ఆధార్‌ సాక్షిగా మరో ఆకలి చావు

Yet another Aadhaar-linked death? Jharkhand woman dies of hunger - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రేషన్‌ బియ్యానికి ఆధార్‌ కార్డు ముడిపెట్టడంతో జార్ఖండ్‌లో మరొకరు ఆకలి చావుకు గురయ్యారు. పకూర్‌ జిల్లా, ధావడంగల్‌ గ్రామంలో లుఖీ ముర్ము అనే 30 ఏళ్ల యువతికి ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేయక పోవడం వల్ల రేషన్‌ కార్డుపై గత అక్టోబర్‌ నెల నుంచి బియ్యం, ఇతర సరకులు ఇవ్వడంలేదు. దాంతో పస్తులతో కాలం గడిపి ఆకలితో జనవరి 27వ తేదీన మరణించారు. ఈ విషయంపై దర్యాప్తు జరిపిన 'రైట్‌ టు ఫుడ్' సంస్థ కార్యకర్తలు శుక్రవారం సాయంత్రం తమ నివేదికను విడుదల చేశారు. 

లుఖీ ముర్ముకు తెలియకుండానే ఆమె రేషన్‌ కార్డును అంత్యోదయ క్యాటగిరీ నుంచి ప్రాధాన్యత క్యాటగిరీకి గత జూన్‌ నెలలో మార్చేశారు. దాంతో నెలకు 35 కిలోల బియ్యం వచ్చేది 20 కిలోలకు తగ్గిపోయింది. అక్టోబర్‌ నెల నుంచి ఆ బియ్యం ఇవ్వడానికి కూడా డీలర్‌ నిరాకరించడంతో దుర్భర దారిద్య్ర పరిస్థితుల్లో కడుపునింపుకోవడం కష్టమై ముర్ము కన్నుమూసింది. ఇదే జార్ఖండ్‌లో గత సెప్టెంబర్‌ నెలలో 11 ఏళ్ల సంతోషి కుమారి మరణించగా, ఇప్పటి వరకు ఏడుగురు మరణించారని 'రైట్‌ టు ఫుడ్‌' కార్యకర్తల నివేదిక వెల్లడిస్తోంది. గార్వా జిల్లాలో జనవరి రెండవ తేదీన ఎట్వారియా దేవీ అనే 67 ఏళ్ల వద్దురాలు కూడా ఆకలితోనే మరణించారు. 

అయితే లుఖీ ముర్ము ఆకలితో చావలేదని, అంతుచిక్కని వ్యాధితో బాధ పడుతూ చనిపోయిందని జిల్లా పౌర సరఫరాల అధికారి దిలీప్‌ కుమార్‌ తెలియజేస్తున్నారు. ఆమెకు రేషన్‌ బియ్యాన్ని నిరాకరించలేదని, అనారోగ్యం కారణంగానే ఆమె అక్టోబర్‌ నెల నుంచి రేషన్‌ బియ్యాన్ని తెచ్చుకోలేక పోయిందని ఆయన వివరణ ఇచ్చారు. ఆమె అనారోగ్యంతో మరణించిందని తనకు తెలుసునని, అయితే ఏ జబ్బుతో అనారోగ్యం పాలైందని తెలియదని తెలిపారు. లుఖీ ముర్ము తల్లిదండ్రులు పదేళ్ల క్రితమే చనిపోగా తన నలుగురు చెల్లెళ్లతో కలిసి ఉంటూ కూలినాలి చేస్తూ వారిని పోషిస్తూ వచ్చింది. వారిలో ముగ్గురు చెల్లెళ్లు పెళ్లిచేసుకొని అత్తారింటికి వెళ్లిపోగా 14 ఏళ్ల ఆఖరి చెల్లెలు ఫూలిని ముర్ముతో ముర్ము జీవిస్తూ వచ్చింది. 

ముర్ము కుటుంబంలో ఐదుగురు సభ్యులకుగాను రేషన్‌ కార్డులో నలుగురు చెల్లెళ్ల పేర్లు నమోదై ఉన్నాయి. ఆధార్‌ కార్డులో మాత్రం లుఖీ ముర్ము, ఫూలిని ముర్మ ఇద్దరి పేర్లు మాత్రమే ఉన్నాయి. ఆధార్‌ కార్డుతోని అనుసంధానించని రేషన్‌ కార్డులు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి చెల్లవంటూ జార్ఖండ్‌ ప్రధాన కార్యదర్శి రాజ్‌ బాల వర్మ మార్చి నెలలో ఆదేశాలు జారి చేశారు. ఆయన ఉత్తర్వుల కారణంగా ఆ తర్వాత రాష్ట్రంలో 11 లక్షల రేషన్‌ కార్డులు రద్దయ్యాయి. పర్యవసానంగా రేషన్‌ బియ్యం అందక 11 ఏళ్ల సంతోషి కుమారి ఆకలితో చనిపోవడం, ఆ వార్త దేశమంతా సంచలనం సష్టించడంతో ఆధార్‌ అనుసంధానం పేరిట రేషన్‌ను తిరస్కరించ వద్దంటూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో జార్ఖండ్‌ పౌర సరఫరాల మంత్రి అంతకుముందు ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు. అయినప్పటికీ రద్దయిన రేషన్‌ కార్డులను పునరుద్ధరించ లేకపోవడం వల్ల ఆకలి మరణాలు ఆగడం లేదు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top