ప్రణాళికా సంఘం రద్దు!!

ప్రణాళికా సంఘం రద్దు!! - Sakshi


జాతీయ, అంతర్జాతీయ రంగాల్లో మారిన ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రణాళికా సంఘాన్ని రద్దుచేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఎర్రకోట నుంచి చేసిన తన మొట్టమొదటి ప్రసంగంలోనే ఆయనీ విప్లవాత్మక నిర్ణయాన్ని వెలువరించారు. దీని స్థానంలో సరికొత్త సంస్థను తీసుకొస్తామని చెప్పారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే.. రాష్ట్రాలను ముందుకు తీసుకెళ్లాలని, సమాఖ్య నిర్మాణం ప్రాధాన్యం గత 60 ఏళ్లలో కన్నా ఇప్పుడు మరింత ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. ప్రణాళికాసంఘం స్థానంలో కొత్త ఆత్మతో కూడిన కొత్త వ్యవస్థ మనకు అవసరమని అన్నారు.మోడీ నిర్ణయంతో ఆరున్నర దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర గల ప్రణాళికాసంఘం త్వరలోనే ‘గత చరిత్ర’గా మారిపోనుంది. 1950లో ఆర్థికవ్యవస్థలో ప్రభుత్వ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చిన కాలంలో ప్రణాళికాసంఘాన్ని స్థాపించారు. నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ.. సోవియట్ ప్రభావితమై.. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించేందుకు భారత ప్రణాళికా సంఘాన్ని నెలకొల్పారు. కేంద్ర కేబినెట్ తీర్మానం ద్వారా ఏర్పాటైన ఈ సంఘానికి.. అపరిమిత అధికారం, ఎంతో ప్రతిష్ట ఉండేది. ఇది ఇప్పటివరకూ ప్రధాని అధ్యక్షతనే పనిచేస్తోంది. ఆయా రంగాలవారీగా అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించడం, వాటిని సాధించేందుకు వనరులను కేటాయించటం ఈ సంఘం ప్రధాన విధి. ప్రణాళికాసంఘానికి ఉపాధ్యక్షులు పనిచేసిన వారిలో చాలామంది రాజకీయ ఉద్దండులే. ఆ పదవిలో ఉన్నవారికి కేబినెట్ మంత్రి హోదా ఉంటుంది. గుల్జారీలాల్‌ నందా, టి.టి.కృష్ణమాచారి, సి.సుబ్రమణ్యం, పి.ఎన్.హక్సార్, మన్మోహన్‌సింగ్, ప్రణబ్‌ముఖర్జీ, కె.సి.పంత్, జశ్వంత్‌సింగ్, మధు దండావతే, మోహన్‌ ధారియా, ఆర్.కె.హెగ్డే తదితరులు ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. దీనికి చిట్టచివరి ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా. అయితే.. 1990లలో ఆర్థికవ్యవస్థ సరళీకరణ, ప్రపంచీకరణ బాటలో పయనించటం మొదలయ్యాక ప్రణాళికాసంఘం ప్రాధాన్యం కనుమరుగైంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top