డొనాల్డ్‌ ట్రంప్‌కు షాక్‌

Trump's former campaign manager surrenders to FBI - Sakshi

అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై మొదటి అరెస్టు

లొంగిపోయిన ట్రంప్‌ ప్రచార కమిటీ మాజీ మేనేజర్‌

సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై విచారణలో కొత్త మలుపు. దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రచార కమిటీ మాజీ మేనేజర్‌ పాల్‌ మనఫోర్ట్, అతని వ్యాపార సహాయకుడు రిక్‌ గేట్స్‌ దేశానికి వ్యతిరేకంగా కుట్ర, మనీ లాండరింగ్, ఇతర ఆరోపణలపై సోమవారం లొంగిపోవడం సంచలనం సృష్టించింది. రష్యా జోక్యంపై ఎఫ్‌బీఐ మాజీ చీఫ్‌ రాబర్ట్‌ ముల్లర్‌ ఆధ్వర్యంలో సాగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ అరెస్టు జరగడంతో మున్ముందు ఎలాంటి సంచలనాలు వెలుగులోకి వస్తాయోనన్న ఆసక్తి నెలకొంది.

విదేశీ కంపెనీలు, బ్యాంకు ఖాతాల ద్వారా మనఫోర్ట్, రిక్‌ గేట్స్‌లు వందల కోట్లు తరలించారని ఫెడరల్‌ అధికారులు వాషింగ్టన్‌ ఫెడరల్‌ కోర్టుకు తెలిపారు. ఈ పరిణామం అమెరికాను, ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ను కొత్త రాజకీయ సంక్షోభంలోకి నెడుతుందా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామాలపై వైట్‌హౌస్‌లో న్యాయవాదులతో ట్రంప్‌ సమీక్షించినట్లు సమాచారం. ఆదివారం ట్విటర్‌లో ఆయన ప్రతిపక్ష డెమోక్రాట్లను తిట్టిపోశారు.

రిపబ్లికన్లు నిలిచి సంస్కరణలు అమలు చేస్తుంటే.. అభివృద్ధిని అడ్డుకునేం దుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం, ట్రంప్‌ బృందం, రష్యా అధికారుల మధ్య సహకారంపై అనేక ఆరోపణలు వచ్చాయి. వీటిపై దర్యాప్తునకు రాబర్ట్‌ ముల్లర్‌ను మేలో న్యాయశాఖ స్పెషల్‌ కౌన్సెల్‌గా నియమించింది. రష్యా పాత్రపైనే కాకుండా ఇతర అంశాలపైనా పరిశీలన చేసే అధికారాన్ని ముల్లర్‌కు కల్పించారు.

ట్రంప్‌పై ఆరోపణలేంటీ?:
గతేడాది జూన్‌ 20– డిసెంబర్‌ 13 మధ్య  ట్రంప్, రష్యాల మధ్య సంబంధాలపై బ్రిటీష్‌ నిఘా మాజీ అధికారి క్రిస్టోఫర్‌ స్టీల్‌ సమాచారాన్ని సేకరించాడు. రష్యాకు చెందిన అనేకమందిని ఇంటర్వ్యూ చేసి రహస్య సమాచారాన్ని సిద్ధం చేశాడు. పాశ్చాత్య దేశాల కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు ట్రంప్‌కు రష్యా మద్దతు తెలిపిందని క్రిస్టోఫర్‌ అరోపించారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు మేలు జరిగేలా రష్యా సహకరించిందని అమెరికా నిఘాసంస్థలు కూడా నిర్ధారణకు వచ్చాయి. రష్యా పాత్రపై అనేక ఆధారాలు వెలుగుచూడడంతో ముల్లర్‌ నేతృత్వంలో దర్యాప్తు మొదలైంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top