త్వరలో సరళీకృత పన్నులు | Soon simplified taxes | Sakshi
Sakshi News home page

త్వరలో సరళీకృత పన్నులు

Nov 28 2014 1:45 AM | Updated on Apr 3 2019 5:16 PM

త్వరలో సరళీకృత పన్నులు - Sakshi

త్వరలో సరళీకృత పన్నులు

దేశంలో సరళీకృత పన్నుల విధానాన్ని రూపొందిస్తున్నామని, ఆ దిశగా చర్యలు చేపడుతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు.

అప్పుడే పన్నుల ఎగవేతను అరికట్టొచ్చు
నల్లధనం ప్రవాహాన్నీ అడ్డుకోవచ్చు: జైట్లీ
లోక్‌సభలో చర్చకు సవివర సమాధానం
వంద రోజుల్లో వెనక్కి తెస్తామనలేదు: వెంకయ్య

 
న్యూఢిల్లీ: దేశంలో సరళీకృత పన్నుల విధానాన్ని రూపొందిస్తున్నామని, ఆ దిశగా చర్యలు చేపడుతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా ఉండే వ్యవస్థను అమల్లోకి తేవడం వల్ల పన్నుల ఎగవేతను అరికట్టవచ్చని, తద్వారా నల్లధనం ప్రవాహాన్ని అడ్డుకోవచ్చని ఆయన వివరించారు. గురువారం లోక్‌సభలో నల్లధనంపై చర్చ సందర్భంగా జైట్లీ ఈ వివరాలు వెల్లడించారు. ‘మన పన్నుల వ్యవస్థ పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా ఉండాలి. దశలవారీగా దాన్ని రూపొందించే ప్రయత్నంలోనే ఉన్నాం’ అని ఆయన తెలిపారు. అన్ని వర్గాల వారికీ యోగ్యమైన పన్నుల విధానం అవసరమని పేర్కొన్నారు. నల్లధనం విషయంలో ప్రభుత్వం సేకరించిన 427 హెచ్‌ఎస్‌బీసీ ఖాతాదారులు చెల్లించాల్సిన పన్నుల మొత్తం నిర్ధారణను వచ్చే మార్చి నెలాఖరులోగా పూర్తి చేస్తామన్నారు. చట్టాల్లోనూ కొన్ని లొసుగులు ఉన్నాయని పేర్కొంటూ వాటిని సవరించే అవకాశమున్నట్లు జైట్లీ పరోక్ష సంకేతాలిచ్చారు. అయితే మంత్రి సమాధానం సంతృప్తికరంగా లేదని నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. కాగా, అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని ఎప్పుడూ చెప్పలేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావించడంతో ఆయన దీనిపై సభలో మాట్లాడారు. నల్లధనం సమస్యను పరిష్కరించడానికి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని మాత్రమే తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నామని గుర్తు చేశారు.   

విపక్షాల విసుర్లు: అంతకుముందు నల్లధనంపై చర్చలో పాల్గొన్న విపక్షాలన్నీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. దేశ ప్రజలకు ఎన్డీయే సర్కారు అబద్ధాలు చె ప్పిందని సమాజ్‌వాదీ పార్టీ మండిపడింది.  ఎన్సీపీ కూడా ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. కేంద్రం తన హామీని నిలబెట్టుకోవడం లేదని, ప్రధాని అయ్యాక నరేంద్ర మోదీ మారిపోయారని వ్యాఖ్యానించింది.  ఈ విషయంలో ప్రజలను మోసం చేసినందుకు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని ఎన్సీపీతో పాటు ఆర్జేడీ డిమాండ్ చేసింది. ఎన్డీయే ప్రభుత్వం కూడా యూపీఏ-3 సర్కారుగా వ్యవహరిస్తోందని ఆమ్‌ఆద్మీ పార్టీ మండిపడింది.
 
‘రియాల్టీ’లో నల్లధన ప్రవాహం

 
రియల్ ఎస్టేట్ రంగంలో నల్లధన ప్రవాహం విచ్చలవిడిగా ఉందని ఇన్వెస్టిగేషన్ పోర్టల్ కోబ్రాపోస్ట్.కామ్ స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడైం ది. ఢిల్లీ, ముంబై సహా 9 రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో డెవలపర్స్ లావాదేవీలపై  రహస్య విచారణ జరిపి సంబంత వీడియో రికార్డులు, ఇతర పత్రాలను కోబ్రాపోస్ట్ గురువారం విడుదల చేసింది. దీని ప్రకారం పలు రియల్ ఎస్టేట్ సంస్థల సీఈవోలు, ఎండీలు కూడా 10 నుంచి 80 శాతం సొత్తును బ్లాక్‌మనీ రూపంలో తీసుకోడానికి సిద్ధపడ్డారు. అయితే చెల్లింపులు మాత్రం విదేశీ బ్యాంకుల ద్వారా జరగాలని కోరారు. దాదాపు 35 ‘రియల్’ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement