
‘భూసేకరణ’ ఆర్డినెన్స్ రైతు వ్యతిరేకం
అభివృద్ధి ప్రాజెక్టులకు రైతుల ఆమోదం లేకుండానే వారి భూములను స్వాధీనం చేసుకునేలా భూసేకరణ చట్టాన్ని సవరిస్తూ మోదీ సర్కారు ఆర్డినెన్స్ జారీ చేయడంపై ఎన్డీఏ మిత్రపక్షమైన పీఎంకేతోపాటు ప్రతిపక్ష పార్టీలన్నీ మంగళవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి.
మోదీ సర్కార్‌పై విపక్షాల ధ్వజం
ఐక్య పోరాటానికి కాంగ్రెస్ పిలుపు
మేం అమలు చేయం: మమత
సర్కారు చర్యను తప్పుబట్టిన మిత్రపక్షం పీఎంకే
న్యూఢిల్లీ: అభివృద్ధి ప్రాజెక్టులకు రైతుల ఆమోదం లేకుండానే వారి భూములను స్వాధీనం చేసుకునేలా భూసేకరణ చట్టాన్ని సవరిస్తూ మోదీ సర్కారు ఆర్డినెన్స్ జారీ చేయడంపై ఎన్డీఏ మిత్రపక్షమైన పీఎంకేతోపాటు ప్రతిపక్ష పార్టీలన్నీ మంగళవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. పార్లమెంటు ముగిశాక దొడ్డి దారిన ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకురావడాన్ని కూడా తప్పుబట్టాయి. ప్రభుత్వ చర్యను రైతు వ్యతిరేకిగా, అన్యాయమైనదిగా, ఆందోళన కలిగించేదిగా అభివర్ణించాయి. భూసేకరణకు రైతుల అనుమతి తప్పనిసరి అనే నిబంధనను ప్రభుత్వం చట్ట సవరణలో తొలగించడం బలవంతపు భూసేకరణకు తలుపులు తెరిచేలా ఉందని, ఇది ఆందోళనకరమని భూసేకరణ చట్టం రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. ఈ సవరణను అడ్డుపెట్టుకొని ప్రభుత్వం రైతుల భూములను బదలాయించే, అవసరానికి మించి భూసేకరణ చేపట్టే ప్రమాదం కూడా ఉందన్నారు.
దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకొని తీరాల్సిందేనన్నారు. భూసేకరణ చట్టాన్ని సవరించడం ద్వారా బీజేపీ రైతు వ్యతిరేకి అనిపించుకుందని మరో కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ విమర్శించారు. ప్రభుత్వ చర్యను వ్యతిరేకించేందుకు రైతు అనుకూల పార్టీలన్నీ ముందుకు రావాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకించిన బీజేపీ...ఇప్పుడు కార్పొరేట్ల కోసం భూసేకరణ చేసే ఉద్దేశంతోనే చట్ట సవరణ చేసిందని ఎండీఎంకే నేత వైకో ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్. రాందాస్...చట్ట సవరణలో మార్పులు కోట్లాది మంది రైతులపై ప్రభావం చూపుతాయని విమర్శించారు. ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం తెలపరాదని కోరారు.
ఎమర్జెన్సీకన్నా దారుణం: మమత
కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ అమలును తమ రాష్ట్రంలో చేపట్టబోమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కేంద్రం ఒకవేళ అమలు చేయాలనుకుంటే తన శవాన్ని దాటాకే ఆ పని చేయాల్సి ఉంటుందన్నారు. మోదీ పాలన దేశంలో ఎమర్జెన్సీ రోజులకన్నా దారుణంగా ఉందని కోల్‌కతాలో జరిగిన సభలో దుయ్యబట్టారు.
పార్లమెంటులో అడ్డుకుంటాం: ఏచూరి
సాక్షి, న్యూఢిల్లీ: భూసేకరణ చట్టాన్ని సవరించడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకురావడాన్ని పార్లమెంటులో అడ్డుకుంటామని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి చెప్పారు. మంగళవారం ఢిల్లీలో ఏచూరి మీడియాతో మాట్లాడుతూ యూపీఏ ఐదేళ్లలో 25 ఆర్డినెన్సులు తీసుకురాగా ఎన్డీఏ ప్రభుత్వం ఆరునెలల్లోనే 9
ఆర్డినెన్సులు తెచ్చిందని విమర్శించారు.
గత్యంతరం లేకే ఆర్డినెన్స్: వెంకయ్య
పార్లమెంటు ముందుకు కీలక బిల్లులు రాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుపడటం వల్ల ప్రభుత్వానికి వేరే దారి లేక తప్పనిసరి పరిస్థితుల్లోనే భూసేకరణ చట్ట సవరణకు ఆర్డినెన్స్‌ను జారీ చేయాల్సి వచ్చిందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్కరణల విధానాన్ని అడ్డుకునేందుకు విపక్షాలు కుట్ర పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు.