వలస బతుకులకు భరోసా

Gulf NRI Policy Scheme in Manifesto - Sakshi

గల్ఫ్‌ ఎన్‌ఆర్‌ఐ పాలసీపై కోటి ఆశలు

ప్రవాసీ విధానంతో గల్ఫ్‌ వలస జీవులకు ప్రయోజనం

ఏడు పార్లమెంట్‌ స్థానాల్లో ప్రభావం

‘‘తెలంగాణ ప్రజల జీవితాలు.. ముంబయి.. దుబాయి.. బొగ్గుబాయి.. వలస బతుకులు.. కరువు కష్టాలు.. కన్నీటి యాతనలు.. ఈ బాధలు పోవాలంటే.. మన రాష్ట్రం మనకు రావాలి’’ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కేసీఆర్‌ అన్న మాటలివి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఐదేళ్లు సమీపిస్తోంది. ప్రవాస తెలంగాణ వాసుల కోసం ఒక పాలసీ వస్తుందని ఇన్నేళ్లు ఎదురు చూశారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలోనైనా గల్ఫ్‌లోని తెలంగాణ వాసులకు ప్రయోజనం చేకూర్చే ఒక ప్రకటన వెలువడుతుందేమోననే ఆశతో ఉన్నారు. రాష్ట్రంలో మొన్నటి వరకు ఎన్‌ఆర్‌ఐ (ప్రవాస భారతీయ) మంత్రిత్వ శాఖ తారకరామారావు చేతిలోనే ఉండేది. ఆయ న 2016లో దుబాయి వెళ్లి అక్కడి కార్మికులతో మాట్లాడి వచ్చారు కూడా. గల్ఫ్‌ వలస జీవుల సంక్షేమం కోసం ప్రత్యేక విధానాన్ని ప్రకటిస్తామని కేటీఆర్‌ ప్రకటించారు. శాసనసభ ఎన్నిక ల సందర్భంగా దుబాయిలో ప్రవాస తెలంగాణ వాసులు సమావేశమై ఎన్‌ఆర్‌ఐ పాలసీ కావాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి వినతిపత్రం పంపించారు. తెలంగాణలోని ఏడు పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో ప్రభావం చూపే ఎన్‌ఆర్‌ఐ పాలసీపై కథనమిది. – వూరడి మల్లికార్జున్, సిరిసిల్ల

కన్నీటి పయనం
గల్ఫ్‌కి వెళ్లే వాళ్లెవరూ ఆనందంగా వెళ్లరు. గుండెల నిండా దుఃఖంతో భారంగా పయనమవుతారు. ఆర్థిక అవసరాలే వారిని అరబ్బు దేశాల వైపు లాక్కెళతాయి. ఇంటి వద్దనే ఉండి దొరికిన ఏదో ఒక పని చేద్దామని మనసు పరితపిస్తున్నప్పటికీ అప్పుల బాధలు... కరువు పరిస్థితులే వారిని గాలిమోటార్‌ ఎక్కిస్తున్నాయి. ఉపాధి వేటలో కన్నవారిని, కట్టుకున్న భార్యను, పిల్లలను విడిచి విదేశాలకు వెళ్లిన ప్రవాస తెలంగాణ కార్మికుల సంక్షేమం... చివరికి నీటి మీద రాతగా మిగిలిపోయింది. తెలంగాణ జిల్లాల నుంచి ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లడం నాలుగు దశాబ్దాల కిందటే మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్‌ జిల్లాల పరిధిలో 13 లక్షల మంది కార్మికులు గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. వారి ద్వారా ఏటా రూ. పదివేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం మనదేశంలోకి వస్తోంది. పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఏటా సుమారు వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. అయినా వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం చేసిందేమీ లేదు. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రవాస తెలంగాణ కార్మికులు, వారి కుటుంబాల సంక్షేమానికి కొంతైనా వెచ్చించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. కార్మికుల కుటుంబాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ నేపథ్యంలో వలస కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తూ.. కొత్త విధానాలను రూపొందించేందుకు కేటీఆర్‌ ఆధ్వర్యంలో 2016 మే 27న హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించింది. గల్ఫ్‌లోని సంక్షేమ సంఘాల ప్రతినిధులు, ఉన్నతాధికారులు, రిక్రూట్‌మెంట్‌ ఏజెంట్లు ఈ సమావేశంలో పాల్గొని కొత్త విధాన రూపకల్పన కోసం సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రభుత్వం గల్ఫ్‌ పాలసీ రూపకల్పనకు కసరత్తులు చేసింది. కానీ ఇంకా తుదిరూపు సంతరించుకోలేదు. తెలంగాణ సర్కారు రూపొందించే ఎన్‌ఆర్‌ఐ పాలసీ మీద వలస జీవులు కొండంత ఆశ పెట్టుకున్నారు.

కాంగ్రెస్‌ హయాంలో
గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి పొందుతున్న కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవాసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. 2012లో అప్పటి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎన్‌ఆర్‌ఐ మంత్రిత్వశాఖకు బాధ్యత వహించారు. కొన్ని రోజుల పాటు జిల్లా కేంద్రాల్లో ప్రవాసుల కేంద్రాన్ని(గల్ఫ్‌ సెల్‌) కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆ శాఖకు నిధులు కేటాయించకపోవడంతో ఆ శాఖ ఉండి కూడా ఉపయోగం లేకుండా పోయింది. అప్పట్లో వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది ప్రభుత్వం. అయితే కొన్ని కుటుంబాలకు ఇప్పటికీ ఆర్థిక సాయం దక్కలేదు. రాష్ట్ర స్థాయిలోనూ ప్రవాసీ మంత్రిత్వశాఖకు ప్రాధాన్యత లేకుండా పోయింది. గల్ఫ్‌ దేశాల్లోని వలస జీవులపై  అధ్యయనాలు నిర్వహించారు. కానీ క్షేత్రస్థాయిలో కష్టాల్లో ఉన్న వారిని ఏ మాత్రం ఆదుకోలేక పోయింది అప్పటి ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు దుబాయి వెళ్లి తెలంగాణ వలస కార్మికులు నివాసం ఉండే ప్రాంతాల్లో పర్యటించి వారి సంక్షేమంపై చర్చించారు. గల్ఫ్‌ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న కేటీఆర్‌ ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నారు. గత కాంగ్రెస్‌ హయాంలో జరిగినట్లు మొక్కుబడి చర్యలు కాకుండా విధానపరమైన మేలు దక్కేలా పాలసీ రూపొందించాలని గల్ఫ్‌ వలస జీవులు కోరుతున్నారు. కేటీఆర్‌ ప్రస్తుతం సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌. విధానపరమైన నిర్ణయాల్లో ఆయన పాత్ర కీలకంగా ఉంటుంది కాబట్టి గల్ఫ్‌ కార్మికులు కేటీఆర్‌ మీదనే ఆశలు పెట్టుకున్నారు.

సంక్షేమంగా కేరళ... పంజాబ్‌
కేరళ, పంజాబ్‌ రాష్ట్రాల్లో గల్ఫ్‌ వలస కార్మికుల కోసం అమలులో ఉన్న సంక్షేమ పథకాలపై ప్రభుత్వం అధ్యయనం చేయించింది. ఆ రాష్ట్రాల్లో ప్రవాసుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖలున్నాయి. తెలంగాణలో ప్రవాస మం త్రిత్వ శాఖ ఉన్నా సాధారణ పరిపాలనశాఖ (జీఏడీ) పరిధిలో ఉంది. జీఏడీలో పలు విభాగాలు ఉండడంతో అధికారులు ఎన్‌ఆర్‌టీ (నాన్‌ రెసిడెంట్‌ తెలంగాణైట్స్‌) అంశాలపై ప్రత్యేకం గా దృష్టిపెట్టడం లేదు. జిల్లా స్థాయిలోనూ ప్రత్యేక ఆఫీ సులు లేవు. దీంతో పరిపాలన పరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. కేరళలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండగా, ప్రత్యేక  అధికారులను ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం. గల్ఫ్‌ దేశాలకు వెళ్లే కార్మికులకు ప్రత్యేకంగా వీసా అనుమతులు, తక్కువ వడ్డీతో బ్యాం కు రుణాలను కూడా ఇస్తోంది. ‘నోర్కారూట్స్‌’ పేరిట విదేశాలకు వెళ్లిన వారికి జీవిత బీమా, ఆరోగ్యబీమా సదుపాయం కూడా కల్పిస్తోంది. వలస కార్మికుల గుర్తింపు కార్డులు, ఎంచుకున్న రంగంలో నైపుణ్య శిక్షణ, విదేశాలకు వెళ్లే వారికి అక్కడి పరిస్థితుల గురించి ముందస్తు అవగాహన కల్పిస్తున్నారు. ఏ కారణంగానైనా ఆ దేశాల్లో ఇమడలేక తిరిగి వచ్చేస్తే.. వారికి పునరావాసం కల్పించడం, మరణించిన సందర్భాల్లో కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడం కూడా కేరళలో అమలవుతోంది. అక్కడి విధానాలపై మన అధికారులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి  నివేదిక కూడా సమర్పించారు. 

గల్ఫ్‌కివెళ్లేది పేదలే..
గల్ఫ్‌ దేశాలకు కార్మికులుగా వెళ్లేది ఎక్కువగా పేదలే. ఉన్న ఊళ్లో పని దొరక్క, చేతనైన పని చేసి ఉపాధి పొందాలని గల్ఫ్‌ బాట పడతారు. గల్ఫ్‌లో పనులు చేయడానికి అవసరమైన శిక్షణ ఇచ్చే సంస్థల గురించి చెప్పేవారు లేకపోవడంతో, పనుల్లో నైపుణ్యం లేకుండానే వెళ్లిపోతారు. గల్ఫ్‌ దేశాలకు వెళ్లడానికి ముందే శిక్షణ తీసుకుంటే, వారికి వెళ్లిన చోట మెరుగైన ఉపాధి లభిస్తుంది. ఎన్‌ఆర్‌ఐ పాలసీ కోసం చాలా ఏళ్లుగా కోరుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం పాలసీ రూపొందిస్తే మంచిది.– కటుకం రవి,బండపల్లి

గల్ఫ్‌ఎన్‌ఆర్‌ఐ పాలసీ
నేను దశాబ్ద కాలంగా దుబాయ్‌లో ఉంటున్నాను. తెలంగాణ నుంచి ఎక్కువ మంది లేబర్‌ వీసాలపై గల్ఫ్‌కి వెళ్తుంటారు. వారికి గల్ఫ్‌ చట్టాల గురించి ఏ మాత్రం తెలియదు. అలాంటి పరిస్థితుల్లో గల్ఫ్‌ దేశాల్లో ఉన్న వారికి ఎన్‌ఆర్‌ఐ పాలసీ ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, స్కిల్‌ ట్రైనింగ్‌ వంటివి సొంత ఊరిలో అందే విధంగా చూడాలి. అప్పుడే ఎక్కువ మందికి ప్రయోజనం దక్కుతుంది.– జువ్వాడి శ్రీనివాస్‌రావు, నర్సింగాపూర్, రాజన్న సిరిసిల్లజిల్లా

ఎన్‌ఆర్‌ఐపాలసీతో ధీమా
ఎన్‌ఆర్‌ఐ పాలసీ రూపొందిస్తే.. గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన కార్మికులకు ఎంతో మందికి మేలు జరుగుతుంది. కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని దేశానికి ఆర్జించి పెడుతున్న గల్ఫ్‌ కార్మికులకు ఆ మాత్రం భరోసా ఉండాలి కదా. పాలసీ వస్తే అక్కడి చట్టాలు తెలుస్తాయి, అవగాహన పెరుగుతుంది. ప్రభుత్వ పరంగా సాయం దక్కుతుంది. గల్ఫ్‌ వెళ్లే వారికి ప్రభుత్వం మాకు అండగా ఉందన్న ధీమా ఉంటుంది.– పీచర కిరణ్‌కుమార్, వర్ధవెల్లి,రాజన్న సిరిసిల్లజిల్లా

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top