ఉన్నావ్‌ కేసు : కుమార్తెలకు న్యాయం ఇలాగేనా..?

Rahul Gandhi Questions PM Modi Over Unnao Witness Death - Sakshi

న్యూఢిల్లీ : బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగార్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నావ్‌ హత్యాచారం కేసులో కీలక సాక్షి మృతి, పోస్ట్‌మార్టం లేకుండానే మృతదేహాన్ని హడావిడిగా పాతిపెట్టడంపై కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ఉన్నావ్‌ కేసును నీరుగార్చే కుట్ర ఇదంటూ రాహుల్‌ మండిపడ్డారు. మన కుమార్తెలకు న్యాయం చేసే ఈ ఐడియా మీదేనా..మిస్టర్‌ 56 ? అంటూ మోదీని ఉద్దేశించి వ్యంగ్యోక్తులతో ఆయన ట్వీట్‌ చేశారు. బాధితురాలి తండ్రిని బీజేపీ ఎమ్మెల్యే సోదురుడు అతుల్‌ సింగ్‌ సెంగార్‌ మరో నలుగురు దారుణంగా కొట్టిన ఘటన అనంతరం పోలీస్‌ కస్టడీలో మరణానికి దారితీసిన ఘటనలో యూనస్‌ కీలక ప్రత్యక్ష సాక్షిగా సీబీఐ పేర్కొంది.

ఉన్నావ్‌కు సమీపంలోని మాఖి గ్రామంలో చిరువ్యాపారి అయిన యూనస్‌ బాధితురాలి తండ్రిపై జరిగిన దాడికి ప్రత్యక్ష సాక్షి కావడం గమనార్హం. యూనస్‌ శనివారం ఉన్నట్టుండి అస్వస్ధతకు లోనయ్యాడని, ఆస్పత్రికి తీసుకువెళుతుండగానే మరణించాడని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే కుటుంబసభ్యులు సీబీఐకి, పోలీసులకు సమాచారం అందించకుండానే కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. యూనస్‌ మృతిపై బాధితురాలి బంధువులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు అతడిపై విషప్రయోగం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.

యూనస్‌ మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం నిర్వహించాలని బాధితురాలి మామ డిమాండ్‌ చేశారు. కుల్దీప్‌ సెంగార్‌ ఆయన సోదరుడు అతుల్‌ సింగ్‌ సెంగార్‌లకు వ్యతిరేకంగా సీబీఐకి ఎలాంటి సమాచారం ఇవ్వరాదని, స్టేట్‌మెంట్‌ నమోదు చేయరాదని బీజేపీ ఎమ్మెల్యే మనుషులు గ్రామస్తులు, సాక్షులను బెదిరిస్తున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top