రాజకీయాల్లో మహిళలపై హింస! | Violence against women in politics! | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లో మహిళలపై హింస!

May 1 2014 2:44 AM | Updated on Aug 7 2018 4:29 PM

దక్షిణాసియాలో రాజకీయాల్లోని మహిళలపై హింస అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతోందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. భారత్, నేపాల్, పాకిస్థాన్‌లలో రాజకీయాల్లో ఉంటున్న మహిళలపై ‘సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్, ఐక్యరాజ్యసమితి’ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది.

దక్షిణాసియాలో ఈ ఒరవడి ఎక్కువ  తాజా అధ్యయనంలో వెల్లడి
 
 న్యూఢిల్లీ: దక్షిణాసియాలో రాజకీయాల్లోని మహిళలపై హింస అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతోందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. భారత్, నేపాల్, పాకిస్థాన్‌లలో రాజకీయాల్లో ఉంటున్న మహిళలపై ‘సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్, ఐక్యరాజ్యసమితి’ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. చట్టాలను సరిగా అమలు చేయకపోవడం, పోలీసులు, న్యాయవ్యవస్థ నుంచి మద్దతు కొరవడటం, నైతిక విలువలను పూర్తిగా తుంగలో తొక్కడం వంటి అంశాలు ఈ హింస పెరగడానికి ప్రధాన కారణాలని సర్వే పేర్కొంది. దాదాపు 60 శాతం మంది మహిళలు హింసకు భయపడటం వల్లే రాజకీయాల్లో భాగస్వాములు కాలేకపోతున్నారని తెలిపింది. ఇక రాజకీయాల్లోకి రావాలన్న తమ సంకల్పాన్ని ఈ హింసే నిరోధిస్తోందని 90 శాతం మంది అతివలు అభిప్రాయడినట్టు వెల్లడించింది. ‘‘రాజకీయాల్లో మహిళలపై జరుగుతున్న హింసను నిరోధించడానికి అవసరమైన కఠిన చట్టాలు ఈ మూడు దేశాల్లో లేవని మా సమీక్షలో తెలింది’’ అని భారత్, భూటాన్, మాల్దీవులు, శ్రీలంకలకు సంబంధించిన ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం ప్రతినిధి డాక్టర్ రెబెక్కా రీచ్‌మన్ తెలిపారు. మహిళా రాజకీయ నేతల్లో ఎంపిక చేసిన కొంతమంది మినహా చాలామంది తమతమ పార్టీల్లో జరిగే ముఖ్యమైన చర్చల్లో పరిమిత పాత్ర మాత్రమే పోషిస్తున్నారని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా మొత్తం జనాభాలో ఐదింట ఒక వంతు మంది దక్షిణాసియాలోనే ఉండగా, మహిళా రాజకీయ నేతలపై జరుగుతున్న హింసాత్మక సంఘటనల్లో మూడింట ఒక వంతు ఇక్కడే జరుగుతున్నాయి. ఎన్నికల సమయంలో అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు, ఓటర్లు కూడా కొన్నిసార్లు హింసాత్మక సంఘటనలను ఎదుర్కోవడం సర్వసాధారణమేనని సర్వే ఫలితాలు పేర్కొన్నాయి. దక్షిణాసియాలో మహిళలు రాజకీయల్లోకి రాకుండా హింసాత్మక వాతావరణమే నిరోధిస్తోందని సీఎస్‌ఆర్ డెరైక్టర్ డాక్టర్ రంజనా కుమారి అభిప్రాయపడ్డారు. మహిళలు రాజకీయాల్లోకి వచ్చే అంశంపై లింగ వివక్షత కూడా ప్రభావం చూపిస్తోందని సర్వే తెలిపింది. ఓ మహిళ రాజకీయల్లోకి రావాలంటే, దీనిపై ఆమె కుటుంబమే నిర్ణయం తీసుకుంటుందని సర్వేలో పాల్గొన్నవారిలో దాదాపు 50 శాతం మంది చెప్పారు. మహిళ తన ఇంటి బాధ్యతలను ఎట్టిపరిస్థితుల్లోనూ విస్మరించకూడదని 90 శాతం మంది అభిప్రాయపడ్డారు. పోలీసులు మహిళా హక్కులను గౌరవించరని 60 శాతం మంది ఆరోపించారు. సర్వేలో భాగంగా మొత్తం 800 మంది అభిప్రాయాలను సేకరించారు. వీరిలో ఎన్నికల అధికారులు, పోలీసులు, అభ్యర్థులు, పట్టణ, గ్రామాల్లోని కుటుంబాలు ఉన్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement