నేడు మోదీతో జపాన్ ప్రధాని భేటీ

నేడు మోదీతో జపాన్ ప్రధాని భేటీ - Sakshi


మూడు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వచ్చిన జపాన్ ప్రధాని

♦ నేడు భారత్-జపాన్ 9వ వార్షిక సదస్సు

♦ నేటి సాయంత్రం వారణాసి గంగాహారతిలో పాల్గొననున్న మోదీ-అబే

 

 న్యూఢిల్లీ: జపాన్ ప్రధాని షింజో అబే మూడు రోజుల పర్యటన కోసం భారత్ చేరుకున్నారు. శనివారం ఢిల్లీలో భారత్-జపాన్ 9వ వార్షిక సదస్సులో భాగంగా ప్రధాని మోదీతో అబే భేటీ అవుతారు. పౌర అణు ఒప్పందంతోపాటు భారత్‌లో తొలి బుల్లెట్ రైలు ట్రాక్ కోసం రూ.98వేల కోట్ల డీల్, స్మార్ట్‌సిటీలకు సహకారం, పలు మౌలికవసతుల ప్రాజక్టులపై  ఒప్పందాలు చేసుకోనున్నారు. సదస్సు పూర్తయిన తర్వాత మోదీ, అబే శనివారం కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకోనున్నారు. దశాశ్వమేధఘాట్ వద్ద గంగా హారతిని తిలకించనున్నారు. ఇందుకోసం అలహాబాద్ హైకోర్టు నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొని గంగా తీరాన భారీ వేదిక ఏర్పాటు చేశారు. శుక్రవారం అబేకు  కేంద్ర మంత్రి జయంత్ సిన్హా విమానాశ్రయంలో స్వాగతం పలకగా.. విదేశాంగ మంత్రి సుష్మ.. సాయంత్రం అబేతో భేటీ అయ్యారు.



పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ, వివిధ సమస్యల పరిష్కారం కోసం భారత్ తీసుకున్న చొరవను షింజో అబే స్వాగతించారు. ‘ఉద్రికత్తలు తగ్గించుకునే దిశగా ఇరు ప్రభుత్వాలు ముందడుగు వేయటం శుభపరిణామం’ అని అన్నారు. మరోవైపు, అబేకు ఢిల్లీలోని జవహార్‌లాల్ నెహ్రు యూనివర్సిటీ (జేఎన్‌యూ) గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. భారత ఆర్థికాభివృద్ధిలో జపాన్ పాత్ర, ప్రధానిగా షింజో అబే చొరవకు గౌరవంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేఎన్‌యూ వీసీ సుధీర్ కుమార్ తెలిపారు. జేఎన్‌యూ నిర్ణయంపై అబే కృతజ్ఞతలు తెలిపారు. భారత్-జపాన్ మధ్య బంధం చాలా పురాతనమైనదని.. బలమైనదన్నారు.

 

 వచ్చేనెల భారత్-పాక్ చర్చలు

 ఇస్లామాబాద్: భారత్-పాక్ దేశాల విదేశాంగ శాఖ కార్యదర్శులు వచ్చే నెల ఢిల్లీలో భేటీ కానున్నారు. ఇటీవలి సుష్మ  పాక్ పర్యటనలో ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియ పునరుద్ధరించేందుకు చేసుకున్న ఒప్పందాలపై  ఇందులో చర్చించనున్నారు. పాకిస్తాన్ విదేశాంగ సలహాదారు అజీజ్.. శుక్రవారం పాక్ పార్లమెంటులో ఈమేరకు వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top