ఘోర ప్రమాదం; 50 మందిపైగా మృతి

Several Feared Dead Train Accident In Amritsar - Sakshi

అమృత్‌సర్‌: పంజాబ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అమృత్‌సర్‌ దసరా వేడుకల సందర్భంగా ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో కనీసం 50 పైగా మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం. చౌరా బజార్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది. రైల్వే ట్రాక్‌ పక్కన రావణ దహనం నిర్వహిస్తుండగా పట్టాలపై నుంచుని వీక్షిస్తున్న వారిపై హవ్‌డా ఎక్స్‌ప్రెస్‌ రైలు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు ‘ఏఎన్‌ఐ’తో చెప్పారు. నకోదర్‌ నుంచి జలంధర్‌ వెళుతున్న డీఎంయూ రైలు (నంబర్‌ 74943) వేగంగా దూసుకురావడంతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని, చాలా మంది గాయపడ్డారని వెల్లడించారు.

ఈ ప్రమాదంలో 50 మందిపైగా మృతి చెందారని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలంలో ఉన్నవారందరినీ ఖాళీ చేయించామని, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నామని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. సమాచారం అందుకున్నవెంటనే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెంటనే చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి
పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చడంతో రైలు వస్తున్న శబ్దం వినిపించలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నిర్వాహకుల వైఫల్యం కారణంగానే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని మండిపడుతున్నారు. రైలు వస్తున్నప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద ఉత్సవం జరుగుతున్నప్పుడు రైలును నిలివేయడమో లేదా వేగం తగ్గించమని చెప్పడమో చేయాల్సిందని అంటున్నారు.

దిగ్భ్రాంతికి గురయ్యా: సీఎం
అమృత్‌సర్‌లో రైలు ప్రమాదంపై పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను తెరిచే ఉంచాలని ఆదేశించినట్టు చెప్పారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాగానికి ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, ఆరోగ్య కార్యదర్శి, ఏడీజీపీ వెంటనే ప్రమాదస్థలికి వెళ్లాల్సిందిగా ఆదేశాలిచ్చారు. రెవెన్యూ మంత్రి సుఖ్‌బిందర్‌ సర్కారియాను ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా సూచించారు. రేపు (శనివారం) సంఘటనా స్థలాన్ని అమరీందర్‌ సింగ్‌ పరిశీలించనున్నారు.

హృదయ విదారకం: ప్రధాని మోదీ
అమృత్‌సర్‌ రైలు ప్రమాదం తనను ఎంతో కలచివేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ ఘటన అత్యంత బాధాకరం, హృదయ విదారకమన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు తక్షణమే అవసరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. దసరా వేడుకల్లో పెను విషాదం చోటుచేసుకోవడం పట్ల మాటలు రావడం లేదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

(ప్రమాదానికి సంబంధించిన మరిన్ని ఫొటోలు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top