
బుల్లెట్ ప్రూఫ్ అద్దాలా.. నాకొద్దు
ఎర్రకోట మీద జెండా ఎగరేసేటప్పుడు ఈసారి డ్రోన్లతో కూడా దాడులు చేసే ప్రమాదం ఉందని హెచ్చరించినా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్టించుకోలేదు.
ఎర్రకోట మీద జెండా ఎగరేసేటప్పుడు ఈసారి డ్రోన్లతో కూడా దాడులు చేసే ప్రమాదం ఉందని హెచ్చరించినా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్టించుకోలేదు. ఇప్పటికి వరుసగా మూడో ఏడాది ఆయన బుల్లెట్ ప్రూఫ్ వేదిక లేకుండా.. బహిరంగ వేదిక నుంచే ప్రసంగించారు. సాధారణంగా ప్రధానమంత్రులు స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగం చేసేటప్పడు బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనకగా పోడియం ఏర్పాటుచేస్తారు.
ఈసారి భద్రతాపరంగా తీవ్రమైన ముప్పు ఉందన్న హెచ్చరికలను బేఖాతరు చేస్తూ.. తాను మాత్రం ప్రజలతో నేరుగానే ప్రసంగిస్తాను తప్ప బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనక నుంచి మాట్లాడేది లేదని 2014 నుంచి చెబుతూనే వస్తున్నారు. ఈసారి కూడా అలాగే చేశారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత నుంచి ప్రధానమంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు వాడటం అలవాటుగా మారింది.
1985 రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పటి నుంచి దీన్ని ప్రారంభించారు. 1990లో వీపీ సింగ్ వచ్చిన తర్వాత సగం వరకు మాత్రమే బుల్లెట్ ప్రూఫ్ ఉంచాలని కోరారు. పీవీ నరసింహారావు ప్రధాని అయ్యాక మళ్లీ దాని ఎత్తు పెంచారు. అయితే ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నరేంద్ర మోదీ మాత్రం రాజస్థానీ తలపాగా ధరించి, తన ట్రేడ్మార్కు పొట్టి చేతుల కుర్తా ధరించి స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా బుల్లెట్ ప్రూఫ్ లేకుండానే ప్రసంగిస్తున్నారు.