ఎర్రకోట నుంచి సంచలన ప్రకటన!

Shah sets off talk of big bang from Red Fort - Sakshi

ఆగస్ట్‌ 15న మోదీ ప్రసంగంలో ఉంటుందంటున్న పార్టీ వర్గాలు

వారణాసి పర్యటనలో అదే విషయం చెప్పిన అమిత్‌ షా

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. ఆగస్ట్‌ 15న ఢిల్లీలోని ఎర్రకోట నుంచి చేసే ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ సంచలనాత్మక ప్రకటన చేయబోతున్నారా? ఒకవేళ అదే నిజమైతే.. ఆ ప్రకటన దేని గురించి అయి ఉంటుంది?.. ప్రస్తుతం దేశ రాజధానిలో రాజకీయ వర్గాల్లో ఈ ప్రశ్నలకు సంబంధించి విరివిగా చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఆర్నెల్ల ముందు మోదీ అకస్మాత్తుగా రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేస్తూ సంచలన ప్రకటన చేసిన విషయాన్ని కూడా ఆ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.

తాజాగా వారణాసిలో పార్టీ సీనియర్‌ నేతలు, సోషల్‌ మీడియా కార్యకర్తలతో రహస్యంగా జరిపిన సమావేశం సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా చేశారని చెబుతున్న వ్యాఖ్యలు ఆ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ‘ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నాయి. త్వరలో ప్రధాని నుంచి ఓ కీలక ప్రకటన వెలువడబోతోంది. ఆగస్ట్‌ 15 తరువాత దేశమంతా ‘ఎలక్షన్‌మోడ్‌’లోకి వెళ్లబోతోంది. పార్టీ శ్రేణులన్నీ సిద్ధంగా ఉండాలి. 2014లో ఇక్కడ మనకొచ్చిన 44% ఓట్ల శాతాన్ని 50 శాతానికి పెంచే దిశగా కృషి చేయాలి’ అంటూ ఆ భేటీలో అమిత్‌షా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

షా వ్యాఖ్యలను బట్టి ఆగస్ట్‌ 15న ప్రధాని నుంచి ఒక కీలక ప్రకటన వెలువడే అవకాశముందని తెలుస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పార్టీ వర్గాలను సమాయత్తపరిచేందుకు షా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే, ఖరీఫ్‌ సీజన్‌కు వరి, పత్తి సహా 14 పంటల కనీస మద్దతు ధరను గణనీయంగా పెంచుతూ కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇది ప్రభుత్వం పట్ల రైతాంగంలో నెలకొన్న వ్యతిరేకతను తగ్గించే దిశగా తీసుకున్న నిర్ణయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఆ మూడు రాష్ట్రాల్లో అధికారం కోసం
ముందస్తు ఎన్నికలపై ఒకవైపు వార్తలు వినిపిస్తుంటే.. మరోవైపు, అది సాధ్యం కాదని, అవన్నీ నిరాధార కథనాలేనని బీజేపీ సీనియర్లే చెబుతున్నారు. అయితే, పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ మూడు రాష్ట్రాల్లో పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు ఉపయోగపడేలా.. కుల సమీకరణాల నేపథ్యంలో.. మోదీ ప్రకటన ఉండవచ్చని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో, మోదీ మనసులో ఏముందో ఎవరికీ తెలియదంటూ ఆయనే ముక్తాయించడం గమనార్హం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top