గూగుల్‌, ఫేస్‌బుక్‌లకు సుప్రీం షాక్‌

Supreme Court Slaps Rs One Lakh Cost Each On Google, Facebook - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమాల్లో లైంగిక దాడులకు సంబంధించిన వీడియోలను బ్లాక్‌ చేయడంపై తీసుకున్న చర్యలను వివరిస్తూ కౌంటర్‌ దాఖలు చేయని ఇంటర్‌నెట్‌ దిగ్గజాలపై సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. గూగుల్‌, ఫేస్‌బుక్‌ తదితర సంస్థలకు రూ లక్ష జరిమానా విధించింది. తాము సూచించిన చర్యలను చేపట్టడంపై వివరణ ఇవ్వాలని యాహూ, ఫేస్‌బుక్‌ ఐర్లాండ్‌, ఫేస్‌బుక్‌ ఇండియా, గూగుల్‌ ఇండియా, గూగుల్‌ ఇంక్‌, మైక్రోసాఫ్ట్‌, వాట్సాప్‌లను నిర్థిష్టంగా కోరినా ఆయా సంస్థలు ఎలాంటి పత్రాలను సమర్పించలేదని జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌, జస్టిస్‌ యూయూ లలిత్‌తో కూడిన సుప్రీం బెంచ్‌ పేర్కొంది.

అశ్లీల వీడియోలను బ్లాక్‌ చేయడంపై తీసుకున్న చర్యలను వివరిస్తూ జూన్‌ 15లోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని, జరిమానాగా రూ లక్షను ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌గా ఉంచాలని ఇంటర్‌నెట్‌ దిగ్గజాలను ఆదేశించింది. మరోవైపు ఆన్‌లైన్‌ సైబర్‌ నేరాల రిపోర్టింగ్‌ పోర్టల్‌ బీటా వెర్షన్‌ సిద్ధమైందని, జులై 15న పోర్టల్‌ ప్రారంభిస్తామని కేంద్రం కోర్టుకు నివేదించింది.

హైదరాబాద్‌కు చెందిన ఎన్‌జీఓ ప్రజ్వల 2015లో అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్‌ దత్తుకు పంపిన లేఖ ఆధారంగా కోర్టు ఈ అంశంపై విచారణ చేపట్టింది. లేఖతో పాటు రెండు లైంగిక దాడులకు సంబంధించిన వీడియోలను పెన్‌డ్రైవ్‌లో ఈ సంస్థ కోర్టుకు సమర్పించింది. లేఖతో పాటు వీడియోల ఆధారంగా నిందితులను పట్టుకోవాలని కోర్టు సీబీఐని కోరింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top