకులకు చిరపరిచితమైన శైలి అరుణా వ్యాస్‌ సొంతం. అటు ఉపనిషత్తులనూ, స్మృతులనూ, ఇటు ఆధునిక కవులు శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి కవితలను పొదగడం రచయిత ప్రత్యేకత. అక్కడే కవిత్రయం, పోతన పాఠ కులకు కనువిందు చేస్తే ఆ పక్కనే సర్వసామాన్య విష యాలు, సాంకేతిక విషయాలు ఆసక్తిని కలిగిస్తుం టాయి. రేడియో వంటి సాంకేతిక పరిణామ క్రమాన్ని చెప్పే క్రమంలో దాంట్లో పనిచేసిన ప్రసార ప్రముఖు లను గుర్తు చేస్తూ శాస్త్రీయ సంగతులను వ్యక్తుల చరిత్ర లతో ముడిపెట్టడం హృద్యంగా ఉంటుంది.

అలా వ్యాసాల్లోకి తొంగిచూస్తే చాలు. రామా యణ, భారత, పురాణ, ప్రబంధాల నుంచి శ్లోకాలతో పాటు గురజాడ, నండూరి సుబ్బారావు, కృష్ణశాస్త్రి, శంకరంబాడి, వేటూరి సుందరరామమూర్తి వరకు ప్రముఖ రచయి తలు రాసిన  గేయాలూ, పద్యాలు, సినీ పాటలు పాఠకులను అలా పలకరిస్తుంటాయి. హిమా లయాల్లో ప్రస్తుత కాలుష్యం గురించి మాట్లాడుతూ మనుచరిత్రలోని అటజని గాంచి.. పద్యం ద్వారా ఆ హిమవన్నగ గతవైభవాన్ని గుర్తు చేయడం మనో హరంగా ఉంటుంది.

సురక్ష పత్రిక వ్యాసాలు కాబట్టి పోలీసు వాణికి ప్రాతినిధ్యం ఇచ్చే ధోరణి పలు సందర్భాల్లో కని పించినప్పటికీ, విషయాన్ని శక్తివంతంగా పొందుప ర్చడం, చూడగానే ఆకట్టుకునే శైలితో పాఠకులను తన వెంట తీసుకెళ్లడంవల్ల ఈ సంకలనం సురక్ష పరిధిని దాటిన విస్తృతిని సంతరించుకుంది. ఒక రచయితలోని అధ్యయన గాఢతను, ఆకర్షణీయ శైలిని ఒకే చోట చూడ దలిచిన పాఠకులకు విజ్ఞాన వీచికలు నిజంగానే విందు భోజనమే.
– కె. రాజశేఖరరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement