
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అమలు చేయాలని, విభజన చట్టం హామీలు నెరవేర్చాలని కోరుతూ 184 నిబంధన కింద తీర్మానం ప్రవేశపెట్టేందుకు వీలుగా వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సోమవారం లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసు ఇచ్చారు.
ఇదీ తీర్మానం...
‘2014 ఫిబ్రవరి 20న నాటి ప్రధాని ఇచ్చిన హామీ మేరకు నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు చేయాలని ఈ సభ తీర్మానించింది. ప్రత్యేక హోదాను 15 ఏళ్లకు పొడిగిస్తూ కూడా సభ తీర్మానించింది. ఈ తీర్మానం స్వీకరించిన మూడు నెలల్లోగా ఇది అమలులోకి వస్తుంది. ప్రకాశం జిల్లా సహా ఉత్తరాంధ్ర, రాయలసీమకు కోరాపుట్–బొలంగిర్–కలహండి ప్రత్యేక ప్యాకేజీ, బుందేల్‌ఖండ్ ప్రత్యేక ప్యాకేజీ తరహాలో ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ మంజూరు చేయాలని సభ తీర్మానించింది.
తదుపరి సాధారణ ఎన్నికలకు ముందుగా లేదా ఏడాదిలోగా ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని ప్రతి నిబంధనను ప్రభుత్వం అమలు చేయాలని సభ తీర్మానించింది. మే 2019లోగా పోలవరం నిర్మాణం పూర్తి చేయాలని సభ తీర్మానించింది. దుగరాజపట్నం పోర్టుకు సాంకేతికంగా, ఆర్థికంగా యోగ్యత లేనందున రామాయపట్నం పోర్టును నిర్దిష్ట కాల వ్యవధిలోగా పూర్తి చేయాలని సభ తీర్మానించింది..’అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు వీలుగా ఆయన ఈ నోటీసులు ఇచ్చారు.