మీర్జాగూడ రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని తదితర ప్రముఖుల సంతాపం
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన పీఎంఓ
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మరణించటంపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖలు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మృతుల కుటుంబాలకు సానుభూతి.. 
బస్సు ప్రమాదంలో అనేకమంది ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా సానుభూతిని తెలుపుతున్నా. గాయపడిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.    – ద్రౌపదీ ముర్ము, రాష్ట్రపతి 
క్షతగాత్రులు కోలుకోవాలి.. 
మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతున్నా. ఇంతమంది ప్రాణనష్టం బాధాకరంగా ఉంది.  – సీపీ రాధాకృష్ణన్, ఉప రాష్ట్రపతి 
చాలా బాధాకరం..  
ఈ క్లిష్ట సమయంలో మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. మరణించిన వారి ప్రతి కుటుంబానికి పీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.2లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తాం.     – నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి 
ప్రమాదం దిగ్భ్రాంతికరం.. 
మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం జరగటం దిగ్భ్రాంతి కలిగించింది. మృతుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా.     – కే.చంద్రశేఖర్‌రావు, బీఆర్‌ఎస్ అధినేత 
ఘటన కలచివేసింది..
తెలంగాణలోని చేవెళ్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దిగ్భ్రాంతి కలిగించింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం.. ఈ ఘటన తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. – వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు 
బాధిత కుటుంబాలకు సానుభూతి.. 
ఈ ప్రమాదం తీవ్రంగా కలిచివేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతి. రోడ్డు భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టం చేయాలి. ఇటువంటి దుర్ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.     – జి.కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి 
అండగా ఉంటాం.. 
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రివర్గ సహచరులు వెంటనే స్పందించి ఇచి్చన ఆదేశాలతో యంత్రాంగం ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది.      – మల్లు భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం 
బాధితులను ఆదుకోవాలి 
చేవెళ్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.     – కే.తారకరామారావు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
మంత్రులు, ప్రముఖుల సంతాపం 
సాక్షి, హైదరాబాద్: ఈ ఘటన దురదృష్టకరమని, సన్నిహితులను కోల్పోయిన వారి కుటుంబాల కోసం దేవుని ప్రార్థిస్తున్నామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానని, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు బాధితులకు అండగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డితో కూడా మాట్లాడి బాధితులకు అవసరమైన సాయం చేయాలని సూచించినట్టు ఆయన తెలిపారు.
కాగా, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఇలాంటి దుర్ఘటనల కట్టడికి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు కోరారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేందుకు చేవెళ్లలోని పీఎంఆర్ జనరల్ ఆస్పత్రికి తరలించినట్టు శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు.
మీర్జాగూడ రోడ్డు ప్రమాదం తెలుసుకుని తీవ్ర ది్రగ్బాంతికి గురైనట్టు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. టిప్పర్లపై కవర్ కప్పేలా చర్యలు తీసుకోవాలని, అదే జరిగి ఉంటే చేవెళ్ల వద్ద ఇంతటి దుర్ఘటన జరిగి ఉండేది కాదని బీజేపీ ఎమ్మెల్సీ, తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సి.అంజిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
