సింగపూర్‌ తెలుగు సమాజం 44వ ఆవిర్భావ వేడుకలు

Singapore Telugu Samajam Celebrated 44th Formation Day Celebrations - Sakshi

సింగపూర్ తెలుగు సమాజం 44 వ ఆవిర్భావ వేడుకలను నవంబర్ 9న యూషున్లోని శ్రీ నారాయణ మిషన్‌లో నిర్వహించారు. శనివారం ఉదయం తెలుగు సమాజ కార్యవర్గసభ్యులతో కలిసి దాదాపు 60 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మిషన్ ఆవరణలో బాలబాలికలతో కేకు కట్ చేయించి అందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాష సాంస్కృతి, సాంప్రదాయ పరిరక్షణ పునాదులపై ఆవిర్భవించిన తెలుగు సమాజం ప్రగతికి గత 44 వసంతాలుగా పాటుపడిన పూర్వ అధ్యక్షులకు, కార్యవర్గసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. 

సింగపూర్‌లో నివసిస్తున్న సుమారు 10,000 మంది తెలుగు వారి కుటుంబాల పిల్లలందరికీ తెలుగు భాష నేర్పేలా గత 10 పది సంవత్సరాలుగా నిర్వహిస్తున్న తెలుగు బడి కార్యక్రమాలు మరింతగా విస్తరించే కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకి భాషాభివృద్ధి పరంగా చర్యలు తీసుకునే విధంగా వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. సామాజిక, సాంస్కృతిక, సంప్రదాయ కార్యక్రమాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలను చేస్తూ అన్ని వర్గాల ప్రశంసలు అందుకుంటున్నామని అన్నారు.

ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించే అవకాశం కల్పించిన నారాయణ మిషన్ సిబ్బందికి, నిర్వాహకులకు, దాతలకు, వాలంటీర్లకు కార్యక్రమ నిర్వాహకులు కాశిరెడ్డికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. అయితే ఇది వరకు ఆవిర్భావ వేడుకలు వినోద కార్యక్రమంగా నిర్వహించేవారు. కానీ ఈసారి వేడుకలను సామాజిక సేవా కార్యక్రమంగా నిర్వహించడం విశేషం. 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top