ఇదేం ‘ట్వీటు’డు! | Sakshi
Sakshi News home page

ఇదేం ‘ట్వీటు’డు!

Published Wed, Oct 26 2016 8:31 AM

ఇదేం ‘ట్వీటు’డు! - Sakshi

పలు వివాదాస్పద ట్వీట్ లు

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా వ్యవహరించే దేశాధినేతల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందు వరుసలో ఉంటారు. ట్వీటర్‌లో ఆయనను సుమారు 2.35 కోట్ల మంది అనుసరిస్తున్నారు. వివిధ అంశాలపై  ఎప్పటికప్పుడు ఆయన ట్వీటర్‌లో తన అభిప్రాయలను పంచుకుంటుంటారు. ఈ విషయం అటుంచితే... ఇటీవలి కాలంలో పలు కేంద్ర ప్రభుత్వ విభాగాల అధికారిక ట్వీటర్‌ ఖాతాల్లో వివాదాస్పద ట్వీట్లు దర్శనమిస్తున్నాయి. ఈ ఖాతాల్లో కేవలం ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ట్వీట్లు మాత్రమే పోస్ట్‌ చేయాల్సి ఉంది. అయితే అందుకు విరుద్ధంగా వివాదాస్పద ట్వీట్లు వెలువడుతుండడం విమర్శలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో వాటిని ఓ సారి పరిశీలిద్దాం...

వ్యక్తిగత ఖాతాల మాదిరిగా...
ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ని ఉద్దేశిస్తూ భారత తపాలా శాఖకు చెందిన అధికారిక ట్వీటర్‌ ఖాతాలో ఈ నెల 5న ఓ వివాదాస్పద ట్వీట్‌ చేశారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోకి ప్రవేశించి ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం జరిపిన సర్జికల్‌ స్రై్టక్‌పై కేజ్రీవాల్‌ వ్యాఖ్యలను విమర్శిస్తూ ఆ ట్వీట్‌ చేశారు. అయితే అనంతరం తపాలా శాఖ క్షమాపణ కోరింది. తమ ఖాతాను ఎవరో హ్యాక్‌ చేశారని వివరణ ఇచ్చింది. ప్రభుత్వ శాఖలు, సంస్థలకు చెందిన అధికారిక ట్వీటర్‌ ఖాతాల్లో వెలువడిన వరుస వివాదస్పద ట్వీట్లలో ఇది తాజాది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రకటించాల్సిన ప్రభుత్వ అధికారిక ఖాతాలు వ్యక్తిగత ఖాతాలుగా మారాయానే విమర్శలు వినిపిస్తున్నాయి.

సెప్టెంబర్‌–8
కశ్మీర్‌లోని నిరసనకారులను చంపేయాలని భారత సైన్యానికి సూచిస్తున్న ఓ హిందీ కవితను ‘డిజిటల్‌ ఇండియా’ అధికారిక ట్వీటర్‌ ఖాతాలో సెప్టెంబర్‌ 8న రీట్వీట్‌ చేశారు. ఆ వెంటనే నేషనల్‌ ఈ– గవర్నెన్స్‌ డివిజన్‌ సీఈఓ రాధా చౌహాన్‌ ఈ ట్వీట్‌పై వివరణ ఇచ్చారు. డిజిటల్‌ ఇండియా ట్వీటర్‌ ఖాతాను నిర్వహించే వ్యక్తి పొరపాటున ఈ ట్వీట్‌ చేశాడని, అతడి ట్వీటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేయాలనుకున్నది ఇందులో పోస్టు చేశాడని వివరించారు.

సెప్టెంబర్‌–8
చార్జీల పెంపుపై ప్రయాణికులు  అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌ చేసిన ట్వీట్‌ను ఖండిస్తూ ‘శతాబ్ది’ ప్యాసింజర్‌ ఒకరు చేసిన ట్వీట్‌ను సెప్టెంబర్‌ 8న రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక ట్వీట్ల ఖాతాలో రీట్వీట్‌ చేశారు. అనంతరం కొద్దిసేపటికే దాన్ని తొలగించారు.

సెప్టెంబర్‌–1
ఆర్‌ఎస్‌ఎస్‌ దాఖలు చేసిన పరువునష్టం దావాపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ ఆలిండియా రేడియా అధికారిక ట్వీటర్‌ ఖాతాలో సెప్టెంబర్‌ 1న ఓ ట్వీట్‌ చేశారు. ‘ఆయన మొదట ఎందుకు భయపడ్డారు? ఆర్‌ఎస్‌ఎస్‌ను మళ్లీ నిందించే ధైర్యం ఎలా వచ్చింది? వ్యాఖ్యల పట్ల ఆయన కట్టుబడి ఉండాలి’ అని అందులో పోస్ట్‌ చేశారు. అనంతరం ఆ సంస్థ ఆ ట్వీట్‌ను తొలగించింది.

ఆగస్టు–22
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై బలూచిస్తాన్‌ పౌరుడు చేసిన ట్వీట్‌ను ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో అధికారిక ట్వీటర్‌ ఖాతాలో ఆగస్టు 22న రీట్వీట్‌ చేశారు. అనంతరం బ్యూరో ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేసింది. అనుభవం లేని ఓ యువ అధికారి దాన్ని ట్వీట్‌ చేశాడని వివరణ ఇచ్చింది.

జూలై–27

పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్న మీడియాను కట్టడి చేసేందుకు ఇండియన్‌ ఆర్మీకి మరింత స్వేచ్ఛ ఇవ్వాలని సూచిస్తున్న ఓ ట్వీట్‌ను ‘స్టార్టప్‌ ఇండియా’ అధికారిక ట్వీటర్‌ ఖాతాలో రీట్వీట్‌ చేశారు. దీనిపై ఆ ట్వీటర్‌ ఖాతాను పర్యవేక్షిస్తున్న ప్రైవేట్‌ ఏజెన్సీని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ తప్పుపట్టారు.

‘హైరింగ్‌’ సమస్య...
ప్రభుత్వ అధికారిక ట్వీటర్‌ ఖాతాలను నిర్వహించేందుకు ఎలాంటి వారిని నియమించాలనే విషయంలో నిర్దిష్ట విధానం లేకపోవడం ప్రధాన సమస్య. తమ ఖాతాను నిర్వహించేందుకు పలు మంత్రిత్వ శాఖలు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్‌ ఏజెన్సీలకు చెందిన ఉద్యోగులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఎన్నికల సమయంలో పార్టీలు తమ ఆన్‌లైన్‌ క్యాంపెయినింగ్‌ కోసం సోషల్‌ మీడియా కన్సల్టెంట్లను నియమించుకున్నాయి. ఆ రంగంలో నైపుణ్యం కలిగిన వారు, పార్టీకి అనుబంధంగా ఉన్నవారు, నాయకులకు సంబంధించిన వారిని నియమించుకున్నాయి. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం దాదాపు అన్ని ప్రభుత్వ విభాగాలు తమ డిజిటల్‌ విభాగాన్ని ఏజెన్సీలకు అప్పగించాయి. గతంలో పార్టీ, నాయకుల వద్ద పనిచే సిన వారే ఆ ఏజెన్సీల ద్వారా తిరిగి నియమితులవుతున్నారు.

ఏదేమైనా, వివాదాస్పద ట్వీట్లు వెలువడినపుడు ఆయా మంత్రిత్వ శాఖలు ఆ నెపాన్ని ప్రైవేట్‌ ఏజెన్సీలపైకి నెట్టివేస్తున్నాయి. ‘ప్రభుత్వ విభాగాలకు సోషల్‌ మీడియా మార్గదర్శకాలు కొరవడ్డాయి. సామాజిక మాధ్యమాలకు కొత్త అయినపుడు ఎవరైనా తప్పులు చేస్తారు. అయితే ప్రభుత్వ అధికారిక ఖాతా వినియోగించి ఏదైనా వ్యాఖ్యానించినపుడు కేవలం ‘అయ్యో!’ అంటూ తప్పించుకోకుండా, ప్రభుత్వం మరింత బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని ఢిల్లీలోని నేషనల్‌ లా యూనివర్సిటీకి చెందిన సెంటర్‌ ఫర్‌ కమ్యూనికేషన్‌ గవర్నెన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చిన్మయి అరుణ్‌ అభిప్రాయపడ్డారు.
– సాక్షి, ఏపీ డెస్క్‌

Advertisement
 
Advertisement
 
Advertisement