టిక్‌టాక్‌ తీసిన ప్రాణాలెన్నో...

People Are Addicted To Tik Tok App - Sakshi

టిక్ టాక్.. ఓ యాప్.. సింపుల్­గా యాప్ అనడం కంటే ఇదొక వ్యసనం అనొచ్చు. అంతగా టిక్ టాక్ యూజర్లను మైకంలో ముంచేస్తోంది. ఇప్పుడు ఎవరైనా గంటలు గంటలు ఒంటరిగా గడిపేస్తున్నారంటే.. టిక్ టాక్­లో దూరిపొయ్యారని అర్థం చేసుకోవాలి. స్మార్ట్ ఫోన్‌ అదేపనిగా స్క్రోల్ చేసేస్తున్నారంటే కూడా టిక్ టాక్ వీడియోస్ చూస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఇలా వీడియోలు చూస్తూ, చేస్తూ కుటుంబాలను కూల్చుకుంటున్న వారూ, ప్రాణాలు తీసుకుంటున్నవారూ ఎందరో. టిక్ టాక్ అనే ఈ ఆధునిక జబ్బుకు మందులేదు.. నివారణా మార్గమూ లేదు..

మన పక్కనే కూర్చొని ఫోన్ స్క్రోల్ చేస్తూ వేరే లోకంలో విహరిస్తోంటే వాళ్లు కచ్చితంగా టిక్ టాక్­లో ఉన్నట్టే... ఇంట్లోనే ఉంటూ చడీ చప్పుడు లేకుండా ఏవో డాన్సులు, ఎక్స్ ప్రెషన్లు పెడుతోంటే.. వాళ్లు కచ్చితంగా టిక్ టాక్ వీడియోలు చేస్తున్నట్టే లెక్క.. అవును ఇప్పుడు ఫేస్ బుక్, వాట్సప్­లను మించి టిక్ టాక్ వీడియోలు చేస్తున్నారు.. చూస్తున్నారు. ఈ చైనా యాప్ కొంత మందిని స్టార్లను చేస్తోంటే.. కొన్ని జీవితాలను నాశనం చేస్తోంది. కాపురాలను నిలువునా కూల్చేస్తోంది. మరికొన్ని ప్రాణాలను గాల్లో కలిపేస్తోంది. మొత్తంగా మన దేశంలో టిక్ టాక్ ఒక సంచలనం.. పెను దుమారం..

యూత్­లో ఫేస్ బుక్ పాతబడిపోయింది.. వాట్సప్ పాచిబట్టిపోయింది... ఇప్పుడంతా టిక్ టాక్ మయం చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందా.. అందులో టిక్ టాక్ యాప్ ఉందా.. ఇవి చాలు సినిమాల్లో హీరోలను మించిన ఎక్స్­ప్రెషన్స్..హీరోయిన్స్­ని మించిన డాన్సులతో ఓ ఊపుఊపెయ్యడానికి. ఎక్స్ ప్రెషన్స్ పెట్టు.. అప్­లోడ్ కొట్టు.. లైకులు.. కామెంట్లు ఫాలోయింగులు.. స్టార్లుగా వెలిగిపోవడానికీ సినిమాల్లోకే వెళ్లనక్కర్లేదు.. హీరోహీరోయిన్లను మించి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి ఇప్పుడు ఒక్క స్మార్ట్ ఫోన్ అందులో టిక్ టాక్ యాప్ ఉంటే చాలు అని యూత్ నమ్ముతోంది. అది కొంత వరకు నిజం కూడా.. చాలా మందిని టిక్ టాక్ ఓవర్ నైట్ స్టార్లను చేసేంది. టిక్ టాక్­లో పాపులర్ అయిన వాళ్ల ఫాలోయింగ్ మిలియన్లలో ఉందంటే.. వాళ్ల క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.

యాప్‌లో మంచి ఎఫెక్ట్స్.. అదిరిపోయే షార్ట్ మ్యూజిక్ బిట్స్.. డైలాగ్ బిట్స్ ఉంటాయి.. వాటికి తగ్గట్టుగా పెదాలు ఆడిస్తూ శరీరాన్ని కదిలిస్తే చాలు.. నచ్చిన వాళ్లు అక్కడికక్కడే కామెంట్లతో ప్రశంసల వర్షం కురిపిస్తారు.. ఎవరికి వారు స్టార్ అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఎప్పట్నుంచో లోలోపల ఉన్న కోరికేదో తీరినట్లనిపిస్తుంది. ఈ ఆశే కుర్రకారును కిర్రెక్కిస్తోంది.. ఎక్కడో పల్లెటూరిలో ఉన్న పోరగాడికి టిక్ టాక్ వీడియోల ద్వారా దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉంటారు.. ఇంకా ఇంటర్మీడియట్ కూడా పూర్తవని టీనేజ్ అమ్మాయి కొత్త వీడియో ఎప్పుడు చేస్తుందా అని మిలియన్ల మంది వెయిట్ చేస్తుంటారు... ఇప్పుడు మన దేశంలోని యూత్­ని టిక్ టాక్ ఆకర్షించినంతగా మరేదీ ఆకట్టుకోవడం లేదు..

నిజంగానే టిక్ టాక్ క్రియేటివిటీని బయటపెట్టేలా చేస్తోంది.. కాన్ఫిడెన్స్ పెంచుతోంది. అమ్మాయిల్లో బెరుకుపోగొట్టి ఫ్రీ ఎక్స్­ప్రెషన్­ను బయటపెడుతోంది. అయితే.. అదే శ్రుతి మించితే.. అవసరానికి మించి చేస్తే ఏదైనా అనర్థాలకే దారితీస్తుంది. పుస్తకాలను పక్కన పడేసి విద్యార్థులు.. పిల్లల్ని పక్కన పడేసి చంటిబిడ్డల తల్లులు... భార్యా పిల్లల్ని పట్టించుకోకుండా మగవాళ్లు టిక్ టాక్­ వీడియోలు చేస్తూ చూస్తూ గంటలకు గంటలు గడిపేస్తున్నారు.. ఒక్క మన దేశంలోనే 35 కోట్ల మంది ఈ యాప్ వాడుతున్నారు. టిక్ టాక్ ఒక్క రోజు ఆదాయం మూడున్నర కోట్ల రూపాయలు.

టిక్ టాక్ పచ్చని కుటుంబాల్లో చిచ్చుపెట్టే స్థాయికి చేరింది.. ఆ మధ్య కోయంబత్తూర్­లో ఓ వ్యక్తి ...భార్య టిక్ టాక్ చేస్తోందని ఆమెను హత్య చేశాడు. తాజాగా తమిళనాడులో భర్త టిక్ టాక్ వీడియోలు చెయ్యొద్దన్నాడని ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆరియలూర్­లో అనిత అనే మహిళ తరచూ టిక్ టాక్ వీడియోలు చేసి అప్ లోడ్ చేసేది. ఈ క్రమంలో తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరిగేవి. వీడియోలు చెయ్యవద్దని భర్త ఆంక్షలు పెట్టడంతో భరించలేకపోయిన అనిత పురుగుల మందు తాగేసింది.. తాను విషం తాగుతున్న వీడియోను కూడా టిక్ టాక్­లో పోస్ట్ చేసింది. అందులో తాను చనిపోతున్నాననీ.. పిల్లల్ని బాగా చూసుకోవాలనీ అనిత భర్తకు సూచించింది.

టిక్ టాక్ వీడియోలు చెయ్యడం అనితకు వ్యసనంగా మారిందనీ.. ఆ మాయలో పడి పసిబిడ్డను కూడా పట్టించుకోలేదని.. అనిత టిక్ టాక్ వీడియోల్లో మునిగిపోయి ఉన్నప్పుడు పాప చాలా సార్లు కింద పడి గాయాలపాలైందని భర్త చెబుతున్నాడు. అనిత ఆత్మహత్య వీడియో వైరల్ అవడంతో.. టిక్ టాక్­పై ఓ చర్చకు తెరలేపింది. టిక్ టాక్ చేస్తున్న చూస్తున్న వాళ్లకు కలిగి ప్రయోజనం మాట అటుంచితే.. కలుగుతున్న అనర్థాలు, అపార్థాల మాటేమిటన్న ప్రశ్న ఉత్పన్నమౌతోంది. మొన్నటివరకు ఫేస్‌బుక్‌, వాట్సప్­లపై గంటలు గడిపే వారు కాస్త ఇప్పుడు టిక్‌టాక్‌ వీడియోలను చేతులు అరిగిపోయేలా స్ర్కోల్‌ చేసుకుంటూ చూసేస్తున్నారు. నచ్చిన వారిని ఫాలో అవడంతో పాటు, నచ్చిన వీడియోలను మళ్లీ మళ్లీ చూడడం కోసం ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. ఒకవేళ ఏదైనా వీడియో డౌన్‌లోడ్‌ కాకపోతే ప్రత్యేకమైన యాప్స్‌ వాడడం ద్వారా వాటిని ఫోన్‌లోకి డౌన్‌లోడ్‌ చేస్తున్నారు. వీక్షకుల సంగతి ఇలా ఉంటే, టిక్‌ టాక్‌లాంటి యాప్స్‌లో వీడియోలు తయారు చేసే వారి పరిస్థితి మరోలా ఉంటుంది.

ఒక సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం, టిక్‌ టాక్‌­లో రెచ్చగొట్టే హావభావాలతో చేసిన వీడియోలను.. యువత ఎక్కువగా ఆస్వాదిస్తూ వీక్షిస్తున్నట్లుగా వెల్లడైంది. ఇక అలాంటి వీడియోల చేసే కామెంట్స్ మరీ దారుణంగా ఉంటున్నాయి. చిన్న పిల్లల్ని లైంగికంగా ప్రేరేపించేలా ఈ వీడియోలు ఉంటున్నాయన్న విమర్శలతో పాటు.. టిక్ టాక్­కి నేరుగా బాధితులయ్యేది చిన్నారులేననేది మద్రాసు హైకోర్టుదాకా వెళ్లింది. ఇటీవలి కాలంలో కొంతమంది సెక్స్‌ వర్కర్లు టిక్‌టాక్‌ని వేదికగా చేసుకొని, అసభ్యకరమైన వీడియోలు పోస్ట్‌ చేస్తూ, తమని ఫాలో అవుతున్న వారితో టచ్‌లో ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఇలాంటి ధోరణులను ప్రోత్సహించబోమని టిక్ టాక్ యాజమాన్యం చెబుతున్నా చేతల్లో ఎక్కడా నియంత్రణ కనిపించడం లేదు.

అనేకచోట్ల టిక్‌ టాక్‌ వీడియోలు చేయటం ఒక సరదాగా మొదలై, అది కుటుంబ కలహాలకు, విడాకులకు దారి తీయటం జరుగుతోంది. టిక్‌ టాక్‌లో ఉన్న డ్యూయట్‌ ఫీచర్‌ వలన సమస్య మరింత ముదురుతోంది. ఒక మహిళ ఒక వీడియోను పబ్లిక్‌గా పెడితే దాన్ని ఆసరాగా చేసుకొని, ముక్కు మొహం తెలియని పురుషులు డ్యూయట్‌ వీడియోలు తయారు చేస్తున్నారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాంటి సందర్భాల్లో కాపురాలు కూలిపోతున్నాయి. ఊరూపేరు తెలియని వ్యక్తులను టిక్ టాక్ లో చూసి ప్రేమలో పడి చదువులను పాడుచేసుకునే టీనేజర్లు ఎందరో.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top