
గ్రేట్ రాఫెల్ రాబరీ అంటూ రాహుల్ దూకుడు..
సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాఫెల్ డీల్‌పై పోరాటం ఉధృతం చేసేందుకు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గురువారం పార్టీ కోర్ గ్రూప్‌తో భేటీ కానున్నారు. గ్రేట్ రాఫెల్ రాబరీగా ఈ డీల్‌ను అభివర్ణిస్తున్న కాంగ్రెస్ పార్టీ దీనిపై మోదీ సర్కార్‌పై దాడిని తీవ్రతరం చేసే వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనుంది.
భేటీ అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రధాని నివాసం వరకూ యూత్ కాంగ్రెస్ చేపట్టే నిరసన యాత్రలో నేతలు పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాఫెల్ ఒప్పందంపై అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు నూతనంగా ఏర్పాటైన పార్టీ కోర్ గ్రూప్ కమిటీ రాహుల్ నివాసంలో భేటీ కానుంది. రాఫెల్ అంశంపై గత కొంతకాలంగా రాహుల్ గాంధీ సహా పార్టీ ముఖ్య నేతలు మోదీ సర్కార్‌పై దాడిని పెంచారు.
ఈ ఒప్పందంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీచే విచారణ జరిపించాలని పట్టుబట్టారు. స్కామ్‌ను మరో స్కామ్‌తో కప్పిపుచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. రాఫెల్ డీల్‌పై పార్లమెంటరీ కమిటీచే విచారణకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని కాంగ్రెస్ నిలదీసింది.