ఈ పాటల మాంత్రికుడి పాటలు వింటారా!

Sreejesh Nair Is A Mastering Songs Specialist - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘పాట మాధుర్యాన ప్రాణాలు విడుతునే’  అనడంలోనే పాట గొప్పతనం తెలుస్తోంది. సంగీత, సాహిత్యాల మేళవింపుతోనే పాటకు ఆ మాధుర్యం అబ్బుతుంది. కచేరి పాటలకన్నా సినిమా పాటలు ఎవరైనా ఎక్కువగా వింటారు. నాటి సినిమాల్లో పాట సాహిత్యానికి సంగీతం సమకూర్చగా నేటి రోజుల్లో సంగీత బాణికి పాటను కూరుస్తున్నారు. ఏదైనా శ్రోతలకు కావాల్సింది పాట మాధుర్యం. కొందరికి పాత పాటలు బాగా నచ్చవచ్చు. కొందరికి కొత్తవే నచ్చవచ్చు. మరికొందరికి పాత, కొత్త రెండూనూ. అది వారి వారి అభిరుచులపై ఆధారపడి ఉంటుంది. 

ఎవరికి ఏ పాట నచ్చినా అందులో మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే ఆ పాట కూర్చిన రికార్డింగ్‌ రూమ్‌లో అది ఎలా వినిపిస్తుందో మన శ్రవణానికి అలాగే వినిపించాలి. పాట ప్రసారంలో కొంత నష్టం జరగొచ్చు. ఎక్కువ జరిగితే మాత్రం పాట మాధుర్యాన్ని కోల్పోతాం. ఒకప్పుడు ఎల్పీ రికార్డులు, పూల్‌ టేపులు, క్యాసెట్లు, తర్వాత సీడీలు, డీవీడీల, ఎంపీ 3ల రూపాల్లో మనకు పాటలు చేరాయి. రికార్డులు దెబ్బతిన్న, టేపులు నలిగినా, సీడీ, డీవీడీలు, గీతలు పడిన పాట వినసొంపులు పోయేవి. మళ్లీ మళ్లీ రికార్డులు చేయడానికి అప్పుడు మాస్టర్‌ కాపీలను భద్రంగా ల్యాబ్‌లో దాచేవారు. ఇప్పుడు టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది. అమెజాన్‌ మ్యూజిక్, ఆపిల్‌ మ్యూజిక్, గూగుల్‌ ప్లే మ్యూజిక్, ఐ ఇయర్‌ రేడియో, ట్యూన్‌ ఇన్‌ రేడియో, స్పాటిఫై, డీజర్, పండోరా, సౌండ్‌ క్లౌడ్‌ లాంటి ‘మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ యాప్స్‌’ చాలా వచ్చాయి. వీటి ద్వారా పాట ప్రసారంలో ‘నష్టం’ చాలా తక్కువ. తాజాగా టైడల్‌ అనే మరో యాప్‌ వస్తోంది. అందులో నష్టం మరీ, మరీ తక్కువ. అయితే వారు తీసుకునే సోర్స్‌ను బట్టి పాట నాణ్యత ఆధారపడి ఉంటుంది. 

 

ఇప్పటికే పాత పాటలు చాలా దెబ్బతిని ఉన్నాయి. ఇక్కడకే మనకు పాటలను మరమ్మతు చేసే మాంత్రికుడు సౌండ్‌ ఇంజనీర్‌ శ్రీజేష్‌ నాయర్‌ సేవలు అవసరం. పాత, కొత్త తేడా లేకుండా ఏ పాటనైనా ఆయన మునుపటిలా మరమ్మతు చేసి ఇవ్వగలరు. ‘జోధా అక్బర్, కామినీ, గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసేయ్‌పూర్‌ –2 సినిమాలకు ఆయన రీ రికార్డింగ్‌ మిక్సర్‌గా పనిచేశారు. వాసేయ్‌పూర్‌ చిత్రానికిగాను ఆయనకు జాతీయ అవార్డు వచ్చింది. ఆయన పాత పాటలను మరమ్మతు చేసి వాటిని వినిపించడం కోసం 2017లో ‘ది మాస్టరింగ్‌ ప్రాజెక్ట్‌’ పేరిట ఓ యూట్యూబ్‌ చానెల్‌ను పెట్టారు.

1980 నుంచి 2000 సంవత్సరాల మధ్య వచ్చిన హిందీ, తమిళ్, మలయాళం పాటలలో తనకు నచ్చిన పాటలను మరమ్మతు చేసి, వాటిని తన చానెల్‌ ద్వారా వినిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన చానెల్‌కు దాదాపు 50 వేల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. 1994లో విడుదలైన ‘కాదలన్‌’ చిత్రంలో ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం సమకూర్చిన పాటలను ఆయన మొదట మరమ్మతు చేశారు. ఎస్పీ బాల సుబ్రమణ్యం, ఉదిత్‌ నారాయణన్‌ పాడిన ‘కాదలన్‌ కాదలిక్కుమ్‌’ అనే పాటను ఇప్పుడు వింటుంటే నిన్ననే రికార్డు చేసినట్లు ఉంటుంది. ఆయన ఇప్పటి వరకు 430 పాటలను మరమ్మతుచేసి రీలోడ్‌ చేయగా, వాటిలో 169 పాటలు రెహమాన్‌ సమకూర్చినవి, 38 పాటలు ఇళయరాజా సమకూర్చినవి ఉన్నాయి. 

శ్రీజేష్‌ నాయర్‌ మరమ్మతు చేసిన వాటిలో ‘జియా జలే, దిల్‌ సే రే, తాల్‌ సే తాల్‌ మిలా, హే కాలీ కాలీ హాంకే, ముష్కిల్‌ బడా ఏ ప్యార్‌ హై లాంటి మధురమైన పాటలు ఎన్నో ఉన్నాయి. ఇదివరకు దూరదర్శన్‌లో ప్రతి ఆదివారం ఉదయం ‘చిత్రహార్‌’ కార్యక్రమం పేరిట వచ్చే పాటలను వింటున్నప్పుడు వాటిలో చాల దెబ్బతిన్న పాటలు నాయర్‌కు కనిపించాయట. అప్పటికి ‘డాల్బీ నాయిస్‌ రిడక్షన్‌’ వ్యవస్థ స్పీకర్లలలో ఉన్నప్పటికీ ఎక్కువ ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆ దిశగా తాను కషి చేయాలని నాయర్‌ నిర్ణయానికి వచ్చాడట. అప్పటి నుంచి పాటలలోని సంగీతపరంగా చోటు చేసుకున్న లోపాలను గుర్తించి రీమిక్సింగ్‌ మొదలు పెట్టారు. అందుకోసం ఆయన ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ‘అవిడ్‌ ప్రో టూల్స్, ఏడిఎక్స్‌ ట్రాక్స్‌లతోపాటు ఇతర సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగిస్తున్నారు. 

నాయర్‌ మరమ్మతు చేసిన కొన్ని పాటలు అస్సలు వాటికన్నా బాగున్నాయని ఆయన చానెల్‌ సబ్‌స్క్రైబర్లు ప్రశంసిస్తుంటే, ఆయన ఒరిజనల్‌ పాటలో లేకున్నా కొన్ని చోట్ల బాస్‌ (మంద్ర ధ్వని), మరి కొన్ని చోట్ల ట్రెబుల్‌ (మూడింతల పిచ్‌) పెంచుతున్నారంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఒరిజనల్‌ పాటలో లేకపోయినా అక్కడ సంగీత దర్శకుడు రాబట్టాలనుకున్న పరిపూర్ణతను దష్టిలో పెట్టుకొని తాను మరమ్మతు చేస్తున్నానని ఆయన వివరణ ఇచ్చారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top