‘స్వలింగ సంపర్కం’ నేరమా? కాదా? | Supreme Court To Revisit Section 377 in CrPC | Sakshi
Sakshi News home page

‘స్వలింగ సంపర్కం’ నేరమా? కాదా?

Jan 8 2018 5:46 PM | Updated on Jan 8 2018 6:03 PM

Supreme Court To Revisit Section 377 in CrPC - Sakshi

న్యూఢిల్లీ : భారతదేశంలో స్వలింగ సంపర్కం నేరమా? కాదా? అనే విషయంపై సుప్రీంకోర్టు త్వరలో తీర్పు చెప్పనుంది. స్వలింగ సంపర్కంపై భారత్‌లో బ్రిటిష్‌ పరిపాలన కాలం నుంచి నిషేధం ఉంది. బ్రిటిష్‌ వారు 1861లో రూపొందించిన క్రిమినల్‌ ప్రొసిజర్‌ కోడ్‌(సీఆర్‌పీసీ) సెక్షన్‌ 377 ప్రకారం స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తారు. నేరం రుజువైతే 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష పడొచ్చు.

అయితే, 2013లో స్వలింగ సంపర్కం నేరం కాదని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిని విచారించిన అత్యున్నత న్యాయస్థానం స్వలింగ సంపర్కంపై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఈ సందర్భంగా కొత్త చట్టాలు రూపొందించడం పార్లమెంటు పని అని పేర్కొంది.

అప్పటివరకూ స్వలింగ సంపర్కం నేరమేనంటూ తీర్పునిచ్చింది. 2013లో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని భావిస్తున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు జడ్జిల బెంచ్‌ సోమవారం పేర్కొంది. సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న ఐదుగురు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందిస్తూ.. ప్రకృతికి విరుద్ధంగా సంపర్కం జరపడాన్ని నేరంగా పరిగణిస్తున్న సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 377ను సమీక్షించాలని విస్తృత ధర్మాసనంలోని జడ్జిలను కోరింది.

కేవలం లింగ పరమైన కారణాలతో ఓ వ్యక్తి తన జీవితాన్ని భయంతో గడపాలా? అనే ప్రశ్నను బెంచ్‌ లేవనెత్తింది. ‘ఒకరికి సహజంగా అనిపించింది మరొకరికి అనిపించకపోవచ్చ’ని ఈ సందర్భంగా ముగ్గురు జడ్జిల బెంచ్‌ వ్యాఖ్యానించింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా స్వలింగ సంపర్కం పట్ల ధోరణి మారుతుండటంతో గే సెక్స్‌ను నేరంగా పరిగణించాలని ప్రభుత్వం కూడా భావించడం లేదని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement