నిరుద్యోగుల కోసం టీసీఎస్‌ శిక్షణ‌

NCS Ties With TCS For Providing Jobs - Sakshi

న్యూఢిల్లీ: దేశంలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కార్మిక శాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌)తో ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉచిత నైపుణ్య శిక్షణను అందించడమే టీసీఎస్‌ అయాన్‌ కోర్సు లక్క్ష్యమని ఐటీ దిగ్గజం టీసీఎస్ పేర్కొంది. అయితే శిక్షణకు హాజరయ్యే వారు  కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ (ఎన్సీఎస్‌) పోర్టల్‌లో పేరును నమోదు చేసుకోవాలని కార్మిక శాఖ పేర్కొంది.

టీసీఎస్‌ స్పందిస్తూ.. అభ్యర్థులు ఒత్తిడికి గురికాకుండా వ్యక్తిత్వ వికాసం, జీవ నైపుణ్యాలకు కోర్సులో అధిక ప్రాధాన్యత కల్పించామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. శిక్షణలో కోర్సుకు సంబంధించిన వివిధ మాడ్యూల్స్‌, కార్పొరేట్‌ వ్యవస్థ, భావోద్వేగ నియంత్రణ, అత్యాధునిక సాంకేతికత అంశాలపై శిక్షణ ఇస్తామని టీసీఎస్‌ స్పష్టం చేసింది. విద్యార్థుల నుంచి కంపెనీలు ఆశించే నైపుణ్యాల ఆధారంగానే కోర్సును రూపకల్పన చేశామని సంస్థ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. టీసీఎస్‌ అయాన్‌ కోర్సును హిందీ, ఇంగ్లీష్‌ భాషలలో బోధిస్తామని టీసీఎస్‌ తెలిపింది.

ఎన్‌సీఎస్‌ పోర్టల్‌లో ఇప్పటి వరకు కోటి మంది నమోదు చేసుకోగా.. 73 లక్షల మందికి ఉపాధి కల్పించామని కార్మిక శాఖ వెల్లడించింది. ఎన్‌సీఎస్‌లో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,000 ఉపాధి ఎక్స్చేంజ్‌లు, 200 మోడల్‌ ఉపాధి కేంద్రాలు నమోదు చేసుకున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా కేంద్ర కార్మిక శాఖతో కలిసి పనిచేయడం పట్ల టీసీఎస్‌ హర్షం వ్యక్తం చేసింది. 

చదవండి: వారికి భారీ జీతాలు సమంజసమే - టీసీఎస్‌

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top