
ఆధునీకరించిన భిలాయ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
సాక్షి, రాయ్‌పూర్ : ప్రధాని నరేంద్ర మోదీ గురువారం చత్తీస్‌గఢ్ పర్యటనలో బిజీబిజీగా గడిపారు. భిలాయ్‌లో ఆధునీకరించిన స్టీల్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని అంతకుముందు నగరంలో రోడ్‌షో నిర్వహించారు. నయా రాయ్‌పూర్‌లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన ప్రధాని భిలాయ్‌లో రోడ్‌షో చేపట్టారు. నగర వీధుల్లో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు.
స్టీల్ ప్లాంట్‌లో చేపట్టిన సమూల మార్పులను, విస్తరణ, ఆధునీకరణ తీరుతెన్నులను ఆసక్తిగా పరిశీలించారు. 1955లో సోవియట్ రష్యా సహకరాంతో ఏర్పాటైన భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో ఉత్పాదకత, నాణ్యత, పర్యావరణ అనుకూల ఉత్పత్తులను పెంచేలా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునీకరణ ప్రక్రియను చేపట్టారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న చత్తీస్‌గఢ్‌లో ప్రధాని పర్యటించడం గత రెండు నెలల్లో ఇది రెండవ పర్యటన కావడం గమనార్హం. తన పర్యటనలో భాగంగా ప్రధాని భిలాయ్‌లో ఐఐటీకి శంకుస్ధాపన చేయడంతో పాటు రాయ్‌పూర్-జగదల్‌పూర్ విమాన సర్వీసులను లాంఛనంగా ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.