బుల్లెట్‌ రైలు వద్దు.. బుల్లెట్‌ దెబ్బలకు రెడీ..

Ready To Face Bullets Against Bullet Train Says Gujarat Farmers - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్‌ ప్రభుత్వానికి చెందిన ‘గుజరాత్‌ గ్యాస్‌ కంపెనీ’ 2007లో రైతుల నుంచి భూమిని సేకరించి భూగర్భం నుంచి గ్యాస్‌ పైపులైన్లు వేసినప్పుడు మహేశ్‌ పటేల్‌ అనే రైతు తన పండ్ల తోటలో 130 మామిడి, సపోటా చెట్లను కోల్పోయారు. ఆయనకు ప్రతి చెట్టు నుంచి ఏడాదికి నాలుగువేల రూపాయల లాభం వచ్చేది.

ఈ లెక్కన ఆయనకు ఏడాదికి ఐదు లక్షల రూపాయల చొప్పున నష్టం వాటిల్లింది. ఆయనకు జరిగిన నష్టం ఇదొక్కటే కాదు. ఆయన పొలం గుండా గ్యాస్‌ పైపు లైన్‌ డయగ్నల్లీ (వికర్ణంగా) పోవడంతో ఇరువైపులున్న కొంత పొలం ఎందుకు ఉపయోగపడకుండా పోయింది. అక్కడ పెద్ద చెట్లు పెరిగే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఆయనకు మరో ప్రమాదం ముంచుకు వచ్చింది.

ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన బుల్లెట్‌ రైలు కూడా ఆయన పొలం గుండానే వెళుతోంది. అప్పుడు మరింత నష్టం వాటిల్లుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన తోట గుజరాత్‌లోని నవసారి జిల్లా మానెక్‌పూర్‌లో ఉంది. గుజరాత్, మహారాష్ట్ర, దాద్రానగర్‌ హవేలి ప్రాంతాల్లోని 312 గ్రామాల గుండా ప్రతిపాదిత బుల్లెట్‌ రైలు వెళుతుంది.

వాటిల్లో ‘అగ్రి ఎక్స్‌పోర్టు జోన్‌’గా గుర్తించిన ఎనిమిది జిల్లాలు కూడా ఉండడం గమనార్హం. వాటిల్లో నవసారి జిల్లా ఒకటి. మహేశ్‌ పటేల్‌ ఇంతకుముందు ఒక్క గుజరాత్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ వల్లనే నష్టపోయారు. కొందరు రైతులైతే  రెండు, మూడు గ్యాస్‌ పైపు లైన్ల కారణంగా నష్టపోయారు. గుజరాత్‌ గ్యాస్‌తో పాటు గెయిల్, రిలయన్స్‌ కంపెనీల గ్యాస్‌ లైన్ల కారణంగా వారు నష్టపోయారు. ఎందుకంటే ఈ మూడు కంపెనీల లైన్లు పక్కపక్కన కిలోమీటరున్నర పరిధి గుండా వెళ్లాయి.

2001లో ‘అగ్రి ఎక్స్‌పర్ట్‌ జోన్‌’గా ప్రకటించిన ఎనిమిది జిల్లాల్లో బుల్లెట్‌ రైలు కారణంగా 80,487 చెట్లను కొట్టివేయాల్సి వస్తుందని, వాటిల్లో దాదాపు 27 వేల పండ్ల చెట్లు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు. వారికి నష్ట పరిహారం ఎంత, ఎలా ఇవ్వాలన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని  ‘నేషనల్‌ హై స్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌’ అధికారులు తెలిపారు.

గ్యాస్‌పైప్‌ లైన్లు వేసినప్పుడు చెట్టుకింత నష్ట పరిహారం అని ఇచ్చారని, ఇప్పుడు అదే లెక్కన ఇవ్వొచ్చని వారంటున్నారు. ఎనిమిది జిల్లాల పరిధిలో 11 లక్షల టన్నులు మామిడి, నాలుగున్నర లక్షల టన్నుల సపోటా పండ్ల దిగుమతి వస్తోందని రైతు సంఘం తెలియజేసింది. 2017లో నవసారి జిల్లా దేశంలో అత్యధిక సపోటా పండ్లను దిగుమతి చేసిన జిల్లాగా కూడా గుర్తింపు పొందిందని రైతులు తెలిపారు. మొత్తం గుజరాత్‌లో దిగుబడి అవుతున్న మామిడి పండ్లలో 45 శాతం దిగుబడి ఈ నవసారి నుంచే వస్తోందని వారు చెప్పారు. ఆ తర్వాత స్థానంలో ఉన్న వల్సాద్‌ జిల్లా నుంచి ఎక్కువ దిగుబడి వస్తోందని వారంటున్నారు.

బుల్లెట్‌ రైలు కారణంగా ఈ రెండు జిల్లాల్లోనే 16,398 పండ్ల చెట్లు, 10,919 ఇతర చెట్లు పోతాయని అధికారుల అంచనాలే తెలియజేస్తున్నాయి. ఇవన్నీ కూడా 15 నుంచి 20 ఏళ్ల వయస్సున్న చెట్లని రైతులు తెలిపారు. ఇతర చెట్లలాగా మామిడి చెట్లను ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించలేమని, కొత్తగా పెట్టే చెట్లు ఎదగాలంటే కనీసం పదేళ్లు పడుతుందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ఈ స్థాయిలో చెట్లను కొట్టివేయడం వల్ల పర్యావరణానికి ఎంతో నష్టం వాటిల్లుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

బుల్లెట్‌ రైతు ప్రతిపాదనను గుజరాత్‌ పరిధిలోని పండ్ల తోటల రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఊరూరా తిరుగుతూ రైతుల్ని చైతన్య పరుస్తున్నారు. రైల్వేశాఖ నిర్వహిస్తున్న అవగాహనా తరగతులను వరుసగా బహిష్కరిస్తున్నారు. ఎవరికో మేలు చేయడం కోసం, తమ పొట్టలు కొట్టడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. బుల్లెట్‌ రైలుకు వ్యతిరేకంగా బుల్లెట్లు తినేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని వారు ఆవేశంగా అంటున్నారు.

జౌళి, బంగారు వ్యాపారులకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుందని భావిస్తున్న బుల్లెట్‌ రైలు(ముంబై నుంచి అహ్మదాబాద్‌) మార్గాన్ని 508 కిలోమీటర్ల పొడవున నిర్మించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. 1.1 లక్షల కోట్ల రూపాయల ఖర్చు కాగల ఈ ప్రాజెక్టును జపాన్‌ ప్రభుత్వం సహకారంతో చేపడుతున్నారు. బుల్లెట్‌ రైలు వస్తే రెండు నగరాల మధ్య దూరాన్ని రెండు గంటల్లో అధిగిమించవచ్చు. ప్రస్తుతం ఏడు గంటలు పడుతోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top