పాక్ ఉల్లంఘనలు ఆగాలి: జైట్లీ | Sakshi
Sakshi News home page

పాక్ ఉల్లంఘనలు ఆగాలి: జైట్లీ

Published Mon, Jun 16 2014 2:53 AM

Pakistan violations wait: Jaitley

శ్రీనగర్: కాల్పుల విరమణ ఉల్లంఘనలు, చొరబాట్లు కొనసాగినట్లైతే పాకిస్థాన్‌తో చర్చల్లో పురోగతి సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు వీలుగా నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద దురాగతాలకు అడ్డుకట్ట వేయూలని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ నొక్కిచెప్పారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా జమ్మూ కాశ్మీర్‌లో పర్యటిస్తున్న జైట్లీ ఆదివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. సాధారణ పరిస్థితులు నెలకొనని పక్షంలో పాక్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు.

కాశ్మీరీ పండిట్లు వెనక్కి వచ్చేలా కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం విధాన పరమైన చర్యలు ప్రకటిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో భద్రత పరమైన పరిస్థితిపై గవర్నర్ ఎన్.ఎన్.వోరా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, సీనియర్ సైనికాధికారులతో చర్చించానన్నారు. రెండోరోజు పర్యటనలో భాగంగా హాజీ పిర్ పాస్‌కు సమీపంలోని సైనిక స్థావరాలను ఆయన సందర్శించారు.
 
 

Advertisement
Advertisement