లావెక్కుతున్న కార్పొరేట్‌ ప్రపంచం

Majority of Corporate Executives in India are Overweight: Study - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో ‘ఫిట్‌నెస్‌’ పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ మరో పక్క కార్పొరేట్‌ ప్రపంచంలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్‌లు బొజ్జలు పెంచుతూ లావెక్కుతున్నారు. కనుక వీరికి మధుమేహం, గుండెపోటు లాంటి ప్రాణాంతక జబ్బులు అనివార్యమవుతున్నాయి. దేశంలో మూడింట రెండు వంతుల మంది కార్పొరేట్‌ ఎగ్జిక్యూటివ్‌లకు ‘బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ)’ సగటున 25 ఉందని ‘హెల్దీఫైమీ’ అనే యాప్‌ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. వారందరి మాస్, అంటే ద్రవ్యరాశి 24.9 ఉంటే వారు ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. మనిషి ఎత్తు, బరువును బట్టి బీఎంఐని నిర్ధారిస్తారు. ఎత్తును మీటర్లలో, బరువును కిలోల్లో లెక్కించి ద్రవ్యరాశిని లెక్కిస్తారు.

సాధారణంగా ఎత్తుకు తగ్గ బరువు, అంతకన్నా ఎక్కువ ఉన్న వారి బీఎంఐ 25కు పైనే ఉంటుంది. ఎత్తుకు తగ్గ బరువుకన్నా తక్కువ బరువు ఉన్నవారే బీఎంఐకి 25లోపు వస్తారు. కార్పొరేట్‌ రంగంలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్‌లు ఎక్కువ వరకు కుర్చీలకు అతుక్కుపోయి పనిచేయడం, మానసిక ఒత్తిడికి గురవడం బరువు పెరగడానికి ప్రధాన కారణాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. ఆర్థిక సర్వీసుల్లో, ఉత్పత్తిరంగాల్లో పనిచేస్తున్న వారి జీవన శైలి దాదాపు ఇలాగే ఉంటుంది కనుక వారు లావెక్కేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వినిమయ సరుకులు, అతి వేగంగా అమ్ముడుపోయే వినిమయ సరకులకు సంబంధించిన పరిశ్రమల్లో పనిచేసే వారి ఆరోగ్యం ఆర్థిక, ఉత్పత్తి రంగాల్లో పనిచేసే వారికన్నా మెరుగ్గానే ఉంటుంది. ఎందుకంటే భారతీయ ప్రమాణాల ప్రకారం వారు రోజు ఆఫీసు విధుల్లో వెయ్యి మెట్లు ఎక్కడానికయ్యేంత శ్రమను శారీరకంగా అనుభవిస్తారు. అందుకని వారు కాస్త ఫిట్‌గానే ఉంటారు.

కార్పొరేట్‌ ఎగ్జిక్యూటివ్‌లే కాకుండా గుమాస్తా గిరి చేసే ఉద్యోగులంతా లావెక్కడానికి మరొక ముఖ్య కారణం ఉంది. అదే ‘ఛాయ్‌... సమోసా’ కల్చర్‌. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం చేసే వీరి సాయంత్రం వేళల్లో సరదాకు అన్నట్లు సమోసాల్లాంటి ఆయిల్‌లో మరిగించే పిండి పదార్థాలు తినడం బొజ్జ పెరగడానికి, లావెక్కడానికి ప్రధాన కారణమని ‘హెల్దీఫైమీ’ యాప్‌ ‘కార్పొరేట్‌ ఇండియా ఫిట్‌నెస్‌ రిపోర్ట్‌’లో వెల్లడించింది. ప్రొటీన్లు తక్కువ తిని, కొవ్వు పదార్థాలున్న పదార్థాలు ఎక్కువగా తినడం వల్లనే సహజంగా స్థూలకాయం వస్తుందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. (చదవండి: ఈ ‘టీ’ తాగితే బరువు తగ్గొచ్చు!!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top