ప్రభుత్వాసుపత్రి నిర్వాకం.. గర్భిణీకి హెచ్‌ఐవీ బ్లడ్‌!

Pregnant Woman Given HIV Infected Blood In Tamil Nadu Government Hospital - Sakshi

చెన్నై: తమిళనాడులోని ఓ ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ల్యాబ్‌ టెక్నీషియన్ల నిర్లక్ష్యం కారణంగా వైద్యులు ఓ గర్భిణీకి హెచ్‌ఐవీ బ్లడ్‌ ఎక్కించారు. ఈ దారుణ ఘటన విరుదు నగర్‌ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం దీనికి కారణమైన ముగ్గురు ల్యాబ్‌ టెక్నీషియన్లను ఉద్యోగాల్లో నుంచి తీసేసింది. బాధిత గర్భిణీకి లేదా అతని భర్తకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది.

గత డిసెంబర్‌ 6న సదరు గర్భిణీకి ప్రభుత్వ బ్లడ్‌ బ్యాంక్‌ నుంచి తీసుకొచ్చిన బ్లడ్‌ను వైద్యులు ఎక్కించారు. అయితే ఆ రక్తాన్ని దానం చేసిన ఓ వ్యక్తికి హెచ్‌ఐవీ ఉన్నట్లు తేలడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లడానికి సిద్దపడుతున్న ఆ వ్యక్తి.. ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌లో రక్త పరీక్ష చేయించుకోగా హెచ్‌ఐవీ పాజిటీవ్‌గా తేలింది. వెంటనే అతను బ్లడ్‌ బ్యాంకు వారికి సమాచారం ఇచ్చాడు. కానీ అప్పటికే ఆ రక్తాన్ని గర్భిణీకి ఎక్కించడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులకు విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. సదరు యువకుడు రెండేళ్ల క్రితమే ఓ ఎన్జీవో కార్యక్రమం ద్వారా రక్త దానం చేశాడని, అప్పటికే అతనికి హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ బీలు ఉన్నాయని పరీక్షల్లో తేలిందని గుర్తించారు. ఈ విషయాన్ని ల్యాబ్‌ టెక్నిషియన్లు సదరు యువకుడికి తెలియజేయలేదని, అతని మెడికల్‌ రికార్డును కూడా పొందుపరచలేదని అధికారులు పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగుతుందని, టెక్నీషియన్ల నిర్లక్ష్యంతో ప్రమాదవశాత్తు జరిగిందని, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదన్నారు. ఆ యువకుడి నుంచి రెండోసారి రక్తాన్ని సేకరించినప్పుడు టెక్నీషియన్లు హెచ్‌ఐవీ టెస్ట్‌ చేయలేదని, దీంతో ఈ తప్పిదం జరిగిందన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top