బూతు సినిమాలు చూడటానికే ఇంటర్‌నెట్‌ ఉపయోగం..

People Of Kashmir Used Internet To Watch Dirty Film VK Saraswat - Sakshi

నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ వివాదాస్పద వ్యాఖ్యలు

సాక్షి, ముంబై :  జమ్మూకశ్మీర్‌లో ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేయడంపై నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లోని యువత దర్టీ మూవీస్‌ (బూతు సినిమాలు) చూడటానికే ఇంటర్‌నెట్‌ను ఉపయోగిస్తారని వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో దేశానికి ఎలాంటి ఆర్థిక నష్టాలు లేవని అన్నారు.  ఆదివారం ముంబైలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘కశ్మీర్‌లో ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేయడం అసలు విషయమే కాదు. ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేయడంతో వచ్చే తేడా ఏమిటి? అక్కడ ఇంటర్‌నెట్‌లో ఏం చూస్తారు? బూతు సినిమాలు చూడటం తప్ప అక్కడ యువత ఏం చేస్తారు?’’ అని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, వదంతులు వ్యాప్తి కాకుండా ఉండేందుకే అక్కడ ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేశామని సారస్వత్ స్పష్టం చేశారు. (జమ్మూ కశ్మీర్‌లో మొబైల్‌ సేవల పునరుద్ధరణ)

రాజకీయ నాయకులు కశ్మీర్‌లో ఢిల్లీ తరహా నిరసనలను సృష్టించి, వాటికి సోషల్ మీడియా ద్వారా మరింత ఆజ్యం పోయడానికి ప్రయత్నిస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. కాగా ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం ఆగస్ట్‌ 5 నుంచి కశ్మీర్‌ వ్యాప్తంగా ఇంటర్‌నెట్‌ సేవలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే. సంఘ వ్యతిరేక శక్తులు ఇంటర్నెట్‌ను దుర్వినియోగం చేస్తున్నాయని, ప్రజల్లో భయాందోళనలను సృష్టించేందుకు, ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఇంటర్‌నెట్‌ను వాడుతున్నాయని సమాచారం అందడంతో తాత్కాలికంగా నిలిపివేశామని అధికారులు వెల్లడించారు.  అనంతరం పలువురు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. న్యాయస్థానం ఆదేశాలతో ఇంటర్‌నెట్‌ సేవలను  పునరుద్ధరించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top