‘గాడ్సే’ వ్యాఖ్యలపై మహరాజ్ విచారం | Sakshi Maharaj reveals BJP's long standing tie to Nathuram Godse | Sakshi
Sakshi News home page

‘గాడ్సే’ వ్యాఖ్యలపై మహరాజ్ విచారం

Dec 13 2014 2:57 AM | Updated on Aug 20 2018 8:20 PM

‘గాడ్సే’ వ్యాఖ్యలపై మహరాజ్ విచారం - Sakshi

‘గాడ్సే’ వ్యాఖ్యలపై మహరాజ్ విచారం

మహాత్ముడిని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడిగా పేర్కొనడంపై బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ శుక్రవారం లోక్‌సభలో విచారం వ్యక్తంచేశారు.

వ్యాఖ్యలను వాపసు  తీసుకుంటున్నట్లు వెల్లడి
శాంతించని విపక్షాలు,  హోరెత్తిన్న లోక్‌సభ..  

 
న్యూఢిల్లీ: మహాత్ముడిని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడిగా పేర్కొనడంపై బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ శుక్రవారం లోక్‌సభలో విచారం వ్యక్తంచేశారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ వ్యవహారంపై పార్లమెంట్‌లో ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. కాంగ్రెస్, ఆర్జేడీ సభ్యులు లోక్‌సభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై పలు పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించడంతో విపక్షాలు భగ్గుమన్నాయి. స్పీకర్ పోడియంలోకి దూసుకెళ్లి నినాదాలు చేశాయి. కాంగ్రెస్, ఆర్జేడీ, టీఎంసీ, లెఫ్ట్‌పార్టీల సభ్యులు ఇందులో పాల్గొన్నారు. దీంతో సభ పది నిమిషాలు వాయిదా పడింది. మళ్లీ భేటీ అయిన తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు కల్పించుకుని.. గాంధీజీ హంతకుడిని ప్రశంసించడాన్ని ఎవరూ సమర్థించరని, సదరు ఎంపీ వ్యాఖ్యలతో కేంద్రం, బీజేపీ ఏకీభవించడం లేదన్నారు.
 
 అయితే మంత్రి సమాధానంతో కాంగ్రెస్ సభ్యులు సంతృప్తి చెందలేదు.  వెంకయ్య మళ్లీ కల్పించుకుని.. గాంధీ సిద్ధాంతాలను రోజూ హత్య చేస్తున్నారన్నారు. విపక్షాలకు మరే అంశం లేకపోవడంతో ఈ విషయంపై రాద్ధాంతం చేస్తూ సభను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే సాక్షి మహారాజ్ లేచి.. మహాత్ముడిని, సభను తాను గౌరవిస్తానని, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు. ‘గాంధీని గాడ్సే ఎప్పుడో చంపాడు. కానీ సిక్కు అల్లర్ల సందర్భంగా గాంధీ సిద్ధాంతాలను నా స్నేహితులు హత్య చేశారు’ అని కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తూ పోడియంలోకి వెళ్లారు. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా నిరసన తెలిపారు. మంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. గాంధీ బోధనలకు వ్యతిరేకంగా ప్రతిపక్షం ప్రవర్తిస్తోందని విమర్శించారు. అంతకుముందు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట పలువురు కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపారు. సాక్షి మహరాజ్ క్షమాపణ చెప్పేవరకు సభను సాగనివ్వమని ఆ పార్టీ నేత జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement