జస్టిస్‌ చలమేశ్వర్‌ రిటైరైతే ఎట్లా..? | What Happens If justice Chelameswar Retires | Sakshi
Sakshi News home page

కొలీజియం ప్రత్యేక సమావేశం కావొచ్చా

May 12 2018 4:37 PM | Updated on Sep 2 2018 5:45 PM

What Happens If justice Chelameswar Retires - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు జడ్జీగా నియమించేందుకు ఉత్తరాఖండ్‌ చీఫ్‌ జస్టిస్‌ కేఎం జోసఫ్‌ పేరును మరోసారి కేంద్రం ముందు ప్రతిపాదించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం శుక్రవారం సూత్రబద్ధంగా అంగీకరించింది. సుప్రీంకోర్టులో మరికొన్ని పదోన్నతులకు సిఫారసు చేయాల్సి ఉన్నందున మే 16వ తేదీన మరోసారి సమావేశమై జోసఫ్‌తోపాటు అన్ని సిఫారసులను ఒకేసారి పంపించాలని చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నాయకత్వంలోని ఐదుగురు సభ్యులు గల కొలీజియం అభిప్రాయపడింది. 16వ తేదీన ఆ సమావేశం జరక్కపోతే ఏమవుతుంది?

సుప్రీంకోర్టులో రెండవ సీనియర్‌ న్యాయమూర్తి అయిన జస్టిస్‌ జే. చలమేశ్వర్‌ జూన్‌ 22వ తేదీన పదవీ విరమణ చేస్తున్నారు. ఆయన ఆఖరి వర్కింగ్‌ రోజు మే 18వ తేదీ. ఆ మరుసటి రోజు నుంచి సుప్రీం కోర్టుకు సెలవులు. జూలై రెండవ తేదీన తిరిగి సుప్రీంకోర్టు తెరచుకునేలోగా ఆయన పదవీ కాలం ముగిసిపోతుంది. జస్టిస్‌ చలమేశ్వర్‌ కొలీజియం సభ్యుడన్న విషయం తెల్సిందే. మే 18వ తేదీలోగా కేఎం జోసఫ్‌ విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఏం జరుగనుంది? కొలీజియంలోని జడ్జీ ఎవరైన పదవీ విరమణ చేసినా, అందుబాటులో లేకపోయినా ఆ స్థానంలో వచ్చే కొత్త జడ్జీతో కొలీజియంను తిరిగి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. చలమేశ్వర్‌ స్థానంలో జస్టిస్‌ సీకే సిక్రీ కొలీజియంలోకి రానున్నారు.

సుప్రీంకోర్టు జడ్జీగా కేఎం జోసఫ్‌ పేరును ప్రతిపాదించేందుకు జస్టిస్‌ సిక్రీ వ్యతిరేకిస్తే ఇక ఆయన నియామకం జరగదు. ఎందుకంటే, ఐదుగురు సభ్యులుగల సుప్రీం కోర్టు కొలీజియం ఏకగ్రీవంగా చేసిన సిఫారసుకు కేంద్రం కట్టుబడి వ్యవహరించాల్సి ఉంటుంది. ఏ ఒక్కరు వ్యతిరేకించినా ఆ సిఫారసును కేంద్రం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చవచ్చు. పునర్‌ ప్రతిపాదన విషయంలోనే ఈ నిబంధన వర్తిస్తుంది. జస్టిఫ్‌ జోసఫ్‌ను సుప్రీంకోర్టు జడ్జీగా నియమించాలంటూ కొలీజియం చేసిన సిఫారసును మోదీ ప్రభుత్వం తిరస్కరించిన విషయం తెల్సిందే. అందుకని మరోసారి జోసఫ్‌ పేరును ప్రతిపాదించాలని జస్టిస్‌ చలమేశ్వర్‌లతో కూడిన కొలీజియం సూత్రబద్ధంగా అంగీకరించింది. మే 16లోగా కొలీజియం సమావేశం కానప్పుడే ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. సుప్రీంకోర్టు సెలవుల్లో కూడా అవసరమైతే కొలీజియం సమావేశాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేయవచ్చు.  అయితే, ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా అలాంటి సమావేశానికి చొరవ తీసుకుంటారా? అన్నది ప్రశ్న.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement