దోవ చూపిన దొనకొండ

దోవ చూపిన దొనకొండ - Sakshi


దొనకొండకు రోడ్డు మార్గాన్ని కూడా విస్తరించుకుంటే సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా ఉంటుంది. దొనకొండ గురించి ఇది నిపుణుల అంచనా.  ఈ ప్రాంతంలో 50 వేల ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉంది. కాబట్టే వినుకొండ, దొనకొండ, మార్టూరు ప్రాంతం శిమరామకృష్ణన్ కమిటీ దృష్టిలో పడి ఉండవచ్చు.

 

 ‘ముత్యాలతో ఆరబోసినా రేవీటి

 నృపతు లే టేట పండిన యశస్సు,

 భాస్కరుని దాన ధార లే పట్టణంబు

 చారు చరితకు బంగారు నీరు బోసె..’

 

 ఏ వినుకొండనైతే ఈ విధంగా తనను కన్నకడుపుగా భావించుకుని ధన్యుడనయ్యానని మహాకవి జాషువా ఉప్పొంగిపోయాడో, ఆంధ్రుల చరిత్రలో పాలనా వైభవా నికి సంబంధించి దేశ చరిత్రలోనే విశిష్ట పుటలను శతాబ్దాల క్రితమే నమోదు చేసుకుని వినుతికెక్కిందో, సరిగ్గా ఆ వినుకొండకూ దాని పరిసరాలకూ మరోసారి రాజధాని వెలుగు ప్రసరించే ముహూర్తం సమీపిస్తున్నదా? సీమాం ధ్రకు నడిబొడ్డుగా వెలుగొందుతూ ఇరు ప్రాంతాల వారికి దాదాపు సమదూరంలో ఉండే బొల్లాపల్లి, వినుకొండ, దొనకొండ, మార్టూరులతో కూడిన త్రిభుజాకార లేదా త్రికోణం ఆకృతిలో ఉన్న ఆ ప్రాంతం కొత్త సొగసులను అద్దుకోబోతున్నదా?

 

 రాజధాని ఎంపిక కసరత్తు

 తెలుగువారి ఉమ్మడి రాష్ట్రాన్ని నిట్టనిలువుగా చీల్చిన తరువాత, పరిశేష ఆంధ్ర ప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. పునర్వ్యస్థీకరణ చట్టం (2014) అమలులోకి వచ్చిన దరిమిలా కొత్త రాజధాని ఎంపిక కోసం శివరామకృష్ణన్ బృందాన్ని కేంద్రం నియమించింది. స్వల్ప వ్యవధిలోనే అయినా ఈ బృందం 13 జిల్లాలకు గాను, 12 జిల్లాలలో పర్యటించింది. వివిధ వర్గాల వారినీ, ప్రజాసంఘాలనూ, నిష్ణాతు లనూ, మేధావులనూ కలుసుకుని, చర్చలు జరిపి 187 పేజీల తుది నివేదికను కేంద్రానికి (ఆగస్ట్ 27, 2014) సమర్పించింది. రాజధాని ఏర్పాటుకు పరిశీలనార్హమైనవిగా మూడు జోన్లనూ, నాలుగు ప్రాంతాలనూ నివేదికలో పేర్కొన్నది. అయితే ఈ బృందం నిర్దిష్టంగా ఏ ప్రాంతాన్నీ రాజధానిగా పేర్కొనలేదు. కమిటీ చేసిన విన్యాసం క్లిష్టతరమైనదే అయినప్పటికీ ‘విశాఖ జోన్’, ‘కాళహస్తి స్పైన్’, ‘రాయలసీమ ఆర్క్’ పేరిట రాజధాని ఏర్పాటుకు అనుకూలమైనవిగా మూడు జోన్‌లు, నాలుగు ప్రాంతాలను పేర్కొన్నది. ప్రభుత్వ భూముల లభ్యతలో, తక్కువ జనసాంద్రతలో ఇతరత్రా ప్రాంతాల కన్నా రాజధానికి అనువైన ప్రాంతంగా రాయలసీమకు, కోస్తాంధ్రకు మధ్యస్థ మండలంగా కమిటీ ఎక్కువ ఊనిక పెట్టిన ప్రదేశం కాళహస్తి స్పైన్, రాయలసీమ ఆర్క్ జోన్ ప్రాంతం కనిపిస్తున్నది. మద్రాస్ నుంచి విడవడిన తరువాత ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధాని అయింది. 1956లో తెలుగువారి ప్రయోజనాల కోసమే రాయలసీమ ప్రజలు కర్నూలును త్యాగం చేసి హైదరాబాద్‌ను రాజధానిగా అభిమానించవలసివచ్చింది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌కు కొత్త రాజధాని ఎంపికకు సంబంధించి చూస్తే, హైదరాబాద్ వంటి సూపర్ రాజధాని నిర్మాణం అన్ని ప్రాంతాలకు ఆటంకమే కాకుండా, అసాధ్యం కూడా కాబట్టి అధికార వికేంద్రీకరణపై శివరామకృష్ణన్ కమిటీ దృష్టి పెట్టింది. అందుకు అనుగుణంగా నూతన రాజధానికి వీలైన ప్రాంతాన్ని ఎంపిక చేస్తూనే, మిగిలిన ప్రాంతాలలో వివిధ ప్రభుత్వ శాఖలను విస్తరింపచేయడం శ్రేయస్కర మని కూడా భావించింది.

 

 సూపర్‌సిటీ అనవసరం, అసాధ్యం

 ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రస్థానంగా కనిపిస్తున్న విజయవాడ -గుంటూరు- తెనాలి- మంగళగిరి (వీజీటీఎమ్) జనాభా రీత్యా, వసతుల రీత్యా కిక్కిరిసి ఉన్నందున రాజధాని ఎంపిక సమస్య క్లిష్టంగా మారింది. దీనికి తోడు స్థానిక మోతుబరులు, చట్టా వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్న కొద్దిపాటి భూముల ధరలను పెంచేయడానికి వీలుగా విజయవాడ, గుంటూరులకు రాజధాని యోగం పట్టనున్నదని ముందే ఊహాగానాలు విస్తరింపచేశారు. ఆహార ధాన్యాల ఉత్పత్తుల రీత్యా ఉభయ గోదావరి జిల్లాలు; కృష్ణా, గుంటూరు జిల్లాలు కాణాచులు. దేశానికే ధాన్యాగారాలుగా ఖ్యాతి గాంచిన ఆ ప్రాంతంలోని భూములను రాజధాని కోసం కొనుగోలు చేసి వినియోగించడం భవిష్యత్తులో ఆహార కొరతకు కారణమవుతుందని శివరామకృష్ణన్ బృందం తుది నివేదికలో స్పష్టం చేసింది. ఈ కారణాల వల్ల అన్ని వ్యవస్థలనూ ఒకేచోట కేంద్రీకరించే హైదరాబాద్ వంటి సూపర్ సిటీ నిర్మాణం అసాధ్యం కాబట్టి, విజయవాడ, గుంటూరు ప్రాంతం అభిలషణీయం కాదని కమిటీ చెప్పింది. పైగా ఈ ప్రాంతంలో భూముల లభ్యతను గురించి రాష్ట్ర ప్రభుత్వం కమిటీకి సమాచారం ఇవ్వకుండా తొక్కిపెట్టింది. దీని ఫలితంగా అక్కడి భూముల ధరలు ఆకాశాన్నంటాయని కూడా కమిటీ వ్యాఖ్యానించింది. అసలు విభజన వల్ల రెండు రాష్ట్రాలు కూడా పలు సమస్యలను ఎదుర్కొనవలసిన పరిస్థితి ఏర్పడిందని కమిటీ ఆదిలోనే అభిప్రాయపడడం గమనార్హం.

 

 అభివృద్ధికి ఎంతో ఆస్కారం

 అయితే ఆంధ్రప్రదేశ్‌కు ఉత్తరాన శ్రీకాకుళం, దక్షిణాన చిత్తూరు వరకు ఉన్న 13 జిల్లాలను ఇతోధికంగా అభివృద్ధి చేసుకోవడానికి భౌగోళికమైన సానుకూలత, వనరులు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయనీ, వాటిపై తక్షణం దృష్టి సారించాలనీ కమిటీ అభిప్రాయపడింది. అక్కడ సరైన జల ప్రణాళికను అమలు చేసి ఉంటే నిరంతరం దుర్భిక్ష పరిస్థితులలో కొట్టుమిట్టాడవలసిన అవసరం ఉండేది కాదు. ఏనాడూ నీటి వనరులకు నోచుకోకుండా ఎండుటాకు లాంటి ఎడారిని ఇజ్రాయెల్, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సేద్యానికి అనుకూలంగా మలచుకుని సస్యశ్యామలం చేయలేదా? అందుబాటులో ఉన్న జనవనరులను తెలంగాణ తెలుగువారి పరిధిలోని వర్షాభావ ప్రాంతాలకు కూడా సమంగా పంచుకుంటూ నూతన సాంకేతిక ఆవిష్కరణలను అందిపుచ్చుకుంటూ సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

 

 వికేంద్రీకరణే శరణ్యం

 ప్రధాన రాజధాని, శాసనసభ, మండలి, సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రుల, ఉద్యోగుల వసతి వంటివి ఒకచోట; హైకోర్టును విశాఖలోనూ ఏర్పాటు చేయవచ్చు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను కర్ణాటక (బెల్గాం), మహారాష్ట్ర (నాగ్‌పూర్)ల మాదిరిగానే విజయవాడ-గుంటూరులో ఒకసారి, మరొకసారి ఏ కర్నూలు లేదా విశాఖలోనో నిర్వహించుకోవచ్చు. తక్షణావసరాలతో సంబంధంలేని అటవీ, ఖనిజ వనరుల పర్యవేక్షణ కార్యాలయాలను ఇతర ప్రాంతాలలో నెలకొల్పవచ్చు.

 చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాలను కలుపుకుంటూ కృష్ణపట్నం, దుగ్గిరాజపట్నం రేవులను, వినుకొండ కూడలిని మధ్యలో పలకరించుకుంటూ అటు నుంచి విశాఖ-చెన్నై భారీ కారిడార్‌కు సమాంతరంగా కాళహస్తి-నడికుడి మార్గం ప్రయాణిస్తూ ఉంటుంది. విల్లు ఆకారంలో విస్తరించే రాయలసీమ ఆర్క్ మరొక వరం. అనంతపురం, తిరుపతి, కడపల మీదుగా కర్నూలు నుంచి చిత్తూరు దాకా ఇది వ్యాపించి, హైదరాబాద్, కర్నూలు, అనంతపురం, బెంగళూరు రహదారులకు తోడుగా ఏర్పడనున్న కొత్త రహదారులతో వియ్యమందుకుంటూ దక్షిణ భారతావనికే ఒక పెద్ద రవాణా మార్గం కాగలదు. ఇది ఇతరులు ఎవరికీ లేని రవాణా సౌకర్యం. వీటన్నిటికీ అందుబాటులోని ‘హబ్’గా వినుకొండ, దొనకొండ, మార్టూరు ప్రాంతం త్రిభుజ రాజధానిగా భాసిల్లుతుంది. ఇది ఆచరణలో అత్యంత ప్రయోజనకరమైనది కూడా. దొనకొండలో రెండో ప్రపంచ యుద్ధకాలంలో నిర్మించిన విమానాశ్రయం ఉంది. దీనిని ఆధునీకరించాలి. ఇది బెంగళూరు మార్గంలో ముఖ్యమైన రైల్వే స్టేషన్‌గా, రైల్వే యార్డ్‌గా ఉంది. ఇలాంటి దొనకొండకు రోడ్డు మార్గాన్ని కూడా విస్తరించుకుంటే సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా ఉంటుంది. దొనకొండ గురించి ఇది నిపుణుల అంచనా. ఈ ప్రాంతంలో 50 వేల ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉంది. కాబట్టే వినుకొండ, దొనకొండ, మార్టూరు ప్రాంతం శిమరామకృష్ణన్ కమిటీ దృష్టిలో పడి ఉండవచ్చు.

 

 స్టాక్ మార్కెట్ జూదాల మీద ఆధారపడే దళారులు, రియల్టర్లు, ధనస్వామ్య ఆశ్రిత బంధువులైన కొందరు రాజకీయ నాయకుల దృష్టిలో ఉన్న ఖరీదైన ఆదర్శ రాజధానుల వైపు చూస్తే, నేల విడిచి సాము చేసే సింగపూర్‌ల కోసం ఎదురు చూస్తే ప్రజల వాస్తవిక అవసరాలు అధఃపాతాళానికి వెళతాయి. ఇది ప్రజా బాహుళ్యం గమనించాలి.

 

 -ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top