
ముంబై : సంచలన వ్యాఖ్యలు చేయడంలో ముందుండే కేంద్ర మంత్రి నితిన్ గడ్కిరి మరోసారి వార్తల్లో నిలిచారు. తన ముందు ఎవరైన కులం పేరెత్తితే తంతానంటున్నారు నితిన్ గడ్కరి. ఓ పబ్లిక్ మీటింగ్‌కు హాజరైన నితిన్ గడ్కరి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ‘మేము కులాన్ని పట్టించుకోం. మీ ప్రాంతంలో ఎన్ని కులాలున్నాయో నాకు తెలీదు. కానీ మా దగ్గర మాత్రం కులాల ప్రసక్తే లేదు. ఎందుకంటే ఎవరైనా కులం గురించి మాట్లాడితే నా చేతిలో చావు దెబ్బలు తింటార’ని చెప్పుకొచ్చారు.
అంతేకాక కుల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని నితిన్ గడ్కరి పిలుపునిచ్చారు. సమాజంలో పేద, ధనిక తారతమ్యాలను తొలగించాలని తెలిపారు. ఒకరిది ఎక్కువ కులం.. మరొకరిది తక్కువ కులం అనే భేదం తొలగిపోవాలని కోరుకున్నారు. పేదలు, అణకువతో ఉండేవారు దేవునితో సమానమన్నారు. పేదలకు సేవ చేయడం అంటే దైవాన్ని పూజిండమేనని చెప్పుకొచ్చారు. పేదలకు కావాల్సిన కూడు, గూడు, గుడ్డ కల్పించడం అందరి బాధ్యత అని చెప్పుకొచ్చారు.