రాజీవ్‌ హంతకుల విడుదలకు నో

Rajiv Gandhi killers cannot be released, Centre tells Supreme Court - Sakshi

విదేశీ హంతకులపై కనికరం అవసరం లేదు

విడుదల చేస్తే భవిష్యత్‌లో విపత్కర పరిణామాలు

సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర హోంశాఖ

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో ఏడుగురు దోషులను విడుదల చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ ప్రతిపాదనకు తాము అంగీకరించబోమని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఒకవేళ వీరిని విడుదల చేస్తే.. ప్రమాదకరమైన సంప్రదాయాన్ని ప్రారంభించినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ఈ హత్యలో పాల్గొన్న విదేశీయుల్ని విడుదల చేస్తే అంతర్జాతీయంగా దేశం విపత్కర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

ఈ మేరకు తన అభిప్రాయాన్ని కేంద్ర హోంశాఖ జస్టిస్‌ గొగోయ్, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనానికి సమర్పించింది. మాజీ ప్రధానితో పాటు 15 మంది అధికారుల్ని పొట్టనపెట్టుకున్న విదేశీయుల్ని విడుదల చేస్తే చాలా ప్రమాదకరమైన సంప్రదాయానికి తెరతీసినట్లు అవుతుందని హోంశాఖ సంయుక్త కార్యదర్శి వీబీ దూబే కోర్టుకు సమర్పించిన పత్రంలో తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి నేరస్తుల విడుదలకు సంబంధించి అంతర్జాతీయంగా భారత్‌ విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

రాజీవ్‌ హంతకులపై ఎలాంటి జాలి చూపించాల్సిన అవసరం లేదని కోర్టుకు విన్నవించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌కు వచ్చిన రాజీవ్‌ గాంధీని 1991, మే 21న ఎల్టీటీఈ ఉగ్రసంస్థ మానవ బాంబుతో హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన చెన్నై టాడా కోర్టు 1998లో 26 మందిని దోషులుగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. వీరిలో మురుగన్, సంతమ్, అరివు, జయకుమార్, రాబర్ట్‌ పయస్, పి.రవిచంద్రన్, నళిని ఉన్నారు.

మరుసటి ఏడాది మురుగన్, సంతమ్, అరివు, నళినిల మరణశిక్షల్ని సమర్ధించిన సుప్రీంకోర్టు..  జయకుమార్, రాబర్ట్‌ , రవిచంద్రన్‌ల శిక్షల్ని యావజ్జీవంగా మార్చింది. మిగిలిన 19 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. 2000లో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ విజ్ఞప్తితో తమిళనాడు గవర్నర్‌ నళిని మరణశిక్షను యావజ్జీవంగా మార్చారు. 2014, ఫిబ్రవరి 18న ఈ కేసును మరోసారి విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. మురుగన్, సంతమ్, అరివులకు విధించిన మరణశిక్షను కూడా యావజ్జీవంగా మార్చింది.

దీంతో అప్పటి తమిళనాడు సీఎం జయలలిత ఈ ఏడుగురికి విధించిన శిక్షల్ని రద్దుచేసి విడుదల చేయాలంటూ అదే ఏడాది కేంద్రానికి లేఖ రాశారు. ఈ విషయంపై కేంద్రం సుప్రీంను ఆశ్రయించడంతో ఏడుగురు ఉగ్రవాదుల్ని తమిళనాడు ప్రభుత్వం విడుదల చేయకుండా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అనంతరం కేంద్రం అంగీకారం లేకుండా ఖైదీలను రాష్ట్రాలు విడుదల చేయడం కుదరదని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.

చట్టాన్ని సవరించేదాక ఆగం
దేశంలో ఆందోళనలు, ధర్నాలు, బంద్‌ల సందర్భంగా అల్లరిమూకలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేయడంపై సుప్రీంకోర్టు శుక్రవారం మండిపడింది. ఇలాంటి ఘటనల్ని నిరోధించేందుకు కేంద్రం చట్టాన్ని సవరించేంతవరకూ తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. చట్ట సవరణ విషయంలో ప్రభుత్వానికి తాము మార్గదర్శకాలు జారీచేస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ మాట్లాడుతూ..ఎక్కడైనా అల్లర్లు, ఆస్తుల విధ్వంసం జరిగితే సంబంధిత జిల్లా సూపరింటెండెంట్‌(ఎస్పీ)లను బాధ్యులుగా చేయాలని న్యాయస్థానానికి సూచించారు. ఢిల్లీలో అక్రమ నిర్మాణాలకు అధికారుల్ని బాధ్యులుగా చేయగానే అలాంటి అక్రమ కట్టడాలు నిలిచిపోయాయని తెలిపారు.  

► ఆరుషీ తల్వార్, పనిమనిషి హేమరాజ్‌ల హత్య కేసులో తల్వార్‌ దంపతుల్ని నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు కోర్టు అంగీకరించింది.  
► వచ్చే మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వీవీప్యాట్‌ యంత్రాలను తనిఖీలు చేయాలని కోరుతూ కాంగ్రెస్‌ నేత కమల్‌నాథ్‌ సుప్రీంను ఆశ్రయించారు.
► లైంగిక దాడి, అత్యాచారాలకు సంబంధించి మీడియా రిపోర్టింగ్‌పై ఉన్న నిబంధనల్ని సమీక్షిస్తామని సుప్రీం తెలిపింది. మీడియాలో బాధిత మహిళలు, చిన్నారుల పేర్లు, ఫొటోల ప్రసారాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ మేరకు స్పందించింది.  

వసతి గృహాల్లో రేప్‌లు ఎప్పుడు ఆగుతాయి?
దేశంలోని అనాథాశ్రమాలు, వసతి గృహాల్లో మహిళలపై అత్యాచారాలు, లైంగికదాడులు ఎప్పుడు ఆగుతాయని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. యూపీ, బిహార్‌లోని వసతి గృహాల్లో మహిళలు, మైనర్‌ బాలికలపై రేప్‌ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేసింది. అనాథాశ్రమాల్లో లైంగికదాడులపై దాఖలైన ఓ పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ మదన్‌  లోకూర్, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, జస్టిస్‌ దీపక్‌ గుప్తాల ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. యూపీలోని పాల్‌గఢ్, ప్రతాప్‌గఢ్‌ బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ వసతి గృహాల్లో మహిళలు, మైనర్‌ బాలికపై జరిగిన దారుణాలపై కోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

అమికస్‌ క్యూరీగా పనిచేస్తున్న న్యాయవాది అపర్ణా భట్‌ స్పందిస్తూ.. దేశంలోని చిన్నారుల సంరక్షణా కేంద్రాలు(సీసీఐ)తో పాటు సోషల్‌ ఆడిట్‌ వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు ప్రయత్నిస్తుందని విన్నవించారు. అనంతరం కేంద్రం, హోంశాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ న్యాయవాదులు కోర్టు ముందు హాజరుకాగా, ఇంతమంది ఎందుకొచ్చారని న్యాయస్థానం ప్రశ్నించింది. కేవలం స్త్రీ, శిశుసంక్షేమ శాఖ న్యాయవాది హాజరైతే సరిపోతుందని∙వ్యాఖ్యానించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top