‘అందుకే ఎన్నికలు వాయిదా వేయాలంటున్నారు’ | Sanjay Paswan Over NDA Ally LJP Suggestion Bihar Polls Deferred | Sakshi
Sakshi News home page

‘అందుకే ఎన్నికలు వాయిదా వేయాలంటున్నారు’

Jul 11 2020 7:58 PM | Updated on Jul 11 2020 8:14 PM

Sanjay Paswan Over NDA Ally LJP Suggestion Bihar Polls Deferred - Sakshi

పట్నా: ఈ ఏడాది చివర్లో జరగనున్న బిహార్ ఎన్నికలను వాయిదా వేయాలంటూ ఆర్జేడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్డీయే భాగస్వామి లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) నాయకుడు చిరాగ్ పాశ్వాన్ ఆర్జేడీ నిర్ణయానికి మద్దతిచ్చారు. అయితే బీజేపీ  సీనియర్‌ నాయకుడు సంజయ్‌ పాశ్వాన్‌, చిరాగ్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అంతేకాక ఎల్‌జేపీ నాయకుడు, కేంద్ర మంత్రి రాం విలాస్‌ పాశ్వాన్‌ మరికొద్ది రోజులు అధికారంలో ఉండటానికి ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతున్నట్లు ఆరోపించారు. ఈ సందర్భంగా సంజయ్‌ పాశ్వాన్‌ మాట్లాడుతూ.. ‘ఎన్నికల నిర్వహణ అంశాన్ని ఎన్నికల కమిషన్‌ చేసుకుంటుంది. ఎన్నికలు వాయిదా వేయాలని కోరేవారు సొంత పార్టీ వారు అయినా లేక ప్రతిపక్షం వారైనా సరే.. వారికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని భావించాల్సి వస్తుంది’ అన్నారు. అంతేకాక ఎన్నికల కమిషన్‌కు సొంతంగా నిర్ణయం తీసుకునే సామార్థ్యం ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం, ఎల్‌జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ప్రస్తుతం బిహార్లో ఎన్నికలు జరపడానికి పరిస్థితులు అనుకూలంగా లేవన్నారు. ఎన్నికలు నిర్వహిస్తే.. జనాలకు ప్రమాదమే కాక ఖజానాపై అదనపు భారం పడుతుందని తెలిపారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవాలని కోరారు. అంతేకాక ‘కరోనా కారణంగా, సామాన్యులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. ఈ పరిస్థితులలో, ఎన్నికలు అదనపు భారాన్ని కలిగిస్తాయి. పార్లమెంటరీ బోర్డు సభ్యులందరూ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు’అంటూ ఆయన ట్వీట్ చేశారు.

అయితే అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపిన తరువాత ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుందని (ఎన్నికలను సకాలంలో నిర్వహించడానికి) పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ తెలిపారు. సకాలంలో ఎన్నికలు ‘సుపరిపాలన’ ప్రయోజనాలకు ఉపయోగపడతాయని.. జాతీయ వేదికపై బిహార్‌కు ‘తగిన గౌరవం’ పొందడానికి సహాయపడుతుందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement