ఇంద్రాణీకి పీటర్ విడాకులు..!

ఇంద్రాణీకి పీటర్ విడాకులు..!


షీనా బోరా హత్య కేసులో జైలు జీవితం గడుపుతున్న ఇంద్రాణీ ముఖర్జీయాకు ఆమె భర్త పీటర్ ముఖర్జీయా విడాకులు ఇవ్వదలుచుకున్నాడా?  అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇంద్రాణీ పుట్టినరోజున ఆమెకు గుర్తుండిపోయే జ్ఞాపకాన్ని ఇస్తానని లేఖ రాసిన పీటర్.. తాజాగా విడాకులు తీసుకోవడానికి సిద్ధపడుతున్నట్లు ఆయన లాయర్ మిహిర్ ఘీవాలా తెలిపారు. షీనా కేసులో గత నవంబర్ లో పీటర్ ను కూడా నిందింతుడిగా చేరుస్తూ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.


పీటర్ అరెస్టయిన నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 40కుపైగా ఉత్తరాలను ఇంద్రాణీ రాసింది. వాటిలో తాను ఏ తప్పు చేయలేదని, 2016లో మంచి జీవితం ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. మొదట్లో వాటికి సమాధానం ఇవ్వని పీటర్ డిసెంబర్21న వచ్చిన లేఖకు మాత్రం జనవరిలో ఇంద్రాణీ పుట్టిన రోజు సందర్భంగా తొలిసారి సమాధానం ఇచ్చారు.


2015 సెప్టెంబర్ నుంచి బైకుల్లా మహిళా కారాగారంలో జైలు జీవితం గడుపుతున్న ఇంద్రాణీ తరచుగా తన ఒంటరితనాన్ని పీటర్ తో పంచుకోవడానికి ప్రయత్నించారని, తనకున్న వ్యాధి (మెదడుకు రక్తప్రసరణ సరిగా అవకపోవడం) ముదురుతోందని త్వరలోనే మరణిస్తానని ఆమె లేఖలో తెలిపిందని పీటర్ మరో లాయర్ ఆబోద్ పాండా తెలిపారు.


తన చివరి రోజులు భరించలేని నొప్పితో కూడుకొని ఉంటాయా? అని డాక్టర్లను ప్రశ్నించినప్పుడు.. వారు అదేం ఉండదని ముందు కోమాలోకి వెళ్లి తర్వాత మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారని ఇంద్రాణీ లేఖలో వివరించింది. అందుకు సమాధానంగా.. విధిరాతను ఎవరూ మార్చలేరు. తాను జైలు అధికారులతో మాట్లాడుతానని ఏదైనా అనుకోని సంఘటన జరిగితే తనకు తెలపాలని కోరతానని చెప్పారు. కాగా గురువారం పీటర్ ముఖర్జియా బెయిల్ పిటీషన్ పై కోర్టులో మళ్లీ వాదనలు జరగనున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top