45 రోజుల తర్వాత చిన్నారికి హెచ్‌ఐవీ పరీక్షలు

Tamil Nadu Woman Infected With HIV Due to Hospital Negligence Gives Birth to Baby Girl - Sakshi

చెన్నై : గతేడాది డిసెంబర్‌లో ల్యాబ్‌ టెక్నీషియన్ల నిర్లక్ష్యం కారణంగా తమిళనాడు వైద్యులు ఓ గర్భిణీకి హెచ్‌ఐవీ బ్లడ్‌ ఎక్కించిన సంగతి తెలిసిందే. ఫలితంగా సదరు మహిళకు కూడా హెచ్‌ఐవీ సోకింది. ఈ క్రమంలో ఆ గర్భిణీ మదురైలోని రాజాజీ ఆస్పత్రిలో గురువారం సాయంత్రం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం గురించి డాక్టర్లు మాట్లాడుతూ.. ‘సాధరణంగా అప్పుడే పుట్టిన పిల్లలు ఎవరైనా 2.5 - 3.5 కిలోగ్రాముల బరువు ఉండాలి. కానీ ఈ చిన్నారి కేవలం 1. 75 కిలోగ్రాముల బరువు మాత్రమే ఉంది. ప్రస్తుతం ఈ పాపను చిన్న పిల్లల ఐసీయూలో ఉంచామ’ని తెలిపారు.

అంతేకాక తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ రాకుండా నిరోధించే ‘నెవిరాపిన్ సిరప్‌’ను కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మెడిసిన్‌ను 6 - 12 వారాల పాటు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవేకాక హెపటైటీస్‌ బీ వైరస్‌ రాకుండా నిరోధించడం కోసం హెపటైటీస్‌ బీ టీకాను కూడా ఇచ్చామన్నారు. దాంతో పాటు 45 రోజుల తర్వాత చిన్నారికి హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. గత డిసెంబర్‌ 6న సదరు గర్భిణీకి ప్రభుత్వ బ్లడ్‌ బ్యాంక్‌ నుంచి తీసుకొచ్చిన రక్తాన్ని ఎక్కించారు. అయితే ఆ రక్తాన్ని దానం చేసిన వ్యక్తికి హెచ్‌ఐవీ ఉన్నట్లు తేలడంతో ఈ దారుణం చోటు చేసుకుంది.

ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లడానికి సిద్దపడుతున్న ఆ వ్యక్తి.. ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌లో రక్త పరీక్ష చేయించుకోగా హెచ్‌ఐవీ పాజిటీవ్‌గా తేలింది. వెంటనే అతను బ్లడ్‌ బ్యాంకు వారికి సమాచారం ఇచ్చాడు. కానీ అప్పటికే ఆ రక్తాన్ని గర్భిణీకి ఎక్కించడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే రక్త దానం చేసే​ నాటికే సదరు యువకుడికి  హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ బీలు ఉన్నాయని పరీక్షల్లో తేలిందని గుర్తించారు. ఈ విషయాన్ని ల్యాబ్‌ టెక్నిషియన్లు సదరు యువకుడికి తెలియజేయకపోవడంతో ఈ దారుణం జరిగింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top