
సాక్షి, న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్‌లోని మిలిటరీ క్యాంపుపై దాడికి పాల్పడిన ముగ్గురు తీవ్రవాదుల గురించి భారత ఆర్మీ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. వారు గత జూన్ (2017) నెలలోనే పాక్ భూభాగం నుంచి భారత్‌లోని జమ్ముకశ్మీర్‌లోకి చొరబడినట్లు గుర్తించారు. ప్రత్యేకంగా దాడి చేయడంకోసం జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో గడిచిన ఏడు నెలల్లో తల దాచుకుంటూ గడిపారని వివరాలు సేకరించారు.
ఈ నెల (ఫిబ్రవరి) 10న జైషే ఈ మహ్మద్(జేఈఎం) ఉగ్రవాదులు ముగ్గురు భారీ మొత్తంలో ఆయుధాలతో వచ్చి సుంజువాన్ మిలిటరీ క్యాంపుపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఆరుగురు జవాన్లు, ఒక పౌరుడు చనిపోగా బలగాలు జరిపిన కాల్పుల్లో ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ నేపథ్యంలో దాడులకు సంబంధించి విచారణ చేపట్టిన అధికారులకు దాడి కుట్ర పాక్ నుంచే జరిగిందని మరోసారి స్పష్టమైంది.