కదిలే టాక్సీలో మహిళ అనుమానాస్పద మృతి | Sakshi
Sakshi News home page

కదిలే టాక్సీలో మహిళ అనుమానాస్పద మృతి

Published Wed, Jan 27 2016 2:44 PM

కదిలే టాక్సీలో మహిళ అనుమానాస్పద మృతి - Sakshi

న్యూఢిల్లీ: పంజాబ్ లో జలంధర్ కు  చెందిన  కమలేష్ (55) అనే మహిళ  బుధవారం తెల్లవారుజామున ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. కదిలే టాక్సీ లో అనూహ్యంగా  ఆమె మరణించడం కలకలం రేపింది.  కేంద్ర రిజర్వ్ పోలీస్ విభాగంలో పనిచేసి రిటైర్ అయిన ఆమె భర్త ఐదు సంవత్సరాల క్రితం మరణించాడు.  ప్రభుత్వం నుంచి  రావాల్సిన పెన్షన్ వగైరా బకాయిల కోసం ఢిల్లీకి  వచ్చిన ఆమె అనుమానాస్పద మరణం అనేక సందేహాలు రేకెత్తించింది.

పోలీసులు అందించిన వివరాల ప్రకారం...  పంజాబ్ లో జలంధర్ కు చెందిన కమలేష్,  భర్త మరణంతో ఓం ప్రకాష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఐదు సంవత్సరాల క్రితం మరణించిన ఆమె భర్త పెన్షన్,  వైద్య పరీక్షల నిమిత్తం ఓంప్రకాష్ తో కలసి రైల్లో ఢిల్లీకి వచ్చారు. అక్కడి నుంచి బంధువుల ఇంటికి వెళ్లేందుకు టాక్సీలో బయలుదేరారు.  మార్గ మధ్యలో ఆరోగ్యం విషమించడంతో ఆమె చనిపోయింది. క్యాబ్ డ్రైవర్ ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ప్రాథమిక దర్యాప్తు  తరువాత మహిళ సహజంగా మరణించినట్టుగా భావిస్తున్నామని పోలీసు డిప్యూటీ కమిషనర్ విక్రంజిత్ సింగ్ తెలిపారు. అయితే శవపరీక్ష తర్వాత పూర్తి  వివరాలను వెల్లడి చేస్తామన్నారు.  

అయితే తన క్యాబ్లో కమలేష్, ఓం ప్రకాష్ ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగిందిని టాక్సీ డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. అకస్మాత్తుగా అంబులెన్స్ కావాలని,  పంజాబ్లోని ఆసుపత్రికి  తీసుకెళ్లాలని  ఓం ప్రకాష్  పట్టుబట్టడంతో అనుమానం వచ్చి  పోలీసులకు ఫిర్యాదు చేశానన్నాడు.  

గత రెండేళ్లుగా కమలేష్ అనారోగ్యంతో  బాధపడుతోందని ఓం ప్రకాష్  పోలీసులకు  వివరించాడు.  డబ్బులు చెల్లించే విషయంలో టాక్సీ డ్రైవర్ తో వాదన జరిగిందని.. అందుకే అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడని వాదించారు. అటు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. ఆమె మరణం వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా అనే కోణంలో దర్యాప్తు మొదలు పెట్టారు. ఓం ప్రకాష్,  టాక్సీ  డ్రైవర్ను పోలీసులు  ప్రశ్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement