హెచ్‌సీయూకి హెచ్ఆర్డీ ఏం చెప్పింది? | Respond To 'VIP Complaint', Smriti Irani's Ministry Told Hyderabad University | Sakshi
Sakshi News home page

హెచ్‌సీయూకి హెచ్ఆర్డీ ఏం చెప్పింది?

Jan 19 2016 3:00 PM | Updated on Sep 3 2017 3:55 PM

హెచ్‌సీయూకి హెచ్ఆర్డీ ఏం చెప్పింది?

హెచ్‌సీయూకి హెచ్ఆర్డీ ఏం చెప్పింది?

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన ఆరు లేఖలు కీలకంగా మారాయి.

హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన ఆరు లేఖలు కీలకంగా మారాయి. ఇందులో ఐదు లేఖలు స్మృతి ఇరానీ నేతృత్వంలోని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ (హెచ్చార్డీ) రాయడం గమనార్హం.

సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలో హెచ్చార్డీ రాసిన ఈ లేఖల్లో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఫిర్యాదుపై మీ ప్రతిస్పందన ఏమిటో తెలియజేయాలని కోరింది. అయితే ఈ వ్యవహారంలో తాను ఎలాంటి జోక్యం చేసుకోలేదని హెచ్చార్డీ మంత్రి స్మృతి ఇరానీ చెప్తున్నారు. పరిపాలన నియంత్రణ పూర్తిగా యూనివర్సిటీ చేతిలో ఉందని, దానిలో ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని ఆమె అంటున్నారు.

తనతోపాటు మరో నలుగురు విద్యార్థులను యూనివర్సిటీ నుంచి బహిష్కరించిన నేపథ్యంలో వేముల రోహిత్ ఆదివారం హెచ్‌సీయూలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీ కార్యకర్తపై దాడి చేశారనే అభియోగంతో ఈ ఐదుగురిని హెచ్‌సీయూ బహిష్కరించింది. ఈ వ్యవహారంలో ఏబీవీపీ విద్యార్థిపై దాడికి సంబంధించి ఎలాంటి ఆధారం లభించలేదని పేర్కొన్న వర్సిటీ కమిటీ.. దత్తాత్రేయ లేఖ తర్వాత ఐదుగురు విద్యార్థులపై బహిష్కరణ చర్య తీసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హెచ్‌సీయూ కులవాదులు, ఉగ్రవాదులు, జాతి వ్యతిరేకులకు అడ్డాగా మారిందంటూ కేంద్రమంత్రి దత్తాత్రేయ హెచ్చార్డీ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు.

దత్తాత్రేయ ఫిర్యాదును యూనివర్సిటీకి పంపించిన హెచ్చార్డీ ఏం చర్యలు తీసుకున్నారో తెలుపాలని ఓ ఈమెయిల్‌తోపాటు నాలుగు లేఖలను హెచ్‌సీయూకి రాసింది. 'వీఐపీ రిఫరెన్స్‌గా కేంద్ర కార్మిక, ఉపాధి శాఖమంత్రి బండారు దత్తాత్రేయ లేఖపై కామెంట్స్‌' కోరుతూ సెప్టెంబర్‌ 3న హెచ్చార్డీ యూనివర్సిటీకి ఈమెయిల్ పంపింది. సెప్టెంబర్ 24, అక్టోబర్ 6, 20, నవంబర్ 19 తేదీల్లో మరో నాలుగు లేఖలు యూనివర్సిటీకి పంపింది. ఈ లేఖల్లోని సారాంశం దత్తాత్రేయ రాసిన ఉత్తరంలోని అంశాలను ప్రతిబింబిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్ 21న ఏబీవీపీ విద్యార్థిపై దాడి వ్యవహారంలో హెచ్‌సీయూ ఐదుగురు విద్యార్థులపై చర్య తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement