నిఘా నీడన భారత్‌ బంద్‌

Security Beefed Up In States During Bharat Bandh - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కుల ప్రాతిపదికన రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తున్న పలు సంఘాలు మంగళవారం భారత్‌ బంద్‌కు పిలుపు ఇచ్చిన క్రమంలో వివిధ రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బంద్‌ సందర్భంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించకుండా అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలనూ కోరింది. బంద్‌ నేపథ్యంలో రాజస్ధాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ వంటి రాష్ట్రాల్లో 144 సెక్షన్‌ విధించారు. ఏప్రిల్‌ 10న బంద్‌కు సోషల్‌ మీడియాలో, వాట్సాప్‌లో మెసేజ్‌లు వెల్లువెత్తడంతో కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు.

ఎస్‌సీ, ఎస్‌టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చడాన్ని నిరసిస్తూ ఏప్రిల్‌ 2న దళిత సంఘాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. భారత్‌ బంద్‌ నిరసనల సందర్భంగా పది మంది మరణించగా, పలువురికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఎస్‌సీ, ఎస్‌టీ చట్టంపై సుప్రీం తీర్పును పునఃసమీక్షించాలని దళిత సంఘాలు పట్టుబడుతున్నాయి. మరోవైపు ఆందోళనలు చేస్తున్న వారు తమ తీర్పును పూర్తిగా చదవలేదని సర్వోన్నత న్యాయస్ధానం పేర్కొనగా, దళితుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడిఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ భారత్‌ బంద్‌కు పిలుపు ఇవ్వడంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top